నీటి రంగును తెలుపు అని కూడా అనలేం. నీటికి రంగులేదు. తెలుపు ఒక రంగు కాదు. సప్తవర్ణాల కలయికను తెలుపు అంటారు. ఆవిధంగా చూసినా నీరు తెల్లగా ఉండదు. నీటిని వర్ణ రహిత ద్రవం అంటాం. నీరు పారదర్శకంగా ఉందంటాము. పాలు తెల్లగా ఉన్నాయంటాము. నీటికి ఏ రంగూ లేకపోవడానికి కారణం తెలుసుకునే ముందు ఒక పదార్థానికి రంగు ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. పదార్థాలు చాలావరకు అణువ్ఞలతో నిర్మితమై ఉంటాయి. ఎలాగైతే జీవకణాలతో మన శరీరం నిర్మితమైందో అలాగే అణువ్ఞలతోనే చాలా సంయోగ పదార్థాలు నిర్మితమై ఉన్నాయి. అణువ్ఞలలో పరమాణువ్ఞలు ఉంటాయి. ఇవి పరస్పరం బంధాలతో సంధానించుకుని ఉంటాయి. పరమాణువ్ఞలు, అణువ్ఞలుగా సమీకరించుకోవటానికి వాటిమధ్య ఏర్పరచుకునే సంధానాలను రసాయనిక బంధాలు (కెమికల్ బాండ్స్) అంటారు. రసాయనిక బంధాలను ఏర్పరచేది కేవలం పరమాణువ్ఞలలో ఉండే ఎలక్ట్రాన్లే. ఎలక్ట్రాన్లు లేకుండా పదార్థాలు ద్రవ, ఘనరూపంలోను, అణురూపంలోను ఉండలేవ్ఞ.
రసాయనిక బంధాలను ఏర్పరచే ఏలక్ట్రాన్లు అణువ్ఞలలోని రకరకాల శక్తి స్థావరాలలో ఉంటాయి. ఎలాగైతే మనం నివసించే ప్రాంతాన్ని ఇంటిగది అంటామో, అలాగే అణువ్ఞలలోను, పరమాణువ్ఞలలోను, ఎలక్ట్రాన్లు ఉండే గూళ్లను ఆర్బిటల్స్ అంటారు. పరమాణు ఆర్బిటల్స్ పరమాణువ్ఞలలోను, అణు ఆర్బిటల్స్ అణువ్ఞల్లోను ఉంటాయి. మనం ఒకగది నుంచి ఇంకో గదికి నడిచి చేరుకుంటాం కదా. అందుకు ఆహారం ద్వారా పొందే శక్తిని వాడుకుంటాం. అలాగే ఎలక్ట్రాన్లు అణువ్ఞలోని ఒక ఆర్బిటల్ నుంచి మరో ఆర్బిటల్‌కు పోవాలంటే వాటికి శక్తి కావాలి. అవి కాంతి శక్తిని స్వీకరించి, ఆర్బిటల్స్ మధ్య తమ స్థావరాలను ఏర్పరచుకుంటాయి. అయితే శక్తి నిత్యత్వమయి ఉంది కాబట్టి తాము ఆర్బిటల్స్ మధ్య స్థానభ్రంశం చెందేపుడు కాంతిలోని అనేక రంగుల్లో తమకు సరిపడిన రంగుగల కాంతినే స్వీకరిస్తాయి. మనం చూసే తెలుపు కాంతి ఆ పదార్థాల మీద పడ్డప్పుడు కొన్ని రంగుల్ని ఆ పదార్థాల్లోని ఎలక్ట్రాన్లు స్వీకరిస్తే ఇక మిగిలిన రంగులే బయటకు వస్తాయి. అంటే అలా మిగిలిన కాంతినే మనం మన కళ్లతో చూస్తాము. మన కంటికి ఏరంగు గల కాంతి చేరుతుందో ఆ రంగులోనే ఆ పదార్థం ఉంటుంది. ఉదాహరణకు పచ్చని ఆకులు ఆకుపచ్చగా ఉండటానికి కారణం ఏమిటి? సప్తవర్ణాల సూర్య కాంతి ఆకులపై పడ్డప్పుడు ఆకుల్లో ఉండే పత్రహరిత రేణువ్ఞల్లోని ఎలక్ట్రాన్లు ఎరుపు, నారింజ రంగుల్ని తమ అవసరం కోసం వాడుకుం టాయి. అంటే ఆకుల్నించి బయటికి పరావర్తనం చెందే కాంతిలో సప్తవర్ణాలుండవ్ఞ. ఎరుపు, నారింజ రంగుల తీవ్రత చాలామటుకు తగ్గి పోయి ఉంటుంది. మిగిలిన రంగులు యథాప్రకారం బయటపడతాయి. మన కంటికి చేరే కాంతిలో ఎరుపు, నారింజ రంగుల తీవ్రత తగ్గిపోయి నీలం, ఆకుపచ్చ రంగుల ప్రభావం యథాప్రకారం బాగా ఉంటుంది. కాబట్టి మనం ఆకుల్ని చూస్తున్నపుడు అక్కడినుంచి వెలువడే కాంతి ప్రధానంగా ఆకుపచ్చరంగే కాబట్టి ఆకులు ఆకుపచ్చరంగులో ఉంటాయి.
ఒక సూత్రంలాగా ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే విషయం తేలికగా ఉంటుంది. ఒక పదార్థం ఎక్స్ అనే రంగులో కనిపిస్తుందంటే అర్థం, ఆ వస్తువ్ఞ ఎక్స్ అనే రంగు గల కాంతిని వదిలేసి మిగిలిన కాంతిని హరించేస్తుందన్నమాట. ఎక్స్ మినహా మిగిలిన కాంతి భాగాన్ని వై అనుకుంటే, వైని శోషణకాంతి అని, ఎక్స్‌ను పరావర్తన కాంతి అని అంటాం. లేదా ఎక్స్‌ను, వైకి శేషకాంతి అంటారు. అలాగే వై అనేది ఎక్స్‌కి శేషకాంతి అవ్ఞతుంది. ఎందుకంటే ఎక్స్‌వై కలిస్తే పూర్తి తెల్లని కాంతేకదా. ఒక వస్తువ్ఞ తెల్లనికాంతిలోని ఏ రంగునూ గ్రహించకపోతే ఆ వస్తువ్ఞ వర్ణరహితంగా, పారదర్శకంగా ఉంటుంది. నీటిలోని అణువ్ఞల లోని ఎలక్ట్రాన్లు సప్తవర్ణాల్లోని ఏ వర్ణపు కాంతినీ తమ మార్పిడికి వాడు కోవ్ఞ. వాటికి సరిపడిన శక్తి సప్తవర్ణాల దృశ్యకాంతిలో లేదు. కాబట్టి అవి ఏరంగునూ గ్రహించవ్ఞ. అలాటి అణువ్ఞల పదార్థమైన నీటిమీద తెల్లని కాంతిపడితే అది నీటిగుండా పూర్తిగా దూసుకుపోతుంది. అందుకే రంగు లేదు. చక్కెర, కిరోసిన్, కర్పూరం, నాఫ్తలీన్ గోలీలు, పాలు ఇవన్నీ పారదర్శకంగా లేదా తెల్లగా కనిపించడానికి కారణం వాటి అణువ్ఞలు సప్తవర్ణాల్లోని ఏ రంగునూ గ్రహించకపోవడమే.