అమ్మలగన్న అమ్మ కరకచెట్టు పోలమాంబ
కరకచెట్టు పోలమాంబ అమ్మవారు 16వ శతాబ్దానికి పూర్వం వెలసిన దేవత. ఈ ఆలయానికి విశిష్ట చరిత్ర ఉన్నది. పోర్చుగీసు వారు మనదేశంలో తూర్పు సముద్ర తీరంలో వ్యాపారం చేస్తున్న రోజుల్లో విశాఖపట్నంలోని పెదజాలరిపేటకు చెందిన మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్ళి, వల వేయగా ఈ అమ్మవారి విగ్రహం దొరికింది. కొన్ని రోజులు అమ్మవారిని వారు పూజించగా వారికి అమ్మవారు కలలో కనిపించి నన్ను పెదవాల్తేరులో ఉన్న మద్ది వంశీయులకు అప్పగించమని చెప్పింది.
ఆ విధంగా ఆ జాలరులు ఆ విగ్రహాన్ని తీసుకువెళ్ళి మద్ది వంశీయులకు అప్పగించగా మద్ది వంశీయులు కొన్ని రోజులు పూజించారు. వారికి కలలో కనిపించి నన్ను జీడిచెట్ట వద్ద ఉన్న కరకచెట్టు కింది ప్రతిష్ఠ చేయమని చెప్పింది. దాంతో వారు కరకచెట్టు కింద ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి కరకచెట్టు పోలమాంబ అమ్మవారుగా ప్రసిద్ధికెక్కింది. పూర్వం ఈ అమ్మవారికి జీడిపళ్ళ అమ్మవారు అనే పేరు ఉండేది. పండుగ రోజున ఈ అమ్మవారి గుడి మీద జీడిపళ్ళు భక్తులు విసిరేవారు.
ఈ అమ్మవారికి శిరస్సులో సర్పం, కుడిచేతులో కమలం, ఖడ్గం, ఎడమ చేతిలో సర్పం, కుంకుమ భరిణి ఉన్నాయి. అమ్మవారి విగ్రహం సముద్రంలో లభ్యమవడంతో సముద్ర దేవతగా, సర్పం శిరస్సున ధరించడం వల్ల సర్పదేవతగా భక్తులు కొలుస్తున్నారు. అమ్మవారికి కుడివైపున కుంచమాంబ అమ్మవారు, ఎడమ వైపు నీలమాంబ అమ్మవార్ల విగ్రహాలు ప్రతిష్ఠించివున్నాయి. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నేస్తాలమ్మ, బంగారమ్మ, దండుమారెమ్మ, కనకదుర్గమ్మ, ముత్యాలమ్మ, సత్తెమ్మ, పిడుగులమ్మ అమ్మవార్ల ఆలయాలు ఉన్నాయి. ప్రతీ రోజు ఉదయం అయిదు గంటలకు క్షీరాభిషేకం జరుగుతుంది.
ప్రతీ ఏడాది ఉగాది పండగ అనగా చైత్రశుద్ధ పాడ్యమి తర్వాత వచ్చే ఆదివారం రోజున 14 గ్రామాల్లో చాటింపు కార్యక్రమంతో అమ్మవారి పండుగ ప్రారంభమవుతుంది. మరుసటి రోజు సోమవారం రాత్రి అమ్మవారి దేవాలయం నుంచి పుట్టమట్టి(పుట్టబంగారం)ని తీసుకుని వెళ్ళి పెదవాల్తేరు గ్రామంలో చదును పట్టువద్ద అమ్మవారిని నిలుపుతారు. ఆ రోజు నుంచి తొమ్మిది రోజుల పండగ చేసి తొమ్మిదో రోజు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు చదునుపట్టు నుంచి సన్నాయి మేళాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారిని దేవాలయం వద్ద అనుపుతారు. దీనినే అనుపు మహోత్సవం అంటారు. తదుపరి మంగళవారం మారువారము పండుగ చేస్తారు.
ప్రసిద్ధమైన శ్రీ అమ్మవారికి పండుగ రోజున రాత్రి 11గంటలకు పంచామృత అభిషేకం, తొలిపూజ, తొలి దర్శనం చేసుకున్న వారికి అమ్మవారి కరుణా కటాక్షం, అమ్మవారి శేష వస్త్రం, ప్రసాదాలు లభిస్తాయని ఆలయ కమిటీ తెలిపింది.