Search This Blog

Chodavaramnet Followers

Monday, 12 January 2015

TELUGU ARTICLE AND STORY ABOUT THE LEGENDARY FEMALE WRITER - KAVAYITHRI MOLLA



కవయిత్రి మొల్ల


క్రీ.శ.15 వ శతాబ్ది చివరి భాగంలో జీవించి ఉండవచ్చని భావిస్తున్న కవయిత్రి మొల్ల రచించిన రామాయణమే "మొల్ల రామాయణం" గా ప్రసిద్ధికెక్కింది.తెలుగులో రెండవ కవయిత్రి మొల్ల(అన్నమయ్య అర్ధాంగి తాళ్ళపాక తిమ్మక్క తరువాత). మొల్ల అంటే గ్రామీణ భాషలో అర్థం "మల్లె".శ్రీ కంఠమల్లేశ్వరుని దయవల్ల కవిత్వం అలవడిందని చెప్పినది.ఈమె నెల్లూరు ప్రాంతానికి చెందినట్లు ఊహిస్తున్నారు.మొల్ల వాల్మీకి రామాయణం ఆధారంగా స్వతంత్రంగా,సంక్షిప్తంగా రామాయణం రచించింది.ఈమె తండ్రి పేరు ఆతుకూరు కేసన శెట్టి.ఆయన శివభక్తిపరుడని,గురులింగ జంగమార్చన పరుడని మొల్ల పేర్కొంది.అందువల్లే ఈమెను "బసవి" అని కూడా పిలిచేవారని తెలుస్తోంది.మొల్ల పరమేశ్వరుడే తన గురువని పేర్కొంది.ఈమెపై పోతన ప్రభావం చాలా ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. పోతన లాగే ఈమె కూడా శైవురాలైనా విష్ణువును గూర్చి రచనలు చేసింది. ఈమె తన రచనలను పోతన లాగే రాజులకు అంకితం ఇవ్వలేదు. తన రామాయణాన్ని మొల్ల శ్రీరామచంద్రునికి అంకితం చేసింది.ఈమెకు "ఆంధ్రభోజుడు" శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో తను రాసిన రామాయణాన్ని వర్ణించే అవకాశం వచ్చిందని చెప్తారు.ఈమె అవసాన దశలో "శ్రీశైల మల్లిఖార్జును"ని సేవిస్తూ గడిపిందని భావిస్తున్నారు.

"ఉన్నాడు లెస్స రాఘవు
డున్నాడిదె కవుల గూడియురు గతిరానై
యున్నాడు నిన్ను గొనిపో
నున్నడిది నిజము నమ్ముముర్వీతనయా"

ఈ పద్యం మొల్ల ప్రతిభకి గీటురాయి.సీతకు రాముని గురించి ఆందోళన ఉంది.దానిని పోగొట్టటానికి "నేను రాముడ్ని చూసివచ్చాను" అని చెప్పాలి. కాని మొల్ల పాత్రౌచిత్యంతో క్రియతో ప్రారంభించి "ఉన్నాడు లెస్స..." అనటం అమె కవితా నైపుణ్యమే.శ్రీరాముడితో చెప్పేటప్పుదు కూడా హనుమంతుని నోట మొల్ల "కంటిన్ జానకిబూర్ణచంద్రవదనన్ గల్యాణినా లంకలో" అనిపించటంలో ఎంత ఔచిత్యం ఉందో తెలుస్తుంది.

హనుమంతుడు లంకనుంచి సీతను తీసుకుని వెళ్ళిపోతాను అని ఆవేశంగా అన్నాడు. హనుమంతుని ఆత్రుత అటువంటిది.కాని అది సముచితమా అని ఆలోచించగల మనస్థైర్యం గలది సీత.అందుకే ఆ విధంగా తీసుకెళ్తే "రావణుకన్న మిక్కిలి భూవరుడే దొంగయండ్రు"అని సర్ధిచెప్పింది.

మొల్ల కేవలం వాలీకి రామాయణాన్ని మాత్రమే అనుసరించలేదని ఆధ్యాత్మ రామాయణం,భాస్కర రామాయణాలను అనుసరించి మనోహరమైన కల్పనలు చేసిన విషయాన్ని "సమగ్రాంధ్ర సాహిత్యం" లో ఆరుద్ర గారు చక్కగా వివరించారు.

మొల్ల భాస్కర రామాయణాన్ని అనుసరించి కొన్ని చేర్పులు,మార్పులు చేసి తన ప్రతిభకు సానపట్టినట్లు చేసుకొన్నది. పరశురాముడు "రాముడున్ గీముండనుచు"అనటం, "శివుని చివుకు విల్లు" అనడం మొల్ల శబ్ధ వైచిత్రికి తార్కాణం.మొల్లకి కవిత్వం ఏ విధంగా చెప్పాలో తెలుసు.ఏ విధంగా చెప్పకూడదో అంతకంటే బాగా తెలుసు.

"కందువమాటలు సామెత
లందముగా గూర్చి చెప్ప నది తెలుగునకుం
పొందై రుచియై వీనుల
విందై మఱి కానిపించు విబుధుల "

అని పేర్కొన్న మొల్ల ఆ పొందును,వీనుల విందును రామాయణం ద్వారా తెలుగు వారికి రుచి చూపించింది.తెలుగు కవయిత్రులలో అద్వితీయురాలు మొల్ల.