ఎముకల ఆరోగ్యానికి తేనీరు!
తేనీటిని ఆస్వాదించేందుకు మరో మంచి కారణం దొరికింది! తేనీరు తాగడం ద్వారా ఎముకలు బలిష్టంగా మారతాయనీ, తుంటి సహా ఎముకలు విరిగే ముప్పును తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. రోజుకు మూడు కప్పుల తేనీటితో ఆస్టియోపొరోసిస్‌తో ఎముకలు విరిగే ప్రమాదం 30 శాతందాకా తగ్గుతుందని ఆస్ట్రేలియా ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో భాగంగా.. సగటున 80 ఏళ్ల వయసున్న 1200 మంది వృద్ధ మహిళలను పదేళ్లపాటు పరిశీలించారు. కనీసం రోజుకు మూడు కప్పుల తేనీరు తాగిన వారిలో ఎముకలు విరిగే ముప్పు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు.
ఫ్లేవనాయిడ్స్ వంటి వృక్షరసాయనాలు కొత్త ఎముక కణాల నిర్మాణాన్ని వేగవంతం చేయడంతోపాటు, ప్రస్తుత కణాల క్షీణతను నెమ్మదింపజేయడం ద్వారా ఎముకల్ని బలిష్టంగా మార్చుతుండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రభావం వృద్ధుల్లో కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు.