Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 9 November 2016

COCONUT MILK HEALTH AND BEAUTY TIPS


కొబ్బరిపాలు జుట్టుకు మేలు!

జుట్టు ఎండుగడ్డిలా మారడం, చర్మం పొడిబారి పొట్టులా రాలిపోవడం, నిర్జీవంగా కనిపించడం వంటి సమస్యలు వేధిస్తున్నాయా? కొబ్బరిపాలు ఇలాంటి సమస్యలన్నింటికీ సరైన పరిస్కారం. 

• అసలు ఆ పాలను ఎలా వాడాలంటే..

* కొబ్బరిపాలల్లో తేమనందించే గుణాలు ఎక్కువ. జుట్టు పొడిబారి, దురదగా అనిపిస్తున్నప్పుడు ఆ పాలను తలకు రాసుకుని ఐదు నిమిషాలు మర్దన చేయాలి. తరవాత వేడినీటిలో ముంచిన తువాలును తలకు చుట్టుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే చివర్లు చిట్లిన సమస్య అదుపులోకి వస్తుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా మారుతుంది. అలాగే కొబ్బరిపాలల్లో ఉండే కొన్ని పోషకాలు జుట్టు ఒత్తుగా ఎదిగేందుకు తోడ్పడతాయి. అదే సమయంలో పోషణనూ అందిస్తాయి.

* ముఖానికి వేసుకున్న మేకప్‌ని తొలగించాలా! రెండొంతుల ఆలివ్‌నూనెలో ఒక వంతు కొబ్బరిపాలు కలపాలి. అందులో దూది ఉండను ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి. మేకప్‌ పూర్తిగా పోవడమే కాదు, చర్మానికి పోషణ కూడా అందుతుంది. చర్మం మృదువుగానూ ఉంటుంది.

* జిడ్డు చర్మతత్వం ఉన్నవారు, మొటిమల సమస్య ఎక్కువగా ఉన్నవారూ కొబ్బరిపాలను క్లెన్సర్‌గా ఉపయోగించొచ్చు. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలూ, కొవ్వులూ చర్మ గ్రంథులు పెద్దగా కాకుండా చేసి, మొటిమల సమస్యను అదుపులో ఉంచుతాయి.

* చర్మంపై పేరుకొనే మృతకణాలు తొలగించేందుకూ కొబ్బరిపాలను ఉపయోగించొచ్చు. పావుకప్పు కొబ్బరిపాలల్లో కాసిని ఓట్స్‌ వేసి పదినిమిషాలయ్యాక ముఖానికి రాసుకోవాలి. ఇది పూర్తిగా ఆరాక కడిగేస్తే చాలు.

* కొబ్బరిపాలల్లో విటమిన్‌ సి కూడా ఉంటుంది. ఇది చర్మంలో సాగే గుణాన్ని పెంచుతుంది. ఇందులోని రాగి ముడతల్ని నివారిస్తుంది. వయసురీత్యా వచ్చే మచ్చల్నీ తగ్గిస్తుంది. ఈ పాలల్లో ఆరేడు బాదం గింజల్ని నానబెట్టి మర్నాడు మెత్తగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత చల్లటి నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.