Search This Blog

Chodavaramnet Followers

Wednesday 21 December 2016

GRACE OF LORD SIVA - LORD MAHADEV


శివానుగ్రహం అత్యంత సులభతరం

బ్రహ్మ - సృష్టికర్త
విష్ణువు - సృష్టి పాలకుదు
మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు

ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కధలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి.

శివుని పుట్టుక గురించి అనేక కథలు ఉన్నాయి. విష్ణు పురాణంలో శివుడు బ్రహ్మ కుమారుడని ఉన్నది. మధు, కైటభులు అను రాక్షసులు బ్రహ్మను చంపటానికి రాగా, విష్ణువు వారిని తీక్షణంగా చూస్తాడు. ఆ సందర్భములో విష్ణువు నుదుటి నుండి శివుడు త్రిశూలాన్ని ధరించి జన్మించాడని మరొక ఇతిహాసములో ఉన్నది.

మరొక ఇతిహాసములో.. "బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీ దేవి. అప్పుడు రాజరాజేశ్వరీ దేవికి మూడవ నేత్రం ఉండేది. అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరింది. మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు. అది, తనను (ఆది పరాశక్తిని) వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి, వివాహానంతరం శివునికి మూడవ నేత్రమును ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రముతో ఆ దేవతను భస్మం చేసి, ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతిలను సృష్టించాడు." అని ఉన్నది.

* శివసిద్ధి

ఆధ్యాత్మిక జీవితానికి అంకితమైన అనేకమంది ద్వంద్వ భావాలతో సందేహాలతో సతమతమవుతుంటారు. ముఖ్యంగా 'నేను' అనే భావననుంచి, దానికి సంబంధించిన 'అహంకారం'నుంచి బయటపడేందుకు బహువిధాలుగా ప్రయాస పడుతుంటారు. మాయ ఎంత బలీయమైనదంటే- ఒక్క క్షణంలోనే చంచలత్వాన్ని మనసులోకి ప్రవేశపెట్టేస్తుంది. అయోమయం ఆవహింపజేస్తుంది. మహాత్ములు సైతం తమ సాధనా కాలంలో ఈ దురవస్థలతో బాధపడినవారే.

సాక్షాత్తు శివాంశ సంభూతునిగా చెప్పుకొనే ఆదిశంకరులకూ ఇలాంటి అవస్థ ఒకసారి కలిగింది. మార్గంలో ఒక చండాలుడు ఎదురైనప్పుడు ఆదిశంకరులు ఏవగింపుతో 'తప్పుకో... తప్పుకో...' అని మందలించగా, అతడు నవ్వుతూ 'స్వామీ! తమరు దేన్ని తప్పుకోమంటున్నారు? అశాశ్వతమైన ఈ శరీరాన్నా, అనంతస్వరూపమైన ఆత్మనా?' అని ప్రశ్నించాడు. తక్షణం ఆదిశంకరుల్లో అజ్ఞానపు తెర మటుమాయమైంది. తదనంతర కాలంలో ఆయనలోంచి శివతత్వం గంగా తరంగాలుగా ప్రవహించింది. శివానందలహరి, సౌందర్యలహరి, భజగోవిందం వంటి అనితర సాధ్యమైన రచనలను భక్త లోకానికి అందించారు.

'శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అనటంలోని ఆంతర్యం- చీమనుంచి బ్రహ్మవరకు సర్వం శివాజ్ఞకు లోబడి ఉంటుందనే. సమస్త విశ్వమూ, సృష్టిలోని అణువణువూ శివమయమే. శివం కానిది 'శవ'మంటారు జ్ఞానులు. అంటే మృతపదార్థమని అర్థం. శివమే సత్యం, శివమే సుందరం, శివమే నిత్యం. శివమే అనంతం. శివమే జ్ఞానం. శివమే చైతన్యం. శివమే సర్వజగత్తులకు మూలాధారం. అనేక లక్షల జన్మల అనంతరం లభించే మానవజన్మ, ముక్తి సోపానానికి ముందుమెట్టు లాంటిది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటే శివభక్తిని వదలకూడదు.

శివానందలహరిలో ఒక శ్లోకముంది. సారాంశం ఏమిటంటే- శివుని పేరు పలికే నాలుకే నాలుక, శివుని దర్శించే కన్నులే కన్నులు, శివుని పూజించే చేతులే చేతులు. శివుని సదా స్మరించేవాడే ధన్యుడు.

పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్న ఆదిశంకరులను 'నీవెవరు?' అని అడిగినప్పుడు- 'చిదానంద రూపం శివోహం శివోహం'- నేను చిదానంద స్వరూపుడనైన శివుణ్ని. మిగతా మరేమీ కాను అని ఆత్మస్థితిలో చెప్పగలిగారు. అదే 'శివసిద్ధి'. అంటే, సాధకుడు అనేక జన్మలనుంచి అనుభవిస్తున్న అజ్ఞానపు పొరల్ని ఒక్కొక్కటిగా చీల్చుకుంటూ బయటికి వచ్చి, తనను తాను చూసుకున్నప్పుడు, తాను ఆత్మననీ, అనగా సాక్షాత్తు శివస్వరూపమని గ్రహిస్తాడు. పూజలు, అర్చనలు, ప్రార్థనలు, ఉపవాసాలు, తపస్సులు, గురుశుశ్రూషలు- ఇవన్నీ ఈ అత్యున్నత స్థితిని అందుకోవటానికే.

శివానుగ్రహం అత్యంత సులభతరం. అందరికీ అందుబాటులో ఉంచటానికే- బిల్వార్చన, రుద్రాక్షధారణం, విభూతి లేపనం, అభిషేకంవంటి అతి సామాన్య విధానాలను పరమశివుడు భక్తుల కోసం ఏర్పరచాడంటారు.

జీవితకాలంలో మన ప్రతి చర్యనూ శివారాధన భావనతో ఆచరించడానికి మనసును అనుక్షణం హెచ్చరిస్తూ, అప్రమత్తంగా ఉంచుతుండాలి. అప్పుడు మనం సదా శివసాన్నిధ్యంలో ఉన్నట్లే. క్రమంగా అదే మన ఆత్మకు శివసిద్ధిని కలిగిస్తుంది. అదే పరమపదం.

* శివుని అవతారాలు

ఆదిదేవుడు
రుద్రుడు
పరమశివుడు
గంగాధరుడు
గౌరీపతి
నటరాజు
కైలాసాధిపతి
పశుపతి
గరళకంఠుడు
హరుడు
చంద్రమౌళి
ముక్కంటి
పాలాక్షుడు
చంద్రశేఖరుడు
నీలకంఠుడు
దక్షిణామూర్తి