Search This Blog

Chodavaramnet Followers

Friday, 16 December 2016

THIRUPPAVAI PASURAMU - 1 AND ITS MEANING IN TELUGU - IMPORTANCE OF DHANURMASAMU


ప్రతి పాశురానికి చివర ఎలోరెమ్బావై అనేటటువంటి మాట వస్తున్నది. ఎమ్బావై అంటే వ్రతము అని అర్థం. అందరినీ పిలిచి మనం ఈ వ్రతాన్ని సార్థకం చేసుకుందాం. ఇది జగతికి మంగళ ప్రదము అనేటటువంటి భావాన్ని చెప్తున్నారు. మార్గశీర్ష మాసం వచ్చినది. అది ఎలా ఉన్నది అంటే నిండు చంద్రుడి శోభలతో వచ్చినటువంటి మార్గశీర్ష మాసం. అంటే మీరు ప్రాతఃకాలంలో స్నానానికి వెళ్తూ ఉన్నారు గనుక ఆ సమయంలో ఉన్నటువంటి చంద్రశోభని వర్ణిస్తున్నది. అందుకే సంవత్సరానికే బ్రాహ్మీ ముహూర్తం వంటి పరమపావనమైన మార్గశీర్ష మాసంలో నీరాడ ప్పోదువీర్ - అంటే స్నానం చేయడానికి సిద్ధపడిన వారందరినీ కూడా అమ్మ ఇక్కడ మేల్కొలుపుతూ పోదుమినో - వెళదాం రండి అని పిలుస్తున్నది. సాటి గోపికలను పిలుస్తున్నది. నేరిళైయీర్ - అంటే చక్కని అలంకారములు కలిగినటువంటి ఓ గోపీకలారా! అని. పైగా మీరు ఎటువంటి వారు అంటే శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వచ్చిరుమీర్గాళ్ - అంటే గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి ఈ వ్రేపల్లెలో ఉన్నటువంటి ఓ గోపికలారా! అని దీనియొక్క భావం. అంటే మొత్తం విల్లిపుత్తూరులో తనతోపాటు స్నానానికి వస్తున్న వారిని సాటి గోపికలుగా భావిస్తున్నదీ తల్లి. పైగా ఎటువంటిదా వ్రేపల్లె అంటే మంచి సంపదలు గల్గినటువంటి వ్రేపల్లె అని భావించాలి. కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్ - చేతిలో ఆయుధాన్ని పట్టుకొని రక్షిస్తున్నటువంటి నందగోపుడి యొక్క కుమారుడు అని కృష్ణ పరమాత్మ యొక్క విశేషం. అంటే నందునియొక్క కొడుకు. ఎటువంటి నందుడు? - మొత్తం వ్రేపల్లెలో ఉన్నటువంటి వ్రజవాసులందరికీ అతను ప్రభువు. ఆ ప్రభువైనప్పుడు చేతిలో ఆ ప్రభుత్వానికి చిహ్నముగా ఒక వేలాయుధమును పట్టుకొని ఉన్నాడుట. అలాంటి ఆయుధం పట్టుకున్నటువంటి నందగోపుడి కొడుకు అంటే కృష్ణుడు జగత్తును రక్షిస్తుంటే ఆ కృష్ణుడికి ఒక తండ్రిగా తన వాత్సల్య రక్షణనిస్తున్నటువంటి వాడు నందగోపుడు. ఆ నందునియొక్క కుమారుడైన కృష్ణ పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు ఈ స్నానం వల్ల అని చెప్తున్నారు.