Search This Blog

Chodavaramnet Followers

Friday, 27 January 2017

ARTICLE ABOUT TTD TIRUMALA SHANKANIDHI AND PADMANIDHI


తిరుమలలో శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసా !

తిరుమలలో శంఖనిధి,పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ముందు వారు ఎవరో ముందు తెలుసుకుందాం.శంఖనిధి,పద్మనిధులు శ్రీ వేంకటేశ్వరస్వామివారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో ఎడమవైపున అంటే దక్షినదిక్కున ఉన్న రక్షకదేవత పేరు శంఖనిధి,ఇలాగే కుడిప్రక్కన అంటే ఉత్తరదిక్కున ఉన్న రక్షకదేవత పేరు పద్మనిధి . శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ధరించివుంటాడు. పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి.

ఇంతకూ వీరు ఎక్కడ ఉన్నారంటారా! తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలె సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహవిగ్రహాలు ఉన్నాయి. ఆలయంలోనికి ప్రవేశించేముందు మనం మనకాళ్ళను ప్రక్షాళనచేసుకునే దగ్గర శ్రీవారి ఆలయంగడపకు ఇరుప్రక్కలా కనిపిస్తారు. మనం సాధారణంగా కాళ్ళను కడుక్కునే ఆలోచనలో ఉంటాము.కాబట్టి వారిని గమనించే అవకాశం తక్కువగా ఉంటుంది.దానికి తోడు ఎంతోసేపు ఎదురుచూసిన ఆలయప్రవేశం ఆనందంలో కూడా గమనించం.

ఈ నిధిదేవతల పాదాలవద్ద ఆరంగుళాల పరిమాణంగల రాజవిగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉండడం గమనించవచ్చు. ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుతదేవరాయలది. బహుశా అచ్యుతరాయలే ఈ నిధిదేవతలను ప్రతిష్టించి ఉంటాడనవచ్చు.

ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశద్వారంవద్ద ఏర్పాటు చెయ్యడం సంప్రదాయం. దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడుప్రాకారాలు కలిగిన ఆలయమని తెలుస్తోంది.

ఇంతకు ముందు వీరిని మీరు గమనించివుండకపోతే ఈసారి శ్రీవారిదర్శనంకు వెళ్ళినప్పుడు గమనించి నమస్కరించి ఆలయంలో ప్రవేశించండి.