Search This Blog

Chodavaramnet Followers

Friday, 29 December 2017

IMPORTANCE OF VYKUNTA EKADASI FESTIVAL ARTICLE IN TELUGU


వైకుంఠ ఏకాదశి నాడు జరిపే ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?:

అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారు. 
ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు.

ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకదశీ వ్రతం" ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.
అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని వధించాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు.
అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు అంటున్నారు.
వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులీ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నారు.
అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.
ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదు