Search This Blog

Chodavaramnet Followers

Tuesday, 3 January 2017

BRIEF INFORMATION ABOUT LOPAMUDHRA IN TELUGU


లోక కళ్యాణమే పరమావధిగా జీవించిన మహా తత్వవేత్త!! (లోపాముద్ర)

లోపాముద్ర భారతీయ సాహిత్యంలో ప్రాచీన తత్వవేత్త. ఈమె అగస్త్యమహర్షి భార్య . ఈమె క్రీ.పూ 6వ లేదా 7వ శతాబ్దంలో జీవించినట్లు నమ్మకం. తన భర్తతో పాటు ప్రజల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేసినట్లు తెలుస్తోంది. ఈమెకు "కౌశితకి" మరియు "వరప్రద" అనే నామాలు కూడా ఉన్నాయి. ఋగ్వేదం లో ఒక శ్లోకం ఆమె గురించి తెలియజేస్తుంది. మహా భారతంలో అగత్స్య మహర్షి "గంగద్వార" (హరిద్వార్) వద్ద తన భార్య అయిన లోపాముద్ర సహకారంలో తపస్సు చేసినట్లు ఉన్నది. ఈ దంపతులకు ద్రిధశ్యుడు అనే కుమారుడు ఉన్నాడు, ఆయన ఒక ప్రముఖ కవి. ప్రస్తుతం కావేరి నది లోపాముద్ర పునర్జన్మ పొందిన రూపం అని చెప్పబడుతుంది.

లోపాముద్ర విదర్భ రాజకుమారి. పురాణాల ప్రకారం లోపాముద్ర అగస్త్య మహర్షిచే సృషింపబడినదని, ఆయన వివిధ జంతువులలో అందమైన భాగాలతో(జింక కండ్లు మొదలైనవి) తయారుచేసినట్లు చెప్పబడింది. లోపాముద్ర అనగా వివిధ జంతువులలోని అందమైన భాగాలతో యేర్పడిన మహిళ అని అర్థము. ఆమెను సృష్టించిన తరువాత అగస్త్యుడు ఆమెను రహస్యంగా విదర్భ రాజ భవనానికి తరలించినట్లు చెప్పబడింది.

ఆమె పెరిగి పెద్దయిన తరువాత అగత్స్యుడు ఆమెను వివాహమాడమని కోరాడు. ఒక్కతే కుమార్తె అవడంతో గారాబంగా పెంచిన ఆమెను మునిపత్నిని చేసి అరణ్యాలకు పంపడం ఎలాగా అన్న ఆలోచనలో పడ్డాడు రాజు. బంగారంలాంటి పిల్లను కాపురం కోసం కానలకు పంపలేక తల్లిదండ్రులు సతమతం కావడం చూసిన లోపాముద్ర రుషిపత్నిగా మారడానికి తనకెలాంటి అభ్యంతరమూ లేదని తెలియజేస్తుంది. అగస్త్యుని కోసమే తాను జన్మించానని, రాచపుత్రిక అయినంతమాత్రాన అడవుల్లో కాపురం చేయకూడదన్న నిబంధన ఏదీ లేదంటూ బోధపరుస్తుంది. వివాహం అవగానే అగస్త్యుడు ఆమె రాజోచిత దుస్తులను అలంకారాలాను వదలి, ఒక తాపసి భార్యకు ఉచితమైన నార చీరలు ధరింపమని చెబుతాడు.

