Search This Blog

Chodavaramnet Followers

Sunday, 13 July 2014

DETAILED ARTICLE IN TELUGU ON SRI GURAJADA APPA RAO - Gurajada Apparao was an influential social reformer of his age and was lauded as Mahakavi, meaning "the great poet".


గురుజాడ వారి అడుగు జాడ...
తెలుగు అడుగుజాడ
" చెడ్డవారి వల్ల చెప్పుదెబ్బలు తినచ్చును గానీ - మంచివారి వల్ల మాటకాయడం కష్టం "
" నిజమాడేవాడు సాక్ష్యానికి రాడు ! సాక్ష్యానికొచ్చేవాడు నిజవాళ్ళేడు "
" నమ్మించోట చేస్తే మోసం... నమ్మని చోట చేస్తే లౌక్యమను " 
" అడగ్గానే యిస్తే వస్తువు విలువ తగ్గిపోతుంది "
" ఒపీనియన్స్ అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటేనే కానీ పొలిటీషియన్ కానేరడు "
" కుంచం నిలువునా కొలవడానికి వీల్లేనపుడు - తిరగేసి కొలిస్తే నాలుగ్గింజలైనా నిలుస్తాయి "
" ఒకడు చెప్పిందల్లా బాగుందనడమే - సమ్మోహనాస్త్రం అంటే అదేగా "
" లెక్చర్లు ఎంతసేపూ సిటీల్లోనేగానీ - పల్లెటూళ్ళో ఎంతమాత్రం పనికి రావు "
" పేషన్స్ ఉంటేనే గానీ లోకంలో నెగ్గలేం "
" ప్రమాదాలు తప్పించుకోవడమే ప్రజ్ఞ "

- చివరగా " మనవాళ్ళు ఒట్టి వెధవాయిలోయ్ "
" డామిట్ ! కథ అడ్డం తిరిగింది " అని తేల్చేసారు గురజాడ.

సుమారు నూట పదిహేనేళ్ళ క్రితమే తన ' కన్యాశుల్కం ' ద్వారా పలికిన ఈ భాష్యాలు నిత్య సత్యాలు. ఇలాంటివి ఆ నాటకంలో కోకొల్లలు. ఆనాటి సాంఘిక దురాచారాలైన కన్యాశుల్కం. బాల్యవివాహాలపై ఆయన ఎక్కుపెట్టిన కలం వాడి ఈనాటికీ చెక్కు చెదరలేదు. ఆ దురాచారాలు ఈనాడు అవే రూపాల్లో లేకపోవచ్చు. రూపాలు మారి ఉండవచ్చు. కానీ అప్పుడు ఇప్పుడూ అలాంటి దురాచారాలకు తొలుత బలవుతున్నది స్త్రీలు మాత్రమే !

గురజాడ స్త్రీ పక్షపాతి అన్నది ఈ నాటకం ద్వారా అర్థమవుతుంది. అమాయక బుచ్చమ్మ దగ్గర్నుంచి గడుసుతనం గల పూటకూళ్ళమ్మ దాకా ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుని, దానికి నాగరికత రంగు పూసే గిరీశం పాత్ర దీనికి పెద్ద ఉదాహరణ. గిరీశమే కాదు... డబ్బుకోసం అన్నెం పున్నెం తెలియని కూతుళ్ళ జీవితాలు బలి చేసే అగ్నిహోత్రావధానులు... కాటికి కాళ్ళు జాచినా, తలచెడి వయసులో వున్న కూతురు ఇంట్లో వున్నా మళ్ళీ పెళ్లి కోసం వెంపర్లాడి పోయే లుబ్దావధానులు, సానివాడలని పోషిస్తూ తన లౌక్యాన్ని ప్రదర్శించే రామప్ప పంతులు.... ఇలా ప్రధాన పురుష పాత్రల్లో మగవారికి ఆనాడు స్త్రీల పట్ల వున్న చులకన భావాన్ని మన కళ్ళ ముందుంచారు గురజాడ.

