ఆలూ(బంగాళదుంపలు)-1/2 కిలో
పంచదార - కప్పు
యాలకులు - 3 (మెత్తగా పొడిచేసుకోవాలి)
నూనె - వేయించడానికి సరిపడా
జీడిపప్పు - 50 గ్రాములు, మైదా- కప్పు
బియ్యంపిండి - కప్పు, వంటసోడా - చిటికెడు
పచ్చికొబ్బరి తరుగు - 1/2 కప్పు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
తయారుచేసే విధానం
మైదా, బియ్యంపిండి, వంటసోడాలను కలిపి దానిలో కొద్దిగా నీళ్ళు పోసి దోశ పిండిలా కలిపి రెండు గంటలు నాన బెట్టాలి. బంగాళదుంపలను ఉడకబెట్టి పొట్టు తీసి మెత్తగా మెదుపుకోవాలి. ఒక గిన్నెలో పంచదార పోసి కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి కలుపుతూ లేత పాకం (ఒక ప్లేటులో నీళ్లుపోసి పాకం వేస్తే మెత్తగా ఉండ అయితే చాలు) వచ్చేవరకూ తిప్పుకోవాలి. అందులో మెదిపి పెట్టుకున్న బంగాళదుంప ముద్ద, యాలకులపొడి, నేతిలో వేయించిన జీడిపప్పు వేసి కలపాలి. తరువాత చిన్న చిన్న ఉండలు (పూర్ణాలు మాదిరి) చేసి పెట్టుకోవాలి. బంగాళదుంప ఉండల్ని ముందుగా కలిపి పెట్టుకున్న మైదా, బియ్యంపిండి మిశ్రమంలో ముంచి కాగిన నూనెలో వేసి దోరగా వేగనివ్వాలి. అంతే ఆలూ పూర్ణాలు రెడీ. నోట్లో వేసుకుంటే మెత్తమెత్తగా తియ్య తియ్యగా భలే ఉంటాయి. మరి మీరూ ప్రయత్నిస్తారుగా!
బాదం హల్వా
కావలసిన పదార్థాలు
బాదంపప్పు - 200 గ్రాములు
పంచదార - కప్పు, పాలు - 1/2 కప్పు
యాలకులపొడి - అరస్పూను
పచ్చకర్పూరం - చిటికెడు, నెయ్యి - కప్పు
జీడిపప్పు, కిస్మిస్-50 గ్రాములు
తయారుచేసే విధానం
బాదంపప్పు మునిగేలా నీళ్ళుపోసి నాలుగు గంటలు నానబెట్టాలి. అంత సమయం లేకపోతే బాగా మరిగించిన నీటిలో గంట నానబెట్టినా చాలు. తర్వాత పై పొట్టు తీసేసి నీళ్లు పోసి మిక్సీలో వేసి పాలుపోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులోనే పంచదార కూడా వేసి కలపాలి. సన్నని మంటమీద మందపాటి గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి దగ్గరపడేవరకూ కలుపుతూ ఉండాలి. దించేముందు నెయ్యి, యాలకులపొడి, పచ్చకర్పూరం, నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్‌లు వేసి బాగా కలియబెట్టాలి. హల్వాని గరిటెతో తీసి చేత్తో పట్టుకొంటే అంటకపోతే తయారయిపోయినట్లే. అంతే బాదం హల్వా రెడీ. ఇది చాలా మృదువుగా రుచిగా ఉంటుంది.
సేమ్యా హల్వా
కావలసిన పదార్థాలు
సేమ్యా - కప్పు, పంచదార - కప్పు
నెయ్యి - 1/2 కప్పు
యాలకుల పొడి - 1/2 టీ స్పూన్
పచ్చికొబ్బరి తురుము- కప్పు
జీడిపప్పు, కిస్మిస్- 50 గ్రాములు
తయారుచేసే విధానం
స్టవ్ మీద బాండీ పెట్టి రెండు టీస్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పూ, కిస్మిస్ వేయించుకోవాలి. తర్వాత సేమ్యా కూడా దోరగా వేయించుకోవాలి. అడుగుమందంగా ఉన్న గిన్నెలో మూడు కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. మరిగే నీటిలో సేమ్యా వేసి ఉడికిన తర్వాత పంచదార వేసి కలపాలి. పంచదార వేయడం వల్ల కొద్దిగా పలచగా అవుతుంది. అది గట్టిపడే వరకూ తిప్పుతూ ఉండాలి. తర్వాత నెయ్యి, యాలకులపొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలిపాలి. హల్వా గిన్నెకు అంటుకోకుండా ఉంటే రెడీ అయిపోయినట్లే. స్టవ్ మీద నుంచి దించి వడ్డించుకుని వేడివేడిగా తినొచ్చు. లేదా చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టుకొని చల్లచల్లగా కూడా తినొచ్చు. మీ ఇష్టం మరి..
పోకుండలు
కావలసిన పదార్థాలు
బియ్యం - 2 కప్పులు
బెల్లం - కప్పు (పొడిచేసి కొలవాలి)
తెల్లనువ్వులు - 4 టీ స్పూన్లు
నెయ్యి - 2 టీ స్పూన్లు
ఎండు కొబ్బరి - కప్పు (తురుము)
తయారుచేసే విధానం
బియ్యం నానబెట్టి పిండిచేసుకోవాలి. ఆ పిండిని మెత్తగా జల్లించుకోవాలి. నువ్వులపప్పును నూనె వేయకుండా బాండీలో దోరగా వేయించుకోవాలి. అదే బాండీలో నెయ్యి వేసి ఎండుకొబ్బరి తురుమును వేసి దోరగా వేపుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె స్టవ్ మీద పెట్టి బెల్లంపొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం వచ్చే వరకూ కలుపుతూ ఉండాలి. పాకం ఉండకడితే (ఒక ప్లేటులో నీళ్లుపోసి పాకం వేస్తే ఉండ కట్టాలి) చాలు. అప్పుడు బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలి (చలిమిడిలాగా) స్టవ్ మీద బాండీ పెట్టి నూనె పోసి బాగా కాగనివ్వాలి. ఈలోగా పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని గుండ్రంగా రెండు చేతుల మధ్య ఉంచి నున్నగా చుట్టి నూనెలో వేసి గోధుమరంగులోకి వచ్చేవరకూ వేయించుకోవాలి. గాలి చొరని డబ్బాలో వేసి పెట్టుకొంటే 15రోజుల వరకూ నిల్వ ఉంటాయి. ఇవి తినడానికి చాలా బాగుంటాయి.