Search This Blog

Chodavaramnet Followers

Tuesday, 7 October 2014

TELUGU PURANA STORY ABOUT VARAHAVATHARAM - STORY ABOUT LORD SRI MAHA VISHNU SAVES PLANET EARTH - BHAGAWATHA PURANA GADHA - VARAHAVATHARAM


భాగవత పురాణ గాధ - వరాహావతారము

శ్రీవరాహమూర్తి, వరాహావతారము, వరాహ స్వామి (Varaha incarnation)- ఇవన్నీ శ్రీమహావిష్ణువు మూడవ అవతారమును వర్ణించే నామములు. హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము. మహాలక్ష్మిని సంబోధించే "శ్రీ" పదాన్ని చేర్చి శ్రీవరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. వరాహావతారం హిరణాక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము. స్వామి ప్రార్ధనలలో ఒకటి:
ఆది వరాహ మూర్తి, యజ్ఞవరాహ మూర్తి, మహా సూకరం అని నామాలు కూడా కలవు. తిరుమల కొండలపై మొదట వెలసిన స్వామి వీరే, వీరి అనుమతితోనే వేంకటేశ్వరుడు అక్కడ నివాసము ఏర్పాటుచేసుకున్నారు.
రాక్షసునితో భయంకరంగా యుద్దం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలము పై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి.

భాగవత పురాణ గాధ
మహాప్రళయం:-మహాప్రళయం సంభవించింది. భూమి జలంలో మునిగిపోయింది. బ్రహ్మ చింతాక్రాంతుడై నిఖిల జగత్తును కల్పనచేశాను. స్వాయంభువ మనువు నివసించేందుకు ఆధారభూతమైన భూమి ఇప్పుడు లేకుండా పోయిందే అని భావిస్తూ, సర్వభూతాంతరాత్ముడైన పుండరీకాక్షుని స్మరించసాగాడు. ధ్యాన నిమగ్నుడైన బ్రహ్మ నాసిక (ముక్కు) నుంచి, బొటనవేలు పరిమాణమున్న వరాహంగా శ్రీహరి విశ్వంభరోద్ధారణకై జన్మించాడు. మరీచాది మునులు, మనువు కుమారులు చూస్తుండగానే, క్షణం లోపల ఏనుగంత ప్రమాణం పెరిగి చూసే వారికి అద్భుతాశ్చర్యములు కలిగించారు.
విశ్వంభరోద్ధరణ పర్వం
ప్రళయ కాలమందు ఆవరించిన దట్టమైన మేఘ గర్జనల వంటి ఘుర్గురారావంబులతో బ్రహ్మాండము పై పెంకు పగులునటుల, దిక్కులదరునట్లు, ఆకాశపు పొరలను చీల్చునట్లు, రొప్పుచూ పర్వతములు పెకలించుచు, ముట్టె బిగియించుచు, ముసముస మూరికొనుచున్న యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మ స్తుతించెను. "దేవా... సనకసనందనాదుల శాప వశమున జయ విజయులు దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులై జన్మించి ఉన్నారు. హిరాణ్యాక్షుడు నేడు అఖిలలోక కంటకుడై, చండ వేదండ శుండాదండ మండిత భుజాదండబున గదాదండంబు ధరియించి, తనను యుద్ధములో ఓడించగల వాడిని భూలోకమున గానక, దేవలోకముల దేవతలనోడించాడు. వరుణుని దండింప బూన అతడు నీకు సరి హరియే. అతని గెలిచి రమ్మన్నాడు. హిరణ్యాక్షుడు నీకై వెదకుచూ రసాతలమునకు పోయాడు.... అని బ్రహ్మ వివరించాడు.
మహా పర్వతమంత పెరిగిన వరాహమూర్తి