ఆడ అయినా, మగ అయినా మంచి చెడ్డా రెండు ఉంటాయనడానికి ఉదాహరణగా కొన్ని పాత్రలను మలిచారు గురజాడ తన ' కన్యాశుల్కం ' లో. వాటిలో ప్రధానమైనవి - ఒకటి తన మేనకోడలికి జరుగుతున్నా అన్యాయాన్ని సహించలేక, మూర్ఖుడైన తన బావగారికి నచ్చచెప్పలేక సతమవుతూ, ఆ పెళ్లి తప్పించడానికి ఏం చెయ్యడానికైనా సిద్ధమయ్యే పాత్ర గుంటూరు శాస్త్రి అదే కరటకశాస్త్రి. రెండు ప్లీడరు సౌజన్యారావు పంతులు గారు. అన్యాయాన్ని, దురాచారాలను సహించలేని ఆయన పాత్ర మొదట్లో వేశ్యలపైన దురభిప్రాయాన్ని కలిగి వుంటుంది. అయితే మధురవాణితో మాట్లాడాక ఆయనలో మార్పు వస్తుంది.

ఇక స్త్రీ పాత్రలలో చాలా ముఖ్యమైన పాత్ర మధురవాణి. వృత్తి రీత్యా ఆమె వేశ్య. కానీ ఆ పాత్రను నిశితంగా పరిశీలిస్తే వేశ్యలంటే చులకన భావం కలుగదు. ఎన్నో జీవిత సత్యాలను ఆమె మనకు తెలియజేస్తుంది. వేశ్యలకు కూడా నీతి ఉంటుందని, వాళ్ళు కూడా మనలాంటి మనుష్యులే, వాళ్ళకీ ఆలోచనలు, ఆశలు, ఆశయాలు ఉంటాయని ఆ పాత్ర ద్వారా మనకి తెలియజేస్తారు. అప్పట్లో వేశ్యలుగా వున్న స్త్రీలపట్ల సమాజంలో వున్న చులకన భావాన్ని ఈ పాత్ర ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తారు గురజాడ. అయితే ఆయన ఆశయం నెరవేరిందా అనేది వేరే విషయం. కానీ ఆయనకు స్త్రీల మీద వున్న గౌరవం ఈ పాత్ర ద్వారా ప్రస్పుటమవుతుంది.

కృత్రిమమైన పాత్రలు, వాతావరణం కాక సహజమైన, సజీవమైన పాత్రల్ని, వాతావరణాన్ని, సంఘటనల్ని మనముందు ఆవిష్కరించడం వలన వంద సంవత్సరాలు దాటిపోయినా ఆ నాటకం సజీవంగా వుంది. ఆ నాటకం ద్వారా గురజాడ కూడా నేటికీ అందరి మనస్సులో సజీవంగా వున్నారు. ఇప్పటి తరానికి సమకాలీన రచయితల పేర్లు తెలియకపోయినా గురజాడ గురించి తెలియని వారు ఉంటారని అనుకోను.

గురజాడ కలం నుండి జాలువారిన ' దేశమును ప్రేమించుమన్నా... ' వింటుంటే మనలో దేశభక్తి పొంగి ప్రవహించవలసినదే ! ప్రామాణికమైన తొలి తెలుగు కథగా ఆయన ' దిద్దుబాటు ' గుర్తించబడింది. ఆయన రచనల్లో చెప్పుకోదగిన మరొకటి ' పుత్తడిబొమ్మ పూర్ణమ్మ '. బాల్యవివాహం నేపథ్యంలో స్త్రీ వివక్షతను గురించి స్పష్టంగా తెలియజెప్పిన రచన. ఇది ఈనాటికీ పూర్తిగా సమసిపోలేదు. స్త్రీలు ఎంత ముందంజలో వున్నా అక్కడక్కడ ఈ వివక్షత ఇంకా కొనసాగుతోనే వుంది. ఇంకో వందేళ్ళు గడిచినా గురజాడ కోరిక తీరదేమో !