Search This Blog

Chodavaramnet Followers

Wednesday 13 March 2013

SECRETS OF UNDER GROUND EARTH AN ARTICLE ON EARTH IN TELUGU





భూమి కేంద్రం వద్ద ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. అందుకే రచయితలు, శాస్త్రవేత్తలు ఎన్నెన్నో ఊహాగానాలు చేసేస్తున్నారు. ఇటీవల అందుబాటు లోకి వచ్చిన అత్యధిక పీడనాలు, అధిక ఉష్ణోగ్రతలు పుణ్యమా అని ఇంతవరకూ ఉన్న సిద్ధాంతాలపై కొత్తకొత్త భాష్యాలు చెపుతున్నాయి.

విచిత్రం ఏమిటంటే సుదూరాల్లో వున్న చంద్రుడు, ఇతర గ్రహాల మంచి చెడ్డలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మానవ సహిత రోదసినౌకలను కూడా ప్రయోగిస్తున్న మనిషి తన కాళ్లక్రింద వున్న భూమిలో పూర్తిగా ఏముందో తెలుసుకోలేకపోతు న్నాడు. భూమిలోపలికి బోర్‌హోల్స్‌ తవ్వినా కొన్ని డజన్లకిలోమీటర్లు మాత్రమే తవ్వగల్గుతున్నాడు. అగ్ని పర్వతాల నుండి తన్నుకుని బయటకు వస్తున్న 'లావా' మొత్తం భూమిలో ఏముందో చెప్పలేదు కదా!

భూమి నిర్మాణాకృతి : మన భూమి ఉల్లిపాయమాదిరి అనేక పొరలు కల్గి ఉంది. సాగరాల కింద భూమి దాదాపు ఏడు కిలోమీటర్ల దళసరిలో గట్టిగా ఉండే చల్లని రాతిభాగంతో నిర్మితమై ఉంది. ఇక ఖండాల కింద ఈ రకంగా ముప్ఫయి అయిదు కిలోమీటర్ల దళసరిలో ఉంది.

గట్టిగా వున్నా ఈ పొరలోపలికి వెళ్ళేకొద్ది వేడిగా ఉంటుంది. అంతేకాదు. దీనికి ప్లాస్టిక్‌ తత్త్వం కూడా ఉంటుంది. ఈ గట్టి నేలభాగం దిగువన మన చందమామ పరిమాణంలో లోపల ఘనస్థితిలోను చుట్టూ ద్రవస్థితిలోను ఇనుము ఉంది. నిజానికి భూమి 99శాతం పరిపూర్ణ ఏకకేంద్ర పొరలున్న ఉల్లిపాయి మాదిరి ఉంది. మిగిలిన ఒకటి శాతం తేడాకు కారణం భూతలం పై సాంద్రతలలో హెచ్చుతగ్గులు, ఉష్ణోగ్రతా భేదాలు వంటివి. వీటి వల్లనే భూ అంతర్భాగంలో జరుగుతున్న చర్యలు నైజం తెలుసుకునే అవకాశం లభిస్తోంది. ఈ విధంగా భూమి అంతర్భాగంలో యిరవై తొమ్మిది వందల కిలోమీటర్ల లోతు వరకూ ఉంది. అయితే ఈలోతుకు వెళ్లేసరికే ఎన్నెన్నో పొరలు దాటవలసి వస్తుంది. ఈ పొరల నుండే భూకంప తరంగాలు పరావర్తనం చెంది వెనుతిరిగి వస్తున్నాయి.

ఈ భాగంలోని రాళ్ళు, ఇతర పదార్థాలన్నీ రేడియో ధార్మిక విఘటనం వల్ల ఉత్పత్తి అయ్యే వేడివల్ల వేడెక్కుతున్నాయి. ఈ వేడి వల్ల పదార్థం ఉష్ణసంవహాన చర్యమాదిరి వేడి పదార్థాలపైకి చల్లని పదార్థాలు క్రిందికి స్థిరపడుతున్నాయి.

అగ్నిపర్వతాలు : ఈ వేడి పదార్థాలు తమ శక్తితో భూమి నుండి బయటకు పడడం కొన్నిచోట్ల జరుగుతోంది. అవే అగ్నిపర్వతాలు. సముద్రాల అడుగున ఉన్న అగ్నిపర్వతాలు విజృంభించి అవి కొంత ఎత్తుకు ఎదిగి చల్లారుతాయి. ఈ విధంగా ఎత్తుకు ఎదిగిన పర్వతాలు సముద్రంలో దీవిగా తయారవుతాయి. హావాయి దీవులు ఇలా తయారైనవే.

ఉత్తర అట్లాంటిక్‌ సము ద్రంలో 'సర్టసి' అగ్ని పర్వతం విజృంభించి ఒకదీవిని ఏర్పర చింది. ఆరువందల తొంభయి రెండు ఎకరాల విస్తీర్ణత గల ఈ దీవిని 'సర్టసి' దీవి అని పిలుస్తున్నారు.