అప్పుడు ఆమెను గంగా ద్వార ప్రాంతానికి (నేటి హరిద్వార్) తీసుకొని వెళ్ళీ ఆశ్రమ జీవితం ప్రారంభిస్తాడు. ఆశ్రమ జీవితం చక్కగా గడిచిపోతున్నది. కొన్ని దినాలకు ఆయనకు పితృదేవతలకిచ్చిన వాగ్దానం గుర్తుకు వస్తుంది. భార్యకు చెబుతాడు, అప్పుడు ఆమె భర్తతో ఇలా అంటుంది."ఆశ్రమవాస జీవితం బాగానే ఉంది. ఇప్పుడు పిల్లలు అంటే మనము ఉన్న స్థితిలో శొభించదు. గృహస్థ జీవితం గడపడానికి ధనం, స్వర్ణం కావాలి" కావాలంటే తమ రూపాలను మార్చుకొని, కనక వర్షం కురిపింపగల తపః శక్తి ఆయనకు ఉన్నది. కాని ఆయనకు తన తపస్సును ఖర్చుపెట్టాలనిపించలేదు. భార్యతో " సంపాదన కష్టమేమీ కాదు. ఏరాజునడిగినా ఇస్తాడు. అని సమీపంలోని ఒక రాజ సభకు వెళ్తాడు.

శృతర్వుడు అనే రాజు వద్దకు అగస్త్యుడు వెళ్ళి, "రాజా నాకు కొంచెంధనము కావాలి" అని అడుగుతాడు. రాజుకు ఆశ్చర్యం, భయం కూడా వేశాయి. ఈ మహర్షి కనక వర్షం కురిపించగల తపశ్శాలి... నన్ను అడుగుతున్నాడు. ఆయనకు ఎంత కావాలో నేను ఈయగలనో లేదో అని సంకోచిస్తాడు. ఇద్దరు ముగ్గురు రాజులు ఆయనకు ఇవ్వడానికి వెనుకాడారు. అప్పుడు ఇల్వలుడు అనే రాక్షసాంశలో పుట్టిన రాజు వద్దకు వెడతాడు. ఆరాజు తమ్ముడి పేరు వాతాపి. కామరూపధారణ వంటి కొన్ని శక్తులున్నాయి, బ్రహ్మణులను చంపి తినేసేవారు.

వారికి కనిపించిన బ్రాహ్మణులతో "మాఇంట్లో పితృ కార్యం ఉన్నది. రేపు మాయింటికి భోక్తగా రండి" అని ఆహ్వానిస్తారు. వాతాపిని అన్న మేకగా మార్చి, చంపి ఆమాంసాన్ని ఆ బ్రాహ్మణునికి పెడతాడు. తరువాత "వాతాపీ రా" అని మంత్రిస్తే వాడు బ్రతికి, ఆ ముని పొట్టచీలుచుకొని, బయటకు వస్తాడు. ఈ ప్రకారంగా వాళ్ళు వీలైనప్పుడల్లా బ్రాహ్మణ మాంస భక్షణ చేసేవారు. అగస్త్యుడు ఇల్వలుని యొద్దకు ధనమడగటానికి వెడతాడు. అగస్త్యునికి అదే సత్కారం చేదామని ఇల్వలునికి అనిపిస్తుంది. ధనానికి ఏముంది.. మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాము. ముందు మా ఇంటిలో భోజనం చేయండి అని ఆహ్వానిస్తాడు. మామూలుగానే వాతాపిని మేకగా మార్చి వండి వడ్డిస్తాడు. భోజనమవగానే అగస్త్యుడు " జీర్ణం.. జీర్ణం.. వాతాపి జీర్ణం" అని మూడు సార్లు అంటాడు. వాతాపీ రా!రా! అని ఇల్వలుడు ఎన్నిసార్లు పిలిచినా లాభంలేక పోయింది.

సముద్రజలమంతటినీ త్రాగిన అగస్త్యునికి వాతాపి ఒక లెక్కా?
ఇల్వలుడు భయంతో వణికి పోయాడు తన దగ్గరున్న బంగారమంతా ఆయనకే ఇచ్చాడు. ఈ లోకోపకార కృత్యం ఆయన వలన జరగటానికే ఈ సంఘటన జరిగినది. దీనికి కారణం అయ్యింది లోపాముద్ర. నేటికీ మన దేశంలో తల్లులు పసిపిల్లలకు ఆహారమిచ్చినప్పుడు "జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం" అనడం వింటాము. అది అగస్త్యమునిని, లోపాముద్ర ను తలచుకోవడమే.