Search This Blog

Chodavaramnet Followers

Monday 12 January 2015

ARTICLE AND STORY OF THE GREAT LEGENDRY WRITER - SRI SRI SRI YERRA PRAGADA GARU IN TELUGU


ఎఱ్ఱాప్రగడ

సుమారు క్రీ.శ.1280-1360 ప్రాంతం నాటి ఎర్రన్న ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి.గురువైన శంకరస్వామి వల్ల ఎర్రన్న కూడా శివభక్తుడై "శంభుదాసుడు" అనే బిరుదు పొందాడు.వేగినాడులోని కరాపర్తి గ్రామంలోనో,పాకనాడులోనో,గుడ్లూరులోనో ఎర్రన్న జీవించి ఉంటాడు.ఈయనకు "ప్రబంధ పరమేస్వరుడు" అనే బిరుదు కూడా ఉంది.ఎర్రన్న రామాయణం,హరివంశం,భారతంలో అరణ్యపర్వ శేషం ,నృసింహపురాణం రచించాడు.
ఎర్రన్న "కవిత్రయం" లో ఒకడనీ,మహాభారత రచనలో నన్నయ్య వదలిన అరణ్య పర్వంలోని మిగిలిన భాగాన్ని పూరించాడనీ మనకు తెలిసిన విషయమే.ఇది రూఢిగా ప్రసిద్ధికెక్కింది.
కాని పూర్వం పండితులు ఈ విషయమై వాదోపవాదాలు చేశారు.

నన్నయ్య మూడు పర్వాలను రచించి ఉంటాడు.దీనికి చూపించే ఆధారాలు-
తిక్కన "అందాది దొడంగి మూడు కృతులాంధ్ర కవిత్వ విశారదుండు విద్యాదయి తుండొనర్చె మహితాత్ముడు నన్నయ్య భట్టుదక్షతన్"అని నన్నయ్య మూడు పర్వాలూ రాసినట్టు చెప్పడం.

మారన భారత సంహితన్ మును ద్రిపర్వములెవ్వడొనర్చెనట్టి....నన్నయ్య భట్టు గొల్చెదన్" అని మార్కండేయ పురాణంలో పేర్కొన్నాడు.కాబట్టి నన్నయ్య మూడు పర్వాలూ రాసి ఉంటాడు,చివరి భాగం శిథిలమై(తాటాకులు కదా!) వుంటే,ఆ శిథిలభాగాన్నిపూరించి ఉంటాడు-అని ఒక వాదం.

కానీ నన్నయ్య తాళపత్ర గ్రంథం కేవలం ఒక ప్రతిమాత్రమే ఉండదు.చాలా ప్రతులు ప్రచారంలో ఉండగా ఒకేవిధంగా అన్ని ప్రతులూ శిథిలమవుతాయా?తిక్కన,మారన మూడు పర్వాలు రచించాడని స్థూలంగా చెప్పారు తప్ప రెండున్నర పర్వాలని ఎవరూ చెప్పరు.అలా శిథిలమైన భాగాన్ని పూరించివుంటే ఎర్రన్న ఆ విషయాన్ని పేర్కొనేవాడు కదా!-ఈ విధంగా పై వాదాన్ని ఖండించారు.

నన్నయ్య మూడు పర్వాలూ పూర్తి చేయటం వల్లనే తిక్కన విరాట పర్వం నుంచి మొదలుపెట్టాడు .లేకపోతే తిక్కన అరణ్యపర్వశేషం నుంచే రచన ప్రారంభించేవాడు కదా!నన్నయ్య సగం రచించి మరణించినప్పుడు ఆ మిగిలిన భాగం నుంచి మొదలుపెట్టడం అనేది కీడుగా భావించి తిక్కన అక్కడి నుంచి ప్రారంభించి ఉండకపోవచ్చు.పైగా తిక్కనకు కథలతో కూడుకొన్న విరాటపర్వం నుంచి రచన ప్రారంభించాలన్న ఉత్సుకత కూడా ఉంది.కాబట్టి తిక్కన అరణ్యపర్వ శేషరచనకి పూనుకోలేదని కొందరు వాదించారు.

నృసింహ పురాణంలో ఎర్రన తాతగారైన ఎర్రపోత సూరి చెప్పినట్టుగా కనిపిస్తోన్న పద్యం ఇది.

"ఉన్నత సంస్కృతాది చతురోక్తి పథంబుల కావ్యకర్తవై
ఎన్నికమై ప్రబంధ పరమేశుడనంగ నరణ్య పర్వశే
షోన్నయ మంధ్రభాష సుజనోత్సవ మొప్పగ నిర్వహించితా
నన్నయభట్టు తిక్క కవినాథుల కెక్కిన భక్తి పెంపునన్"

ఇందులో "ఉన్నయము" అంటే ఉద్ధరణ లేదా పూరణ.కాబట్టి ఈ పూరణం ఎటువంటిది?అనే సందేహంతో చర్చలు చేసారు.పైన చెప్పిన కారణాల వల్ల నన్నయ్య రాయకుండా మిగిలిన భాగాన్నే పూరించాడనటం సముచితమని ఎక్కువమంది అంగీకరించారు.
తిక్కనలాగా మరి ఎర్రనకి "కీడు" కలగలేదా?తిక్కనకే ఆ నమ్మకం ఉందా?అన్నది మరొక ప్రశ్న.అందుకే ఎర్రన తన రచనగా కాకుండా-నన్నయ పేరు మీదుగానే రచించాడని సమాధానం.మరొక విధంగా చెప్పాలంటే ఎర్రన వల్లనే మనకు భారతం పూర్తిగా లభించింది.