అగ్ని పర్వతాల విజృంభణ వల్ల జీవరాశిమనుగడకు కావలసిన వాతావరణం భూమి మీద సమకూరింది. అగ్ని పర్వతాలు విజృంభించి వుండక పోతే ఈ భూగ్రహం కూడా నిర్జీవంగా ఉండేది.

భూ కేంద్రం వద్ద ఏమి జరుగుతోంది?

ప్రత్యక్షంగా ఈ సంగతి తెలుసుకోవడం కష్టం. కాని నమూనాకు ఒక రాయిని తీసుకుని దానిమీద అత్యధిక పీడన, ఉష్ణోగ్రతలు కలుగజేసి ఏమి జరుగుతుందో తెలుసుకోవచ్చు కదా? అన్పిస్తుంది. అది అంతసులభం కాదు.

భూకేంద్రంలో వున్న పీడన, ఉష్ణోగ్రతలను అంత తేలిగ్గా సృష్టించడం వీలుకాదు. అయితే హైడ్రాలిక్‌ యంత్రాల సహయంతో పీడనాన్ని కల్గించారు. ఈ పీడూలు పరిమాణం ఎంత తక్కువ అంటే అటువంటి పీడనాలు కొన్ని వందల కిలోమీటర్ల లోతులో భూమిలో ఎదురవుతాయి. మరి ఇంకా ఎక్కువ పీడనాలు కావాలి ఎలా? కాలిఫోర్నియాలో థామస్‌ అనే ఒక ప్రొఫెసర్‌ హెచ్చుపీడనం సృష్టించేందుకు రెండు దశలుగల భారీ తుపాకీలనుపయోగించి సెకనుకు 7నుండి 8 కిలోమీటర్ల వేగంతో అందలి 15 గ్రాముల గుండు బయటకు వచ్చేటట్లు చేయగలిగాడు.

ఈ బుల్లెట్‌(గుండు) ఒక ఖనిజ నమూనాను ఢ కొందంటే అది భూకేంద్రంలో ఉండే ఉష్ణోగ్రత, పీడనాలను కలుగజేసి షాక్‌ తరంగాలను నమూనాలో ఏర్పరుస్తుంది. కాకపోతే ఈ కథంతా సెకనులో మిలియనోవంతు కాలంలో అయిపోతుంది. ఈ సమయంలో మైక్రోస్కోప్‌లు, డిటెక్టర్‌లు ఉపయోగించి విశ్లేషణలు చేయాలి. ఈ కార్యక్రమంలో తీసుకోవాల్సిన టార్గెట్‌ గట్టిది ఉండాలి. అంతే వజ్రాన్ని వాడాలి. అయితే పరిశోధనల్లో పెద్ద వజ్రాలు వాడే అవకాశం ఉండదు. అందువల్ల సూక్ష్మ పరిమాణంలోనే దీనిని తీసుకుంటున్నారు.

భూకేంద్రం స్థితి : మొత్తం మీద పరిశోధనల పుణ్యమా అని భూకేంద్ర స్థితిని అంచనాలు వేశారు. భూకేంద్రం సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంది. అయితే ఇంత వేడి దీనికి ఎలా వచ్చింది అనేది మొదటి ప్రశ్న. భూమి ఏర్పడిన స్థితిని గుర్తు చేసుకుంటే దీనికి జవాబు లభిస్తుంది. భూ కేంద్రానికి భూమి పెచ్చుకి మధ్య నిర్మాణాకృతి అంత ఆషామాషిగా లేదు. భూ కేంద్రం వద్ద సుమారు 5వేల డిగ్రీల కెల్విన్‌ ఉష్ణోగ్రత వున్నా అంతటి హెచ్చుపీడనం దానిమీద ఉండడం వల్ల అదంతా ఘనస్థితిలో ఉంది. పూర్తిగా ఇదంతా ఇనుము. కొద్దిగా నికెల్‌తోమిశ్రమం చెంది ఉండవచ్చు.

భూమి చల్లారడం మొదలు పెట్టడంలో భూకేంద్ర భాగం వద్ద పదార్థం పోగుపడడం మెల్లిగా పెరిగింది. భూకేంద్రం సెకనుకు వెయ్యిటన్నుల చొప్పున ఘనస్థితికి రావడం జరిగింది. చాలా వేగంగా చల్లబడుతున్నట్లనిపించినా మొత్తం భూకేంద్ర భాగంలో నాల్గుశాతం మాత్రమే ఘనస్థితికి వచ్చింది. అందుకే రాబోయే బిలియన్‌ సంవత్సరాల వరకు భూమికి అయస్కాంతత్త్వము ఉంటుందని ఈ పరిశోధకుల జోస్యం. నిజానికి రేడియో థార్మిక విఘటనము వల్ల విడుదలయ్యే వేడికి తోడుగా గడ్డకట్టే భూకేంద్రభాగం విడుదల చేసే వేడి కూడా ఉంటోంది. వీటన్నిటి ఫలితంగా భూ ఉపరితలంలో అయస్కాంత క్షేత్ర తీవ్రతలలో మార్పు సంభవిస్తోందని ఒక పరిశీలన. పరిశో ధనలు ఇంకా కొనసాగుతున్నాయి.