Search This Blog

Chodavaramnet Followers

Saturday 8 November 2014

ARTICLE ABOUT ONE OF THE GREAT LEGENDARY EIGHT POETS OF SRIKRISHNA DEVARA - ASTADIGGAJALU - MAHA KAVI DHURJATI


ధూర్జటి
ధూర్జటి శ్రీ కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకడు. కాళహస్తీశ్వర భక్తుడు. ఇతనిని పెద ధూర్జటి అని అంటారు, ఎందుకంటే ఇదే పేరుతో ఇంకో నలుగురు ధూర్జటులు ఉన్నారు.

ధూర్జటి 16వ శతాబ్దము ఉత్తర భాగములో 1480 నుండి 1545 వరకు జీవించిఉండవచ్చని భావిస్తున్నారు. ఈయన ఆనాటి పొత్తపి సీమ లోని, ప్రస్తుతం చిత్తూరు జిల్లా లో ఉన్న శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యుడు. ఈయన తల్లితండ్రులు సింగమ మరియు రామనారాయణ. ఈయన తాత పేరు జక్కయ నారాయణ. వీరి పేర్లను బట్టి ధూర్జటి జన్మత: వైష్ణవుడైనా ఆ తరువాత కాలములో గొప్ప శివభక్తుడైనాడని భావిస్తున్నారు.

ధూర్జటి అష్టదిగ్గజములలో ప్రధానమైనవాడు. భక్తి ప్రబంధమైన శ్రీకాళహస్తి మహత్యం మరియు శైవ శతకమైన శ్రీకాళహస్తీశ్వర శతకం ఈయన యొక్క రెండు ప్రధాన రచనలు. ఆయా రీతులలో ఇవి మహోన్నత కావ్యాలు. ధూర్జటి చెప్పినవి మరియు ధూర్జటిపై చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్ర దేశములో ప్రచారములో ఉన్నవి.
ఉదాహరణ పద్యాలు

శ్రీ కాళహస్తీశ్వర శతకము నుండి

పుడమి న్నిన్నొక బిల్వ పత్త్రమున నేఁ బూజించి పుణ్యంబునుం
బడయన్; నేరక పెక్కు దైవంబులకుం బప్పుల్, ప్రసాదంబులుం,
గుడుముల్, దోసెలు, సారె సత్తు, లటుకుల్, గుగ్గిళ్ళునుం బెట్టుచుం
జెడి యెందుం గొఱగాక పోదు రకటా శ్రీ కాళహస్తీశ్వరా!

మును నేఁ బుట్టిన పుట్టులెన్ని గలవో ? మోహంబుచే నందుఁ జే
సిన కర్మంబుల ప్రోవులెన్ని గలవో ? చింతించినంగాన నీ
జననంబేయని యున్న వాడ, నిదియే చాలింపవే నిన్నుఁ గొ
ల్చిన పుణ్యంబునకుం గృపారతుడవై శ్రీ కాళ హస్తీశ్వరా !

సంతోషించితిఁ జాలుఁ జాలు రతిరాజద్వార సౌఖ్యంబులన్
శాంతింబొందితిఁ జాలుఁ జాలు బహురాజద్వార సౌఖ్యంబులన్
శాంతింబొందెదఁ జూపు బ్రహ్మపదరాజద్వార సౌఖ్యంబు ని
శ్చింతన్ శాంతుఁడ నౌదు నీ కరుణచే శ్రీ కాళహస్తీశ్వరా!

శ్రీ కాళహస్తి మహాత్మ్యము నుండి

ప్రాఁతలు మీఁదఁ గప్పినఁ గృపామతి నోర్చితి, నీచు పొత్తునన్
బ్రాఁతిమెయిన్ మెసంగితివి, భక్తుఁడు కుంటెనఁ బంపఁబోతి, మై
పూఁత యొనర్చుకొంటి శవ భూతిఁ, గపాలమునన్ భుజించి, తీ
రోఁతలు పెక్కులుండ నివి రోయుదువే, యిఁక భక్తవత్సలా!"

ఓ సామీ ఇటువంటి కొండ దరిలో, నొంటింబులుల్, సింగముల్
గాసిం బెట్టెడు కుట్ర నట్టడవిలోఁ, గల్జువ్వి క్రీనీడ, నే
యాసం గట్టితి వేటిగడ్డ నిలు? నీవాఁకొన్నచోఁ గూడు నీ
ళ్ళే సుట్టంబులు దెచ్చి పెట్టెదరు? నీకిందేటికే లింగమా