పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ కోటిపల్లి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. శ్రీరాజరాజేశ్వరి సహిత సోమేశ్వరస్వామి వారి దేవస్థానం కోటిపల్లి .
వ్యాస భగవానుడు రచించిన బ్రహ్మాండ పురాణములోని గౌతమీ మహాత్యములో ఈ కోటిపల్లి క్షేత్ర మహత్యముంది .
కోటిపల్లి గుడిలో రాజరాజేశ్వరి సహిత సోమేశ్వరస్వామివారు, అమ్మవారితో కూడిన కోటీశ్వర స్వామివారు,శ్రీదేవి, భూదేవి సహిత జనార్థన స్వామి వారు వేంచేసి ఉన్నారు.
ఈ క్షేత్రము పూర్వకాలమున "కోటి తీర్ధము గాను" సోమ ప్రభాపురము " గాను పిలువబడి నేడు "కోటిఫలి" మహాక్షేత్రముగా ఖ్యాతిపొంది విలసిల్లుచున్నది .
కోటిఫలి గౌతమీ నది ( గోదావరి ) ఒడ్డున ఉంది .ఇచట గౌతమీ పుణ్య నదీలో విష్ణుతీర్ధ, రుద్రతీర్ధ,బ్రహ్మతీర్ధ,మహేశ్వర తీర్ధ,రామతీర్ధాది అనేక పుణ్య నదులు కోటి సంఖ్యలో అంతర్వహినులుగా ప్రవహించుచున్న కారణముగా " కోటి తీర్ధ క్షేత్రము "గా ఖ్యాతి వహించినది .
స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేరును సోమగుండం అని పిలుస్తారు .
ఉమా సమేత కోటిశ్వరాలయము
ఇంద్రుడు తాను చేసిన పాపాలు పోగొట్టు కోవడానికి ఉమా సమేతుడైన కోటీశ్వర లింగాన్ని ప్రతిష్ఠించగా , సోమేశ్వర స్వామి వార్ని చంద్రుడు ప్రతిష్ఠిం caaడు . కోటేశ్వరుడు ఎప్పుడు నీటిలోనే ఉంటాడు .
శ్రీ ఛాయ సోమేశ్వర స్వామి
చంద్రుడు కోటి తీర్ధమునకు వచ్చి , గౌతమీ పుణ్యనదిలో భక్తీ శ్రద్ధలతో శ్రీ సిద్దిజనార్దుని , కోటీశ్వరుని దర్శించి సేవించి సోమేశ్వర నామంతో శివలింగమును ప్రతిష్ఠించి పూజించి ప్రార్ధించి పాప విముక్తుడాయేనని , తాను కోల్పోయిన ఛాయను తిరిగి పొందుటచే ఈ లింగమునకు " ఛాయా సోమేశ్వర లింగము పేరు వచ్చినది అని స్థలపూరణం .శ్రీదేవి,భూదేవి సమేతుడైన సిద్ధి జనార్థన స్వామి వారిని కశ్యప ప్రజాపతి ప్రతిష్ఠించాడని, ఆయనే క్షేత్రపాలకుడని చెబుతారు.
ఈ పవిత్ర గౌతమీ తీర్థం లోని పుణ్య స్నానం సర్వపాపాలను తొలగించి పుణ్యాన్ని ఇస్తుంది. శివకేశవ భేదం లేదని ఈ క్షేత్రం మనకు పున: పున: చెబుతుంది. కోటీశ్వర లింగం యోగ లింగం అని, సోమేశ్వర లింగం భోగ లింగం అని, రాజరాజేశ్వరమ్మ భక్తుల కోరికలు తీర్చే తల్లి అని భక్తుల నమ్మిక.
శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు
అమ్మవారికి ప్రత్యేక ఆలయము కలదు . అమ్మవారు దివ్యమైన తేజస్సుతో నిరంతరమూ ప్రశాంత వదనముతో చిదానందముతో కూడిన వాత్సల్య పూరితమైన చూపులతో భక్తులకు దర్శన మోసంగుచూ వేంచేసియున్నారు .
ఆలయం లో నాలుగు ప్రదక్షిణ మండపాలు ఉన్నాయి. ఉత్తర మడపం లో కాలభైరవ స్వామి మందిరం ఉంది. అర్చకులు ప్రతీరోజు ప్రాతః కాలమందే కోటి తీర్థం నుండి జలాలు తీసుకొని వచ్చి స్వామికి అభిషేకం, అర్చన చేస్తారు. సాయం సంధ్య వేళ స్వామికి ధూప సేవ, ఆస్థాన సేవ, పవళింపు సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. పురాతన కాలంనుండి ఈ పవిత్రక్షేత్రాన్ని భక్తులు దర్శించి తరిస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని సోమప్రభాపురం అని పిలిచేవారు. ఇక్కడ సోమం కుండం అనే ఒక పెద్ద పుష్కరిణి నేటికీ ఉంది. ఆదిశంకరులు ఈ క్షేత్రాన్ని దర్శించారని చెబుతారు. ఈ దేవాలయం లోనే చంద్రమౌళిశ్వర స్వామి శంకరాచార్యుల మందిరం, ఉమా సమేత మృత్యంజయ లింగం , నవగ్రహాల గుడి ఉన్నాయి.
ఇది కాకినాడకు 38 కి.మీ.లు, రాజమండ్రికి 60 కి.మీ. దూరంలో ఉంది. కోటిపల్లి అమలాపురం నుండి 15 కి.మీ. దూరంలో ఉంది, ఇక్కడకు పడవ లేదా ఫెర్రి ద్వారా చేరుకోవచ్చు.