Search This Blog

Chodavaramnet Followers

Tuesday, 26 February 2019

A TRIBUTE TO DR.NANDAMURI THARAKA RAMA RAO GARU


సరిలేరు నీకెవ్వరూ!
****************

కొన్నిచరిత్రలను ముట్టుకోవాలనీ,
వాటిని తిరగరాయాలనీ ప్రయత్నించకూడదు!
కేవలం వాటినాస్వాదించాలంతే!

కాదూ! మేం చేయగలం,మేమే చేయగలమ్మని చేతలకు దిగారో!
చరిత్రకొరిగేదేమీ లేదు! చేతులే కాలుతాయ్!

రాముడు,రావణుడు,కృష్ణుడు,భీముడు,కర్ణుడు,దుర్యోధనుడు,
కొండవీటిసింహం,బొబ్బిలిపులి,మేజర్ చంద్రకాంత్,
వెరసి,
విశ్వవిఖ్యాతనటసార్వభౌమనటరత్న,డా.ఎన్.టి.రామారావు.
ఇదే అసంఖ్యాక సినీప్రేక్షకజనావళి నీరాజనాలందుకున్న,
ఓ అనితరసాధ్య నటనాకౌశలాన్ని సొంతం చేసుకున్న,
అరుదైన,ఒకేఒక్క మహోన్నటుడి పేరు!

ఏన్టీ రామారావ్,ఎన్టీఆర్,ఎన్టీవోడు అని,
సాదరాభిమానంగా ప్రతినోటా పలకబడే పేరది.
ఆచరిత్ర తిరిగి రానిది,ఆచరిత్ర తిరగరాయలేనిది!
చలనచిత్రరంగాన ఆయనకు ప్రత్యామ్నాయమే లేదు!
నభూతోనభవిష్యత్ అన్న నానుడి ఖచ్చితంగా వర్తించే నటుడు ఎన్టీఆర్!

బయోపిక్కులు పుంఖానుపుంఖాలుగా తీసి
ఊది పారేస్తూన్న ఈరోజుల్లో,
ఎన్టీఆర్ కథనూ సినిమాగా తీయాలనుకోవడం,
మొండిధైర్యమనుకోవాలో లేక,
బయోపిక్కులు తీస్తున్నారు కనక,
మేమేం తక్కువతిన్నామనుకుని,
పోటీగా తీసునట్లుందే తప్ప.!!
అసలు ఆ వ్యక్తిత్వాన్నిగానీ,
ఆస్పుర్ద్రూప అచంచల నటగాంభీర్యవాచస్ప
వాక్పటిమా ధురంధరతకు,కనుచూపుమేరలోనైనా చేరగలమా
అనే క్షణికాలోచనయూ చేయకపోవుట,
చిత్రపు రెండుభాగాలనూ ఎంతో ఓపిగ్గా చివరివరకూ,
తన అభిమాననటుడి కోసం కళ్ళనూ/చెవులనూ
నిక్కించి/రిక్కించి మరీ వెదికినా,
ఎన్టీఆర్ కనబడక/వినబడక హతశులై/కకావికలై,
కలతబడ్డ మనసుతో,మానధనులైన,అభిమానులు
అవమానభారంతో వెనుదిరక్కతప్పలేదు.

బయోపిక్కులంటే ఎవరిదైనా,ఎవరైనా తీయొచ్చు!
మొన్నామధ్య మహానటి సావిత్రి వచ్చింది!
అచ్చం సావిత్రిలా లేకపోయినా,
దర్శకుడు చూపించిన కథనంలోపడ్డ ప్రేక్షకుడు
అప్రయత్నంగానే కీర్తిసురేష్ లో సావిత్రిని చూడగలిగారు!
వెదకనవసరం లేకుండానే అడుగడుగునా సావిత్రిని తలపించేలా
వాచకమూ,ఆహార్యమూ ఆసాంతమూ చూపుతిప్పనీకుండా
కనికట్టుచేసి కళ్ళక్కట్టించాడు దర్శకుడు!

