Search This Blog

Chodavaramnet Followers

Sunday 13 July 2014

BRIEF HISTORY ABOUT SRI VEDA VYASA MAHARISHI


వ్యాస చరిత్ర!!
" వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే, నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః ".. (వ్యాసుడే విష్ణువు..విష్ణువే వ్యాసుడు.బ్రహ్మ జ్ఞాన నిధియైన, వశిష్ట సంతతి కి చెందిన మహానుభావుడైన వ్యాసునకు నమస్కారం) " అచతుర్వదనో బ్రహ్మ, ద్విబాహు రపరో హరి, అఫాల లోచనో శంభు భగవాన్ బాదరాయణః ! " (నాలుగు ముఖములు లేకున్నా బ్రహ్మ దేమునంతటి వాడు, రెండే చేతులు కలిగినప్పటికీ శ్రీ
హరి అంతటి వాడు,నుదుట మూడో కన్ను లేకున్నా శివునంతటి వాడు ఐన బాదరాయణుడైన వ్యాసునకు నమస్సులు!)
బ్రహ్మ దేవుని మానస పుత్రుడు వశిష్టుడు.భాగవతం ప్రకారం బ్రహ్మదేవుని ప్రాణ వాయువులనుండి వశిష్టుడు, అరుంధతీ వశిష్టులకు శక్తి,శక్తికి పరాశరుడు, పరాశరునికీ సత్యవతికీ వ్యాసుడు, వ్యాసునికి శుక మహర్షీ జన్మించారు.
నల్లగా, దృఢ మైన, ఆకర్షణీయమైన శరీరంతో పుట్టాడు కనుక కృష్ణుడు అని,ద్వీపంలో జన్మించాడు కనుక ద్వైపాయనుడనీ, ఒక్కటే రాశిగా ఉన్న వేద విజ్ఞానాన్ని వ్యాసం చేశాడు కనుక, అంటే విభజించాడు కనుక వ్యాసుడనీ బదరికాశ్రమంలో తపస్సు చేశాడు కనుక బాదరాయణుడనీ,పరాశరుని కుమారుడు కనుక పారాశారుడనీ ..వ్యాసుల వారికి పేర్లు!వ్యాసుల వారు సులభంగా అర్థం కావడం కోసం వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి, ఋగ్వేదాన్ని పైలునికీ,యజుర్వేదాన్ని వైశంపాయనునికీ సామ వేదాన్ని జైమినికీ,అధర్వణ వేదాన్ని సుమంతునికీ,బోధించి వారి ద్వారా వేద విజ్ఞానాన్ని ప్రచారం చేశాడు ప్రపంచంలో. ఇంకా సులభంగా వేద విజ్ఞ్ఞానం అందించడం కోసం ఉపనిషత్తులకు బ్రహ్మ సూత్రాలు వ్రాశాడు.అంతటితో తృప్తి చెందక వేద విజ్ఞాన సర్వస్వంగా సులభమైన కథల రూపంలో అష్టాదశ మహా పురాణ సారస్వతాన్నితన మరొక శిష్యుడైన రోమహర్ష ణుడి
ద్వారా ప్రపంచానికి అందించాడు.ఐనా సంతృప్తి లభించక వేద రహస్య సార సర్వస్వంగా మహా భారతాన్ని రచించాడు అందుకే మహా భారతం పంచమ వేదమైంది.అష్టాదశ ఉప పురాణములనుకూడా రచించాడు.ఇంకా ఆయన ఆత్మకు ఆనందం కలుగక నారద మహర్షి సూచన మేరకు శ్రీ కృష్ణ స్తుతి లక్ష్యంగా మహాభాగవతాన్నిరచించాడు.బ్రహ్మసూత్రములకు అర్ధ వివరణాత్మకంగా, భారత అర్ధ వ్యాఖ్యానంగా, గాయత్రీ మంత్ర సారం గా, వేద విజ్ఞాన సారంగా, సమస్త పురాణ సారాంశంగా, పద్దెనిమిది వేల శ్లోకములతో, వంద అధ్యాయములతో, పన్నెండు స్కంధములతో తను రచించిన మహా భాగవతాన్ని తన కుమారుడైన శుక మహర్షికి వినిపించి, బోధించాడు. ఆయన పరీక్షిత్తు మహా రాజు కు వినిపించాడు!
