Search This Blog

Chodavaramnet Followers

Thursday 14 March 2013

SUMMER SPECIAL - SKIN CARE TIPS FOR ALL



వేసవి వచ్చిందంటే ఉష్ణతాపానికి ము ఖం వడలిపోవడమే గాక, చర్మం రంగు కూడా తగ్గిపోతుంది. ఎండలో తిరగడంతో ముఖ వర్చస్సును కోల్పోయి కమిలిపోయినట్లయితే ఏం చేయాలన్న సమస్య స్ర్తి, పురుషులను వేధిస్తూ ఉంటుంది. సా యంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తరువాత చల్లని నీటితో ముఖం శుభ్రం చేసుకొని అరస్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ నిమ్మరసం మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి, మెడ వెనుక, చేతులకు రాసుకొని అరగంట తరువాత సున్నిపిండి లేక శనగపిండి లేదా పెసరపిండితో ముఖం, చేతులు, మెడ వెనుక శుభ్రంగా చల్లని నీటిని ఉపయోగించి కడిగివేయాలి. టాయిలెట్ సోప్స్‌ను మాత్రం ఉపయోగించకూడదు. రాత్రి సమయంలోను సోప్స్ వాడకూడదు. ముఖం, చేతులు శుభ్రం చేసుకున్నాక ఎలాంటి మేకప్ చేసుకోకుండా ఉంటే చాలు. ఇలా వారం పాటు చేస్తే ఫలితం ఉంటుంది.
బ్లాక్‌హెడ్స్
కొద్దిగా నిమ్మరసం, అందుకు సమానంగా గ్లిజరీన్ కలిపి, స్నానం చేయడానికి అరగంట ముందు మఖంపై మసాజ్ చేసినట్లుగా రాయాలి. అరగంట తర్వాత శనగపిండితోగానీ, సున్నిపిండితోగానీ స్నానం చేయాలి. సోప్స్‌ను మాత్రం ఉపయోగించకూడదు. ఇలా మూడు, నాలుగు రోజలకొకసారి చొప్పున నెల రోజులపాటు చేస్తే ముఖం మీద మొటిమలు, బ్లాక్‌హెడ్స్ వలన ఏర్పడే మచ్చలు, నల్లమచ్చల బారినుండి విముక్తి పొందవచ్చు.
పొడి చర్మంతో జాగ్రత్తలు
కొందరికి చర్మం జిడ్డు కారుతూ తాత్కాలికంగా ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. పొడిచర్మం త్వరగా ముడతలు పడి, మృదుత్వాన్ని నశింపజేసి, ముఖం మీద వృద్ధాప్య లక్షణాలను తెచ్చిపెడుతుంది. దీనికి విరుగుడుగా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. పొడి చర్మం గలవారు గ్లిజరీన్ ఎక్కువగా కలిసిన సోప్స్‌ను ఉపయోగించడం ఉత్తమం. కనీసం వారానికొకమారు కోడిగుడ్డులోని తెల్లని సొనలో రెండు స్పూన్ల తేనె కలిపి ముఖానికి రాసుకొని అరగంట తర్వాత చల్లని శుభ్రమైన నీటితో ముఖం కడిగివేసుకోవాలి. ఇలా చేస్తే పొడి చర్మం తెచ్చిపెట్టే సమస్యల నుంచి పూర్తి రక్షణ పొందవచ్చు.
శిరోజాలు రాలుతుంటే
స్ర్తి, పురుషులకు తరచుగా తలపై వెంట్రుకలు రాలడం సంభవిస్తూ ఉంటుంది. లేత కొబ్బరి పాలలో నిమ్మరసం కలిపి, ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు బాగా పట్టే విధంగా మర్దనా చేయాలి. ఇలా ఇరవై రోజులపాటు చేస్తే జట్టు రాలడాన్ని నిరోధించవచ్చు.
ముఖ సౌందర్యానికి
దోసకాయ ముక్కలను ముద్దగా చేసి పాలలో ఒక గంటసేపు నానబెట్టాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ఒక గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత ఫ్రిజ్‌లోనుంచి తీసి జాగ్రత్త చేసుకొని ప్రతిరోజూ క్రీమ్‌లాగా ముఖానికి రాసుకుంటూ ఉండాలి. కొద్ది రోజులపాటు ఇలా చేసినట్లయితే ముఖ వర్చస్సు ద్విగుణీకృతమవుతుంది. పేస్టును ముఖానికి రాసుకున్న అరగంటకు శుభ్రమైన నీటితో కడగటం మాత్రం మరువకూడదు.
పిల్లల్లో చర్మ సంరక్షణ
వేసవికాలం వచ్చిందంటే పిల్లలను చర్మరోగాల బారినుండి కాపాడటం అత్యవసరం. చెమటకాయలు, పొక్కులు పిల్లల శరీరాన్ని పాడుచేసి వారిలో చికాకును, బాధను కలుగజేస్తాయి. సెగ్గెడ్డలు కూడా వారిని బాధపెడుతుంటాయి. అలాంటి సమయంలో పిల్లలకు సోప్స్, షాంపూలు వాడకూడదు. వేప ఆకుల్ని ఎండబెట్టి పొడిచేసి, అందులో కొద్దిగా శనగపిండి, పసుపు కలిపి ఆ మిశ్రమంతో పిల్లల శరీరాన్ని బాగా రుద్ది స్నానం చేయించినట్లయితే వారిని చర్మవ్యాధుల బారినుండి కాపాడవచ్చు.