మరిక్కడ!
చూస్తూన్న ప్రేక్షకుడు మొదటిక్షణాన్నుంచే తన కళ్ళన్నీ వెదికే
ఒకేఒక స్వరూపాన్నీ,వినాలనుకునే స్వరాన్నీ,
తెరకు ఈమూలనుంచామూలదాకా,
చిత్రం అయిపోయేదాకా వెతుకుతూనే ఉంటాడు!
బైటపడి ఇంటికొచ్చి ఎన్టీఆర్ పాతసినిమానొకదాన్ని చూసి
తన నేత్రశ్రవణదాహాన్ని తీర్చుకునేదాక ఊర్కోడు.

ఎన్టీఆర్ అంటే తెలుగుప్రేక్షకుడికున్న ప్రేమ అలాటిది.

ఇక కథనాన్నోసారి గమనిస్తే!
మహానటిలో సావిత్రి తన జీవితంలో తెలిసో,తెలియకో పడ్డ తడబాట్లో,
తెలిసీ తెలియని పొరబాట్లో తద్వారా అనుభవించిన క్షోభను
తనకంటే ప్రేక్షకుడే ఎక్కువ అనుభవించేలా,
ఎక్కడా మొహమాటపడకుండా ఉన్నదున్నట్లు దృశ్యీకరించారు దర్శకులు.
ప్రేక్షకులా దృశ్యాలకు కాస్త నొచ్చుకున్నా,
గుండెలు చిక్కబట్టుకుని జరిగిన వాస్తవాల్ని
తమదైన సానుభూతితో అక్కునచేర్చుకున్నారు.
చిత్రాన్నీ ఆదరించారు.

బయోపిక్కంటే అంతే!
కల్పితంకాకుండా ఉన్నదున్నట్లు అంతా చూపించడం!
ప్రతీచరిత్రలోనూ,ఉత్థానపతనాలూ,ఒడిదుడికులూ ఉంటాయ్!
ఎన్టీఆర్ కూడా వీటికి అతీతుడు కాడనీ,
పైపెచ్చు నిగ్రహం కోల్పోని ఆవిగ్రహం అన్నిటినీ తట్టుకుని పైకే ఎగసిందని
ఆమహానుభావుడి చరమాంకాన్ని ప్రతీ తెలుగోడూ ప్రత్యక్షంగా ఎరిగినదే!

మరలాటపుడా మహనీయుడి ఆటుపోట్లని అధాటుగా దాటవేసి,
అత్యంతకీలకమైన కొన్ని ఘట్టాలను అసలే చూపించకపోవడం,
ఆతురతతో ఎదురుచూసే ప్రేక్షకుడ్ని నిరాశపరచడమేగా!

కారణాలేమైనప్పటికీ ఒక నిజజీవితాన్ని తెరకెక్కించేప్పుడు,
అదే చరిత్ర,,చూసే ప్రేక్షకుడికి ముందే పూర్తిగా తెలిసినదైనప్పుడు,
దాన్ని దాటవేయడమో,దాచివేయడమో చేస్తే,
అది స్వోత్కర్షో,లేక ఏకపక్షపు రాజకీయ ఒత్తిడులకో,
లేక రాజకీయ ప్రయోజనాలకొరకో తీసినట్టే అవుద్ది తప్ప,
ఓ పూర్తి బయోపిక్కు కాజాలదు.

ఎన్టీఆర్ అంటే ఓ తెరిచిన పుస్తకం.
ఎన్టీఆర్ అంటే ఓ పరిచిన వ్యక్తిత్వం.
ఎన్టీఆర్ అంటే చెదిరిపోని అస్థిత్వం.

సరిలేరు ఆయనకెవ్వరు!
నటసిరిలోనూ,రాజకీయబరిలోనూ!
హావభావప్రకటనాప్రకంపనల్లోని విరుపులోనూ!
మంద్రగాంభీర్యస్వరగాత్రవిన్యాసంలోనూ!

సాటి రారెవ్వరు,పోరెవ్వరు,పోయి నిలువలేరెవ్వరు!
వినా,తెలిసీ పోదురే!
నిక్కమిది బొక్కబోర్లపడుదురు!