తన పురాణ, భారత, భాగవత,వేద సారస్వతం లో పరమాణు విజ్ఞానంతో మొదలుకొని, కాల జ్ఞానము, భూగోళ శాస్త్రము, కాల విజ్ఞానము, భావి రాజుల చరిత్ర, సామాజిక, ఆధ్యాత్మిక,నీతి,వేదాంత శాస్త్రసమన్వితాలుగా సమస్త జ్ఞాన రహస్యాలను మానవాళిని ఉద్ధరించడం కోసం వేద వ్యాసుల వారు అందించారు.వ్యాసుల వారు చెప్పనిది యింతవరకూ ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో సహా ఎక్కడా చెప్ప బడలేదు. భౌతిక, రసాయన, వైద్య, యుద్ధ, గణిత శాస్త్రములన్నిన్టిలోను ఆధునిక మానవుడు కనుగొన్న అద్భుత రహస్యాలన్నీ ఆయన ఏనాడో చర్చించాడు! సమస్త జ్ఞాన సర్వస్వానికీ మూల పురుషుడు కనుక ఆయన తొలి గురువు. ఆయన జన్మ తిథి ఐన ఆషాఢ పౌర్ణమి నిజమైన గురుపౌర్ణమి!
సమస్త శాస్త్రాల సారం పరోపకారమును మించిన పుణ్యము లేదు, పర పీడన కన్న పాపంలేదు అనే సత్యమే అని ఘోషించాడు. సమస్త ప్రాణి కోటి లోను వెలుగొందుతున్న దైవం ఒకడే అని, సమస్త ప్రాణికోటి భగవంతుని సంతానమే అని బోధించాడు.
దేహమే దేవాలయం, జీవుడే దేముడు, మానవ సేవయే మాధవ సేవ, త్యాగము చేతనే అమృత త్త్వము సిద్ధిస్తుంది,ప్రతి ఆత్మా పరమాత్మయే, సత్యమే జయిస్తుంది, సత్యమే దైవము,ప్రపంచమంతా ఒకటే కుటుంబము, రెండు పాదముల మానవులకూ, పక్షులకూ, నాలుగు పాదముల పశువులకూ..అంటే సమస్త ప్రాణి కోటి కీ శాంతి కలగాలి, సర్వ జనులూ సుఖించాలి అని చాటిన, బోధించిన భగవత్స్వరూపుడు..సాక్షాత్తూ మహావిష్ణువు అవతారమైన వ్యాసుడు భారతీయులకే కాదు....సమస్త మానవాళికీ తొలి గురువు, జ్ఞాన నిధి!
మానవాళిని ఉద్ధరించడం కోసము మహావిష్ణువు ప్రతి ద్వాపర యుగంలోనూ అవతారం దాలుస్తూ ఉంటాడు , వ్యాసునిగా! మొదటి ద్వాపర యుగంలో స్వాయంభువ మనువు,రెండవ ద్వాపర యుగంలో ప్రజాపతి, మూడవ ద్వాపర యుగంలో ఉశనసుడు,
నాలగవ ద్వాపరం లో బృహస్పతి, ఐదవ ద్వాపరంలో సూర్యుడు(సవిత)ఆరవ ద్వాపరంలో మృత్యువు, ఏడవ ద్వాపరంలో మఘవుడు, ఎనిమిదవ ద్వాపరంలో వశిష్టుడు, తొమ్మిదవ ద్వాపరంలో సారస్వతుడు, పదవ ద్వాపరంలో త్రిధాముడు, పదకొండవ ద్వాపరంలో త్రివ్రుషుడు, పన్నెండవ ద్వాపరంలో భరద్వాజుడు, పదమూడవ ద్వాపరంలో అంతరిక్షుడు, పద్నాలగవ ద్వాపరంలో ధర్ముడు, పదిహేనవ ద్వాపరంలో త్రయ్యారుణి, పదహారవ ద్వాపరంలో ధనంజయుడు, పదిహేడవ ద్వాపరంలో మేధాతిథి ,పద్దెనిమిదవ ద్వాపరంలో వ్రతి, పందొమ్మిదవ ద్వాపరంలో అత్రి, ఇరవైయ్యవ ద్వాపరంలో గౌతముడు, ఇరవై ఒకటవ ద్వాపరంలో ఉత్తముడు, ఇరవై రెండవ ద్వాపరంలో వేనుడు, ఇరవైమూడవ ద్వాపరంలో
సోముడు, ఇరవై నాల్గవ ద్వాపరంలో తరుణ బిందువు, ఇరవై ఐదవ ద్వాపరంలో భార్గవుడు, ఇరవై ఆరవ ద్వాపరంలో శక్తి, ఇరవై ఏడవ ద్వాపరంలో జాతుక ర్ణ్యుడు వ్యాసులుగా అవతరించారు.
బ్రహ్మ దేముడు కూడా ఆయన గారి కాలమానం లో వంద సంవత్సరాల తర్వాత తనువు చాలిస్తాడు, మరొక బ్రహ్మ వస్తాడు. ప్రస్తుత బ్రహ్మ గారి కాలం లో ఇది ఇరవై ఎనిమిదవ ద్వాపర యుగం. ఈ ద్వాపర యుగంలో కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు. రాబోయే
ఇరవై తొమ్మిదవ ద్వాపర యుగంలో ద్రౌణి వ్యాసుడౌ తాడు.
ఇదీ సంక్షిప్తం గా వ్యాస చరిత్ర. ఆది గురువైన వ్యాసులవారి ఆశీస్సులు సమస్త మానవాళినీ శాంతియుత సహజీవన భాగ్యానికి పాత్రులుగా చేయుగాక!