ఆ పలుకులు విని యజ్ఞవరాహమూర్తి యను సర్వేశ్వరుడు, ప్రాతార్మధ్యందిన తృతీయ సవనరూపుండు, మహా ప్రళయంబునందు యోగనిద్రావశుండై యుండు కాలమందు జలముల మునిగి, భూమి రసాతలగతంబైనందున, దానిని పైకి తీసుకువచ్చే ఉపాయంలో భాగంగా తాను మహా పర్వతమంత గా పెరిగిపోయాడు. ఆ పైన తన నిశిత కరాళక్షుర తీక్షంబులైన ఖురాగ్రంబుల సముద్ర జలమును చీల్చి రసాతలమును ప్రవేశించి భూమిని సమీపించెను. ఆ జల మధ్యంలో సూకరాకారుడైన హరికి హిరణ్యాక్షుడు ఎదురయ్యాడు. అప్పుడు శ్రీహరి తన తనూ కాంతితో దనుజాధీశుడైన హిరణ్యాక్షుని శరీరపు వెలుగును హరింపజేసెను. అంతేకాక తుది మొదళ్లకు చిక్కక, కొండలను పిండిచేయుచు, బ్రహ్మాండ భాండంబు పగులునట్లు కొమ్ములతో గుచ్చుచూ, సప్త సముద్రములింకునట్లు బంకమట్టిని ఎగజిమ్ముచు, తన కురుచ తోకను తిప్పుచు, గుప్పించి లఘించుచు, భూమిని తవ్వి తన నిశిత దంతాగ్రముల నిలిపి రాక్షస రాజు గుండెలు తల్లడిల్లునట్లు రణోత్సామున రంకెలు వేస్తూ ఆ వరాహమూర్తి రణానికి సిద్ధమయ్యారు.
యజ్ఞవరాహ-హిరణ్యాక్షుల సమరం
నిశిత సిత దంతముల వెలుగులు నింగిని వ్యాపింప, రసాతలమును వీడి భయంకర వరాహావతారమున వసుంధరను గొనిపోవుచున్న శ్రీహరిని అటునిటు అడ్డగించుచు, నిందించుచు హిరాణ్యాక్షుడు విడువిడుమని ఆక్షేపించాడు. అప్పుడు యజ్ఞవరాహమూర్తి భూమిని జలములపై నిలువబెట్టి ఆధారముగా తన బలమును ఉంచి, హిరాణ్యాక్షునిపై సమరమునకు సన్నద్ధుడాయెను. హిరణ్యాక్షుడు అతి భయంకరాకారుడై గద సారించి మాధవునెదుర్కొన్నాడు. ఇరువురు అన్యోన్య జయ కాంక్షలతో, పరస్పర శుండాదండ ఘట్టిత మధాంధ గంధ సింధుర యుగంబులవలె, రోష భీషణాచోపంబులం తలపడ బెబ్బులవలె, అతి దర్పాతిరేకంబున నెదర్చి రంకెలు వేయు మద వృషంభుల వలె పోరాడిరి.
నిస్తేజుడైన హిరణ్యాక్షుడు

హిరణ్యాక్షుని గద, శూలము శ్రీహరి ధీరత్వం ఎదుట వృథా అయ్యాయి. దాంతో హిరాణ్యాక్షుడు రోషోద్ధరుడై మాయా యుద్ధము ప్రారంభించాడు. భీకర పాషాణ పురీష మూత్ర ఘన దుర్గాంధ అస్థి రక్తములు కురియునట్లు మాయా చక్రమును భూచక్రముపై ప్రయోగించాడు. శ్రీహరి తన చక్రముతో మాయా చక్రాన్ని అడ్డగించారు. తన మాయలన్నియు కృతఘ్నునికి చేసిన ఉపకారమువలె పనిచేయకపోవుట గమనించిన హిరణ్యాక్షుడు వరాహమూర్తిపై లంఘించి తన బాహువులను చాచి, హరివక్షంపై బలం కొద్దీ పొడువగా, హరి తప్పించుకుని ఎదురు ముష్టి ఘాతం ఇచ్చాడు. ఆ దెబ్బకు దిర్దిరం దిరిగి, దిట చెడి, లోబడిన హిరణ్యాక్షుని కర్ణమూలమందు తన కోరలతో వరాహమూర్తి మొత్తెను.
బుడ బుడ నెత్తురు గ్రక్కుచు
వెడరూపము దాల్చి గ్రుడ్డు వెలికురక,
నిలం బడి పండ్లు గీటుకొనుచును విడిచెం
బ్రాణములు దైత్య వీరుండంతన్‌ దేవా... నీ లీలలు

బ్రహ్మాదుల ప్రార్థన
అనంతం హిరణ్యాక్షుని సంహరించి అతని రక్తధారలతో తడి చిన మోముపై భూమిని, బాలచంద్రుని కిరణములవలె మెరలుచున్న తన కోరలపై నిలిపిన యజ్ఞపోత్రిమూర్తిని జూచి బ్రహ్మాదులు ప్రణామము లాచరించి..... "ఈ విశ్వపు సృష్టి, స్థితి, లయ లందు వికారము నీవే, విశ్వము నీవే! నీ లీలలు అపారము. చర్మమున అఖిల వేదములు, రోమముల యందు బర్హిస్సులు, కన్నులలో అజ్యము, పాదముల యందు యజ్ఞ కర్మములు, తుండమున స్రువము, ముక్కులో ఇడాపాత్ర, ఉదరమున, చెవులలో జమసప్రాశిత్రములు, గొంతులో మూడు ఇష్టులు, నాలుకపై అగ్ని కలిగిన ఓ దేవా! వితత కరుణాసుధా తరంగితములైన నీ కటాక్షవీక్షణములతో మమ్ము కావవయ్యా..." అని ప్రార్థించారు.
అంతట లీలవోలె శ్రీయజ్ఞ వరాహమూర్తి భూమిని తన కోరలపై నుంచి సముద్రము పైన దించి, నిలిపి, విశ్రాంతి వహింపజేసి తిరోహితుడయ్యాడు.

తిరుమల భూవరాహ స్వామి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖం గా శ్రీవరాహ స్వామి ఆలయం వుంది. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రం గా ప్రసిద్ది కెక్కింది.
వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందు న వరాహస్వామికి తొలిదర్షనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు.ఈ రాగిరేకు ని నేటికీ రూ.3 హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయం లో చూపిస్తారు. తిరుమల క్షేత్రం లో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని దర్షించక పోతే యాత్రా ఫలం దక్కదు అని చెపుతారు.