Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 17 December 2014

ONLY WOMEN CAN VISIT TEMPLE AT THIRUVANTHAPURAM SRI ATTUKALAMMA BHAGAWATHI TEMPLE


 స్త్రీలు మాత్రమే దర్శించే క్షేత్రం

మానవజన్మనెత్తి మానవాతీత శక్తులను ప్రదర్శిస్తూ దైవాంశ సంభూతులుగా ప్రసిద్ధి చెందినవారు ఎందరో వున్నారు. ఈ నేపథ్యంలో ఎందరో స్త్రీలు తమకి జరిగిన అన్యాయానికి నిరసిస్తూ, అందుకు కారకులైనవారికి తగిన గుణపాఠం చెప్పిన దాఖలాలు వున్నాయి. వీరిని జానపదులు అమ్మవారి అంశావతారంగా భావిస్తూ ... గ్రామదేవతగా ఆరాధిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆవిర్భవించినదే 'శ్రీ ఆట్టుకాలమ్మ భగవతి క్షేత్రం'.

మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం, కేరళలోని 'తిరువనంతపురం'లో దర్శనమిస్తుంది. అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించడానికి గల కారణాలను పరిశీలిస్తే, ఓ ఆసక్తికరమైన జానపద కథ వినిపిస్తుంది. పూర్వం కన్నగి - కోవలన్ అనే దంపతులు ఉండేవారు. పేదరికం తమ పట్ల విశ్వరూపాన్ని చూపుతున్నా వాళ్లెప్పుడూ చింతించలేదు. తమ పరిస్థితిని భగవంతుడి చెంత ఏకరువు పెడుతూ ఆయనని నిందించనూలేదు.

అలాంటి పరిస్థితుల్లో చేయని నేరానికి కోవలన్ శిక్షించబడతాడు. మహాపతివ్రత అయిన కన్నగి, తన భర్తను అంతం చేసిన పాండ్యరాజు ఆస్థానంలో మహా విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఆ తరువాత ఆమె అక్కడి నుంచి వెనుదిరిగి వెళుతూ అలసిపోయిన కారణంగా ఈ ప్రదేశంలో సేదతీరిందట. ఈ ప్రదేశంలోనే నేడు మనకి ఆమె ఆలయం దర్శనమిస్తుంది. ఆ రోజున అలసిన ఆమెకి ఇక్కడి గ్రామస్తులు ఆహారంగా ఏవైతే అందించారో, అవే నేటికీ నైవేద్యంగా సమర్పిస్తుంటారు.

ప్రశాంతమైన వాతావరణంలో ... విశాలమైన ఆవరణలో నిర్మించబడిన ఈ ఆలయం, అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది. కన్నగిని అమ్మవారి అవతారంగా భావించి అందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వుంటారు. ఆమె ఆవేదనను చల్లార్చి ఆనందాన్ని కలిగించడానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

ప్రతి సంవత్సరం మార్చి నెలలో పది రోజులపాటు ఉత్సవాలను జరుపుతుంటారు. వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను తిలకించడానికి వేలాదిగా మహిళా భక్తులు తరలి వస్తుంటారు. అమ్మవారి అనుగ్రహాన్ని ఆశిస్తూ ఆమెకి కానుకలు ... మొక్కుబడులు చెల్లిస్తుంటారు. శబరిమలను పురుషులు మాత్రమే దర్శించునట్టు, స్త్రీలు మాత్రమే ఆట్టుకాలమ్మను దర్శిస్తూ వుండటం ఇక్కడి విశేషం.