Search This Blog

Chodavaramnet Followers

Saturday 7 October 2017

TELUGU PURANA ARTICLE - PANCHA MAHA YAGNALU BY SRI SOMA SEKHAR


పంచ మహా యజ్ఞాలు 

ఈ భూమిపై జన్మించిన ప్రతి మనిషీ తన జీవితములో అనునిత్యం పాటించవలసిన కొన్ని విధులు ఉన్నాయి. అవే పంచ మహాయజ్ఞాలు.

1. దేవ యజ్ఞం – సకల ప్రాణికోటిలో ఉత్తమమైన జన్మను పొందిన మనము సృష్టికి మూలకారకుడైన ఆ పరమేశ్వరుడికి కృతఙ్ఞతలు తెలపడమే దేవయజ్ఞం. పూర్వం ప్రతి ఇంట్లోనూ నిత్యాగ్నిహోత్రులు ఉండేవారు. వారు తమ భోజనానికి ముందు కొంత అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు. దీనినే అహుతం అంటారు. దేవతలు అగ్నిముఖంగా ఆహారాన్ని స్వీకరిస్తారు. కనీసం ఇంట్లో వారందరూ అగ్నికి సమిధలు సమర్పించినా అహుతం చేసినట్లే.

2. పితృ యజ్ఞం – మనల్ని కన్న తల్లిని, పెంచి పెద్ద చేసిన తండ్రిని ప్రేమగా చూడాలి. వారు మన చిన్నతనములో మనల్ని ఎంత ప్రేమగా చూసేవారో, మనం కూడా వారి పెద్ద వయసులో వారి అవసరాలు చూస్తూ కనిపెట్టుకుని ఉండాలి. ఈ విధముగా చేస్తే వారి ఋణాన్ని కొంతయినా తీర్చుకోగలము.

3. భూత యజ్ఞం – గృహస్థాశ్రమములో ఉన్న వ్యక్తి సర్వ ప్రాణికోటి మీద దయను కలిగి ఉండాలి. మనం అన్నం తినడానికి ముందు ఒక ముద్ద అన్నాన్ని పక్షులు వచ్చే ప్రదేశములో పెట్టాలి. ఇంటి ముందు కాపలాగా ఉండే కుక్కకు, ఇంట్లో తిరిగే పిల్లికి, దొడ్లో ఉండే పశువులకు ఆహారాన్ని పెట్టాలి. అలాగే క్రిమి కీటకాదులకు కొంత ఆహారాన్ని పెట్టాలి. ఈ విధముగా సకల ప్రాణులందు దయ కలిగి, వాటికి ఆహారం అందివ్వడమే భూత యజ్ఞం.

4. మనుష్య యజ్ఞం – తిథి, వారము చూసుకోకుండా వచ్చేవాడే అతిథి. మన పెద్దలు అతిథి దేవో భవ అన్నారు. అంటే అతిథి దైవముతో సమానం. కనుక ఎవరైనా మన ఇంటికి వచ్చినపుడు ఆ సమయాన్ని బట్టి వారిని తగిన విధముగా గౌరవించాలి. ఎవరైనా మన సహాయాన్ని అర్ధించినప్పుడు మనం చెయ్యగలిగిన సహాయాన్ని స్వార్థ రహితంగా చెయ్యాలి.

5. బ్రహ్మ యజ్ఞం – పూర్వపు రోజులలో ప్రతివారు వేదాన్ని చదివేవారు. ఇప్పుడు వేదమంత్రాలను పఠించేవారి సంఖ్య తగ్గిపోయింది. మనం వేదాలను చదువలేకపోతే కనీసం మనకు అందుబాటులో ఉన్న శాస్త్రాలను అయినా చదవాలి. అలాగే వాటి ద్వారా మనము తెలుసుకున్న విషయాలను ఇతరులతో పంచుకోవాలి. దీని వలన జ్ఞానం పెరుగుతుంది.

ఈ ఐదు యజ్ఞాలను ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటే అందరూ సక్రమ మార్గములో నడుస్తారు. దానివలన ఈ ప్రపంచమంతా సుఖశాంతులతో వర్ధిల్లుతుంది.