తల్లి దగ్గర పాలు తాగటం అలవాట యిన పిల్లలతో స్తన్యం మానిపించటం కొంత కష్టమే అవుతుంది. తల్లి ఒడిలో పడుకుని మాతృస్పర్శను అనుభవిస్తూ పాలు తాగడం పిల్లలకు మహదానందంగా ఉంటుంది. ఆ సాన్నిహిత్యం తల్లీ బిడ్డల మధ్య అనురాగ బంధాన్ని దృఢతరం చేస్తుంది.
పిల్లలకు తల్లి పాలే శ్రేష్టమనే విషయం అందరూ ఒప్పుకునే నిజం. అయిదారు నెలల వయసు వచ్చేవరకూ తల్లిపాలే సంపూర్ణాహారంగా సరిపోతాయి. ఈ సమయంలో మధ్య మధ్యలో కొంచెం ఉప్పు కలిపిన గోరువెచ్చని నీరు పట్టడం తప్ప మరే ఆహారం ఇవ్వవలసిన అవసరం ఉండదు. మొదటి నెలలో తల్లిపాలు తాగటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండటమేగాక వారిలో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయిదారు నెలలు దాటిన తర్వాత పాలు ఒక్కటే సరిపోవు. ఘనాహారం కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఆరునెలలు దాటిన తర్వాత పిల్లలతో క్రమంగా పాలు మాన్పిస్తూ ఘనాహారాన్ని అలవాటు చేయాలి. కానీ అప్పటి వరకూ తల్లి దగ్గరపాలు తాగటం అలవాటైన పిల్లలు మానేయడానికి ఒక పట్టాన ఇష్టపడరు. తెగ ఏడుస్తారు. ''మా అమ్మాయి నా దగ్గర పాలు తాగితే కాని నిద్రపోదు. మధ్య మధ్యలో కూడా నా కోసం వెతుకుతుంటుంది. నేను పక్కలో లేకపోతే ఏడుస్తుంది. పాలు ఎలా మాన్పించాలో అర్ధం కావడం లేదు'' అనే తల్లులు ఎంతో మంది వున్నారు. పాలు మాన్పించే ప్రక్రియ అనేది కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారమే.
అయిదు నెలల ప్రాయం నుంచే చిన్నారులకు ఘనాహారం ఇవ్వటం మొదలుపెట్టాలి. అప్పట్నుంచి తల్లి పాలివ్వటం తగ్గించాలి. ఏడాది పూర్తయ్యేసరికి ఈ ప్రక్రియను పూర్తిగా మానేయాలి. కొంత మంది తల్లులు ఏడాది పూర్తయినా తమ పిల్లలకు పాలు ఇస్తూనే ఉంటారు. అది వారి ఇష్టాన్ని బట్టి, ఆ తల్లీబిడ్డల అనుబంధాన్ని బట్టే వుంటుంది. అయితే శిశువుకు సంవత్సరం పూర్తయిన తర్వాత తల్లిపాలు ఇవ్వనవసరం లేదు. అప్పటికి వారికి తల్లిపాల అవసరం తీరిపోతుంది. అదనపు పోషకాహారం అవసరమవుతుంది. కనుక ఘనాహారం ఇస్తూ శిశువుల ఆకలిని తీర్చాలి.
తల్లిపాలు మాన్పించటం ఎలా అనే సమస్య కొంత మంది తల్లులకు ఎదురవుతుంది. ఈ అలవాటును పిల్లలు ఒక పట్టాన వదలరు. వారి మూడ్‌ని బట్టి వ్యవహరిస్తూ పిల్లలతో మాన్పించాల్సిన అవసరం ఉంది. కొంత మంది అలవాటు మాన్పించడానికి పాలపీకను నోట్లో ఉంచుతారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. కావాలని పాలపీకను చప్పరించటం అలవాటు చేసినట్లవుతుంది. తర్వాత ఈ అలవాటును మాన్పించలేక అవస్థపడాల్సిన పరిస్థితి వస్తుంది. స్కూలు కెళ్ళినా పాలపీకను మర్చిపోలేక, దానికి బదులుగా తమ బొటన వేలును నోట్లో వేసుకుని చప్పరిస్తూ మానసిక సంతృప్తిని పొందు తారు. కాబట్టి ఓర్పుగా పిల్లలను బుజ్జగిస్తూ, పాలుతాగే అలవాటును మాన్పించాలి. ఈ విషయాన్ని తల్లులందరూ గుర్తుపెట్టుకోవాలి.
కొన్ని నెలలుగా తల్లిదగ్గర పాలు తాగటం అలవాటైన శిశువులకు, ఈ అల వాటు మానిపిస్తే దిగులు పడతారు. లేనిపోని అనారోగ్యాలు కూడా తెచ్చుకుం టారు. ఇలా జరగకుండా ఉండాలంటే, ఒక్కసారిగా కాకుండా అంచెలంచెలుగా మాన్పించాలి. మొదట్లో ఒక ఫీడింగ్‌కు మరో ఫీడింగ్‌కు మధ్య ఉండే వ్యవధిని పెంచాలి. శిశువు ఏడుస్తున్నాడు కదాని పాలు ఇవ్వడానికి సిద్ధపడకూడదు. అలాంటి సందర్భాల్లో వారి దృష్టిని మార్చే ప్రయత్నం చేయాలి. అలాగే నమ్మకస్తులైన వారిని పిల్లల దగ్గర ఉంచి తాము కొంచెం దూరంగా మసలుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కొత్తవారు తమను బుజ్జగిస్తున్నప్పుడు పిల్లలు పాలు తాగాలని పేచీ పెట్టరు. ఇటువంటి ప్రయత్నాల ద్వారా ఒక్కసారిగా కాకుండా ఒక క్రమపద్ధతిలో పిల్లలతో తల్లిదగ్గర పాలు తాగే అలవాటును మాన్పించాలి.