Search This Blog

Chodavaramnet Followers

Monday, 20 May 2013

DATES - KARJURA PANDU - MUSLIMS SPECIAL FRUIT ON RAMZAN DAYS - THE BEIEF HISTORY AND ITS MEDICINAL USES OF DATES


సంప్రదాయఫలంగా, ఖర్జూరం నీరాజనా లందుకుంటోంది. రంజాన్‌ మాసం వచ్చిం దంటే చాలు, పరిపుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాసదీక్ష పూర్తవుతుంది. అందుకే వారికిది లేనిదే పొద్దు గడవదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, మహమ్మద్‌ ప్రవక్తకు ఇది ఎంతో ఇష్టమైన ఆహారంగా పవిత్ర గ్రంథం, ఖుర్‌ఆన్‌ పేర్కొంటోంది. ఆయన ఇంటికి కలపనిచ్చింది కూడా ఖర్జూర చెట్టేననీ చెబుతారు. ఇస్లామిక్‌ దేశాల్లో ఖర్జూర వృక్షాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.


ఎండు ఖర్జూరాలు : ఏ పండయినా పండుగానే బాగుంటుంది. కానీ ఖర్జూరపండు ఎండినా రుచే, నట్‌గా మారిన ఎండు ఖర్జూరంలోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా ఉంటుంది. మెత్తని పండ్లకోసం అయితే ఇవి రంగు మారి దోరరంగులోకి రాగానే చెట్టునుంచి తీస్తారు.
అదే ఎండు ఖర్జూరాల కోసం అయితే చెట్టునూ బాగా ఎండనిచ్చి తెంచుతారు. కోశాక వాటిని కొంతకాలం తేమ వాతావరణంలో ఉంచి కాస్త మెత్తబడేలా చేస్తారు. వేసవిలో ఎండుఖర్జూర నీళ్లు తాగని పసిపిల్లలు అరుదే. స్వీట్లు, పుడ్డింగ్‌లు, కేకులు, డెజర్ట్‌ల తయారీలో ఖర్జూరం ఉండి తీరాల్సిందే.



ఉపయోగాలు : ఖర్జూరం, పండుగానే కాక చెట్టుగా కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. లేత ఆకుల్ని కూరగా వండుకుంటారు. ఉత్తర ఆఫ్రికాలో ఆకుల్ని పూరిళ్ళకుకప్పులుగా వాడటమూ ఎక్కువే.
తాటి ఆకుల మాదిరిగానే చాపలు, తడికెలు, బుట్టలు, విసనకర్రల్లోనూ వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎండుటాకులు చీపుళ్లుగానూ, వంటచెరుకుగానూ ఉపయోగపడ తాయి. ఆకుల్లోని పీచుతో తాళ్లు, టోపీలు, నేతబట్ట, లాంటివీ అల్లుతారు. కరవు సమయాల్లో వీటి విత్తనాల్ని పొడి చేసి గోధు మపిండిలో కలిపి రొట్టె చేసుకుని తింటారు. నానబెట్టి పొడికొట్టిన విత్తులు పశువుల మేతకి ఎలానూ పనికివస్తాయి. సబ్బులు, సౌందర్య సాధనాల తయారీలో విత్తనాల నుంచి తీసిన తైలం వాడతారు. ఆక్జాలిక్‌ అమ్లానికి ఈ విత్తులే మంచి వనరులు, కాఫీబీన్స్‌ మాదిరిగా వీటిని కాఫీపొడిలో కలపడమూ కద్దే. ఖర్జూర ఫలాలే కాదు, పుష్పాలూ రుచికరమైనవే. అందుకే ఆయా దేశాల మార్కెట్లలో వీటిని ప్రత్యేకంగా అమ్ముతారు. పూమొగ్గుల్ని సలాడ్‌లలో, ఎండచేపల కూరల్లో వాడతారు.



ఖర్జూరంతో వైద్యం : ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూర పండు తరచుగా ఎక్కువగా తినాలి. ఎండాకాలం వడదెబ్బ తగులకుండా ఉండాలంటే, ఖర్జూర పండును రాత్రుళ్లు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి రక్షించబడుతారు. మూత్రం సాఫీగా కానివారికి కర్జూరపండు పెడితే మూత్రం సాఫీగా జారీ అవుతుంది. పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందు. డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు. చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటి నొప్పి తగ్గుతుంది మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే కర్జూరపండు తరచుగా తినాలి.


మరికొన్ని విశేషాలు : గాలిచోరని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఖర్జూరపండ్లు కనీసం నెల రోజులు నిల్వ ఉంటాయి. కొన్ని పద్ధతుల ద్వారా వీటి రుచి పాడవకుండా ఏడాది పాటు నిల్వ ఉండేలా కూడా చేస్తారు. ఒకవేళ మరీ ఎక్కువ ఖర్జూరాలు పండితే ప్రాసెసింగ్‌ ద్వారా వాటిని పంచదార, జామ్‌, జెల్లీ, జ్యూస్‌, సిరప్‌, వినెగర్‌గా మార్చి విక్రయిస్తున్నారు. బలవర్థక మైన ఆహారంలో భాగంగా ఖర్జూర సిరప్‌ను తేనెలా రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటుంటారు. ఇస్లామిక్‌ దేశాల్లో రంజాన్‌ మాసంలో ఆల్కహాల్‌కు బదులుగా ఖర్జూరాలతో తయారు చేసిన షాంపేస్‌ లాంటి పానీయాన్ని తాగుతున్నారు. మొరాకోలాంటి ఆఫ్రికా దేశాల్లో ఖర్జూరాన్ని పంటల్లో విరివిగా వాడతారు. సహారా వాసులు గుర్రాలు, ఒంటెలు, కుక్కలకు ఆహారంగా ఎండు ఖర్జూరాల్ని వాడతారు.