Search This Blog

Chodavaramnet Followers

Monday 1 April 2013

GOD''S GRACE TELUGU CHILDRENS STORY




పాలెం అనే గ్రామంలో రాజయ్య, భోజయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. రాజయ్యకు దైవభక్తి మెండు. చుట్టుపట్ల ఉండే దేవాలయాల్లో నిర్వహించే ప్రతికార్యక్రమానికి హాజరయ్యేవాడు. మిత్రుడు భోజయ్యకేమో ధనసంపాదనపై అమితాసక్తి ఎక్కడి కెళ్లినా ఏ కార్యక్రమాన్ని చేపట్టినా అందులో ఎలా డబ్బు సంపాదించాలా అని ఎప్పుడూ యోచిస్తుండే వాడు.

ఒకరోజు ఇద్దరు మిత్రులు పొరుగూరి వేంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలకు వెళ్లారు. ఎందరో భక్తులు అక్కడికి విచ్చేశారు. మంచినీటి సరఫరా లేక వారంతా ఇబ్బందిపడడం కళ్లారా చూసిన రాజయ్య తన డబ్బు వెచ్చించి భక్తులకోసం ఓ చలివేంద్రం ఏర్పాటుచేశాడు .వచ్చిన భక్తులకు నీరు సక్రమంగా అందేలా చూడమని స్నేహితుడికి చెప్పాడు.

''సరే అని ఒప్పుకున్న భోజయ్య చలివేంద్రానికి నీటికోసం వచ్చిన భక్తులకు ''భక్తులారా! మీరంతా మీమీ పాదరక్షలను పక్కన ఏర్పాటు చేసిన కౌంటర్‌లో అప్పగించి వచ్చి, మీ దాహం తీర్చుకుని వెళ్లేటప్పుడు కౌంటర్‌లో తలా ఒక రూపాయి చెల్లించి మీ పాదరక్షలు వేసుకునిపోవచ్చు అని చెప్పసాగాడు. అలా భోజయ్య భక్తుల నుండి అయిదువందల రూపాయలు సంపాదించాడు.
ఉత్సవాల జాతర ముగిసిన వెంటనే రాజయ్య, భోజయ్యలు తిరిగి తమ గ్రామానికి చేరుకున్నారు. బాగా అలిసిపోయినందున రాజయ్య భోజనంచేసి పడుకున్నాడు. బాగా నిద్రపట్టింది. నిద్రలో అతనికి ఓ వింత కల వచ్చింది. వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమై, ''రాజయ్యా! నా భక్తులకు చలివేంద్రం ఏర్పాటుచేసి వారి దాహంతీర్చి నీవ్ఞ పుణ్యం సంపాదించుకున్నావ్ఞ. కాబట్టి  నీకోసం బంగారు కాసులను నేను ఆకాశం నుండి కురిపిస్తాను. నువ్ఞ్వ వాటిని స్వీకరించి నీ జీవితాన్ని చక్కదిద్దుకో అని ఆ స్వామి మాయమైపోయాడు.

తెల్లవారి మేల్కొన్న రాజయ్య భార్యకు కల విషయం చెప్పాడు. కానీ ఆమె తన పని ఒత్తిడిలో పెద్దగా పట్టించుకోలేదు. భార్యపెట్టిన చద్దన్నం తిని రాజయ్య తన పొలానికి వెళ్లాడు. నాగలి పట్టి పొలం దున్నుతుండగా నాగటిచాలులో ఓపెట్టె కనిపించింది. తీసి చూడగా అందులో బంగారుకాసులున్నాయి. ఏం అనుకున్నాడో ఏమో తిరిగి పెట్టెను అదే చాలులో పూడ్చి తిరిగి ఇంటికి వచ్చి భార్యతో దొరికిన పెట్టె సంగతి చెప్పాడు. అది విన్న భార్య, ''మీ కల నిజమైందండీ. ఆ స్వామి కరుణించాడు. పెట్టెను తీసుకునిరాక తిరిగి అక్కడే ఎందుకు పూడ్చిపెట్టి వచ్చారు అంది.

''అది కాదే, ఆస్వామి నాకోసం పైనుండి బంగారు కాసులను కురిపిస్తానన్నాడు.అలా కురిపించిన కాసులే మనం తీసుకోవాలి. ఇవి ఎవరో, ఎప్పుడో భూమిలో పాతిపెట్టినవి. అందుకే తీసుకురాలేదు అన్నాడు రాజయ్య.

''మీ చాదస్తం పాడుగాను. మీరు బాగుపడకున్నా పొరుగువారు బాగుపడాలనేదేగా మీ సిద్దాంతం. మీ మిత్రుడైన భోజయ్యకు ఈ పెట్టె విషయం చెప్పండి. అతనైనా తెచ్చుకుని బాగుపడతాడు అంది.

సరేనన్నాడు రాజయ్య. మర్నాడు రాజయ్య పెట్టె విషయాన్ని మిత్రుడి చెవిలో వేశాడు. తక్షణమే భోజయ్య, రాజయ్య పొలానికి వెళ్లి ఆ పెట్టెను తీసుకునివచ్చి తన పడకగదిలో రాత్రి తెరిచి చూశాడు. ఆపెట్టెనిండా ఇనుపతేళ్లు దర్శనమిచ్చాయి. వాటిని చూచి తన మిత్రుడు రాజయ్య తనకు అపకారం తలపెట్టాడని తలచి వెంటనే ఆ పెట్టెను తీసుకుని రాజయ్య ఇంటికి చేరుకున్నాడు.
అప్పుడే పడకపై పడుకుంటున్న రాజయ్య పైన,  గది వెంటిలేటర్‌ నుంచి పెట్టెమూతతీసి ఆ పెట్టెను  విసిరేసి పారిపోయాడు భోజయ్య. పెట్టెలోని బంగారు కాసులు రాజయ్యపైన పడ్డాయి. రాజయ్య వాటిని స్వామి తనకోసం పైనుంచి కురిపించాడని తలచి ఏరి ఆ పెట్టెలో వేసి తలకింద పెట్టుకుని హాయిగా నిద్రపోయాడు.

భళ్లున తెల్లవారింది.''ఏమండీ లేవండి. మీ మిత్రుడు భోజయ్య రాత్రి ఇనుపతేలు కరిచి చనిపోయాడట. ఊరంతా చెప్పుకుంటున్నారు  భార్య, రాజయ్యను లేపింది.

''అరే! నీకు నేను ఓ శుభవార్త చెప్పాలనుకుటే నీవ్ఞ అశుభవార్త చెప్పావే, సరే ఈ బంగారు కాసుల పెట్టెను జాగ్రత్తగా బీరువాలో దాచిపెట్టు. నేను వెళ్లి భోజయ్య కుటుంబాన్ని పలకరించివస్తా అంటూ  హడావ్ఞడిగా వెళ్లాడు రాజయ్య.

రాజయ్య భార్య, పెట్టెలోని బంగారు కాసులను చూసుకుని మురిసిపోయింది. ఈ పెట్టె తీసుకుని భోజయ్య బాగుపడతాడని భర్తకు చెప్పిన మాటను గుర్తుచేసుకుని అర్థంకాక ఆమె ఎవరికి ఎంత రాసి ఉంటే అంతే జరుగుతుందనుకుంది.