Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 10 February 2016

STORY ABOUT KING VIKRAMARKA


విక్రమార్కుడు

విక్రమార్క చక్రవర్తి బలపరాక్రమ సంపన్నుడు. అయన వితరణమునకు గని. వివేకమునకు స్థానము. సజ్జనులకు సంతోషమును కలిగించుచు శత్రుజనులకు దుర్నిరీక్ష్యుడై విక్రమార్కుడు ఉజ్జయినీ నగరమును పాలించుచుండెను.

ఆ భాపాలుడు ఒకనాడు మృగ వేటకై అడవికి వెళ్ళి భీకర మృగములను వేటాడి, మిక్కిలి అలిసిపోయి ఒక చెట్టు క్రింద శయనించెను. ఇంతలో దేవదత్తుడనే బ్రాహ్మణుడు అచటికి వచ్చి, చక్రవర్తని గాంచి జలములతో వాని సేదతీర్చెను. విక్రమార్క చక్రవర్తి తన పురమునకు తిరిగి, మరునాడు వానిని పిలిచి రాజ పురోహితునిగా నియమించెను. ఒకనాడు కొలువులో ప్రసంగవశమున అడవిలో తనకు చేసిన ఉపకారమునకు బ్రాహ్మణునికి ప్రత్యుపకార మేదైన చేయవలేను. ఆ రోజు ఎప్పుడు వచ్చునో - అని పలికెను. దేవదత్తుడు చక్రవర్తి సన్నిహితుడై, అతని ప్రవర్తనతో సత్కీర్తి పొందెను. ఇట్లుండగా ఒకనాడు సర్వాభరణ భూషితుడై ఆడుకొనుచున్న రాజకుమారుని ఎవరు చూడకుండా తన ఇంటికి గొనిపోయెను. రాజభటులు పట్టణములో సర్వమును శోధించి రాజకుమారుని జాడ కనుగొనలేకపోయిరి. ఇంతలో అంగడిలో ఆభరణములను అమ్ము బ్రాహ్మణుని పట్టితెచ్చి రాజ సమ్ముఖమున ఉంచిరి.

విక్రమార్కుడు విప్రునితో సముచితముగా సంభాషించి నిజము చెప్పుమని కోరెను. అలంకారములపట్ల ఆసక్తితో రాజకుమారుణ్ణి వధించితిని అని విప్రుడు సమాధానమిచ్చెను. సభలోని వారందరు అట్టి దుష్కృత్యమొనర్చిన వానిని సహింపరాదని పల్కిరి. కృపలేక నృపకుమారుని వధించిన వానిని శిక్షించుటకై భటులు వానిని ఈడ్చుకుని పోవుచుండగా విక్రమార్కుడు వారిని తిరిగి కొలువునకు పిలిపించి అందరు వినుచుండగా "ఇతడు మున్ను వనములో పడిపోయి ఉన్న నాకు ప్రాణదానము చేసినవాడు. కాబట్టి వీడెంత అపకారము చేసినను సహించుటయే ధర్మము. ఆనాడు అతడు సహాయము చేయకున్నచో నాకీ విభవ మెక్కడిది? ప్రాణదానము చేసిన వాని ప్రాణములు తీయు నీచున కెట్టి పాపము వచ్చునో.." అని పలికెను. రాజు సభ్యవచనములకు సభ యంతయు మిక్కిలి సంతసిల్లెను.

ఆ విప్రుడు పరుగున తన ఇంటికి వెళ్ళి, దాచి ఉంచిన రాజకుమారుని సమర్పించి, "మహా ప్రభూ! నా పట్ల కరుణతో నాకు సన్మానము చేయవెలెనని చక్రవర్తులు భావించుచున్నారని ఆ నోట, ఈ నోట వింటిని. యధార్థమును తెలిసికొనుటకై ఇట్లు చేసితిని" అని విన్నవించెను.
విక్రమార్కుడు ఆశ్చర్యపడి ఆ బ్రాహ్మణునకు అనేకములగు మణిభూషణములను బహుకరించెను. ప్రభువు ఔదార్యమునకు సభ్యులు విస్మయమొందిరి. సత్యవచన ప్రత్యుపకార పరాయణుడైన విక్రమార్కుడు పెక్కేండ్లు పరిపాలన మొనరించెను.