Search This Blog

Chodavaramnet Followers

Monday 11 April 2016

ARTICLE ABOUT SRI UMAKOPPULINGESWARA SWAMY TEMPLE - PALIVELA - KOTHAPET MANDALAM, EAST GODAVARI DISTRICT, ANDHRA PRADESH - MUST VISIT


శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం 

పలివెల, తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన గ్రామము. పలివెల రాజమండ్రికి 50 కి.మీ., కాకినాడకు 90 కి.మీ. మరియు అమలాపురానికి 25 కి.మీ. దూరంలో కలదు. ఈ గ్రామములొ శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం కలదు. ఇక్కడ శివరాత్రి రోజున కళ్యాణ మహోత్సవం విశేషం.

* గ్రామం పేరు

"పలివెల" అను పేరు ఈ గ్రామానికి రావడం గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

* పౌరాణిక గాధ

పౌరాణిక గాధ ననుసరించి, క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమ్రుతలింగాన్ని రాక్షసులు ఒక 'పల్వలము' (గొయ్యి)లో దాచారు. అగస్త్యమహాముని ఆ అమ్రుతలింగాన్ని పరమేశ్వరితో సహా అక్కడే ప్రతిష్ఠించాడు. ఆ పల్వలమే కాలక్రమేణా పలివెలగా మారింది.

* చారిత్రక గాధ.

ఈ ప్రాంతాన్ని పూర్వకాలములో పల్లవులు పాలించుట వలన "పల్లవ" నండి "పలివెల" అయిందని అంటారు.

స్థ్లల పురాణం*

ఇక్కడి శివలింగ ప్రతిష్థ అగస్త్య మహర్షి ద్వారా జరిగింది అని ప్రతీతి. ఈ దేవాలయములొని కళ్యాణ మండపాన్ని11 వ శతాబ్దం లొ రాజరాజ నరేంద్రుడు జీర్ణోద్ధారణ చేశాడని చెబుతారు. ఈ ఆలయ కళ్యణ మండపములో వేదిని అల్లాదరెడ్డి క్రీ.శ 1416లో కట్టించి ఈ మండపమునకు కొత్త రూపాన్ని ఇచ్చినట్లు ఈ మండపములోనే శాసనము ఉంది. అగస్త్యమహర్షి శివ పార్వతుల కళ్యాణం చూడవలెనని కొరికతో కౌశిక నది ఒడ్డున శివలింగ ప్రతిష్థ చేశాడు. దక్ష యజ్ఞానికి పూర్వం ఇంద్రాది దేవతలు మరియు హిమవంతుడు అగస్త్య మహర్షి పార్వతి కళ్యాణాని కి వస్తే ప్రళయం వస్తుంది అని భావించి విశ్వంభరుడుని అగస్త్య మహర్షి వద్దకు పంపుతారు. అగస్త్య మహర్షి తన దివ్యదృష్టి తో శివ పార్వతుల కళ్యాణం వీక్షించగా శివ పార్వతులు మధుపర్కాలలో కనిపిస్తారు. అగస్త్య మహర్షి శివుని ప్రార్దించగా శివుడు ప్రత్యక్షమై వరాన్ని కొరుకోమనగా అగస్త్య మహర్షి శివపార్వతులను ఒకే పీఠంపై అనుగ్రహించమని కోరుతాడు. ఇదే ఇక్కడ విశేషం. వేరే ఎక్కడ శివ పార్వతులు ఒకే పీఠం మీద కనపడరు. మొదట ఈ క్షేత్రం లొ శివుడు లోల అగస్త్య లింగేశ్వరుని గా తరువాత కొప్పులింగేశ్వర స్వామి గా పూజలందుకొంటున్నాడు.

* సాహిత్యాధారాలు

శ్రీనాథుడు ని కాలంలొ అగస్త్య లింగేశ్వరునిగా పూజలందుకొన్నట్లుశ్రీనాథుడు శ్లొకాన్ని వ్రాశాడు. ఈయన తన కాశీఖండము, భీమఖండము మరియు శివరాత్రి మహాత్మ్యములలో ఈ స్వామిని కొప్పయ్య, కొప్పులింగడు అని గొప్పగా వర్ణిస్తూ, ఈస్వామే తన ఇంటి ఇలవేల్పని చెప్పాడు. ఈ కాలానికే చెందిన అజ్జరపు పేరయలింగ కవి కూడా తన "ఒడయనంబి విలాసం"లో ఈ స్వామిని గురించి వర్ణిస్తూ, ఇప్పటి ఈ చిన్న గ్రామమును ఒక గొప్ప పట్టణముగా చెపుతూ ఇంద్రుడు ఒక్కసారి ఇక్కడికి వస్తే తన స్వర్గాన్ని మరిచిపోతాడని అన్నాడు. ఈ సాహిత్యాధారాల వలన క్రీ.శ 14వ శతాబ్దంనాటికే పలివెల గొప్ప పట్టణమని, ఇక్కడ వేంచేసి ఉన్న కొప్పులింగేశ్వరుని ఆలయము ఒక ప్రముఖ పుణ్యక్షేత్రమని తెలుస్తోంది.

చారిత్రక ఆధారాలు: ఈ ఆలయములో అనేక శాసనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ లభించిన వానిలో పురాతనమైనది క్రీ.శ 1170 కి చెందింది. ఇది ఒక ప్రముఖ కవి యొక్క దాన శాసనము. ఇంకా కాకతీయ ప్రతాపరుద్రునికి చెందిన శాసనము, రెడ్డిరాజులకు చెందిన శాసనాలే కాక ముస్లిం రాజైన కుతుబ్-ఉల్-ముల్క్ కు చెందిన దానశాసనము ఉండడం విశేషం. ప్రస్తుతము క్రీ.శ 15వ శతాబ్దము వరకూ శాసనాలు లభించాయి. పిఠాపురం రాజావారి పాలనలో కూడా పలివెల ఒక ప్రత్యేకమైన ఠాణాగా ఉండేది. ఈ ఆధారాల వలన క్రీ.శ.10వ శతాబ్దం నుండి కూడా రాజులు, ప్రముఖులు, సామాన్య ప్రజలు ఆలయపోషణ చేసినట్లు తెలుస్తోంది. ప్రతాపరుద్రుని కాలంలొ ఆలయ జీర్ణొద్దారణ జరిగినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. ముస్లింల దండయాత్రల సమయం లొ నంది తల విరిగి పడింది దానిని ఇప్పుడు అతికించడం జరిగింది.

* కొప్పు లింగేశ్వరుడు

అక్కడి ప్రజల కథ ప్రకారం ఒకప్పుడు ఒక వెలనాటి పూజారి ఈ శివలింగారాధన శక్తి వంచన లేకుండా చేస్తూ ఉండెవాడు. కాని అ పూజారికి ఒక దురలవాటు ఉండేది. ఆయన కు ఒక వేశ్య తొ సంబంధం ఉండేది. ఆ పూజారి మీద ఆరాజ్యపు రాజు కి చాలా పిర్యాదులు అందుటూ ఉండేవి. ఇది గమనించి ఒక రోజు ఆరాజ్యపు రాజు స్వామి దర్శనానికి రాగా ఆ పూజారి స్వామి ప్రసాదాన్ని రాజు కు ఇస్తాడు. ఆ ప్రసాదం లొ ఒక వెంట్రుక కనిపిస్తుంది. రాజు ప్రశ్నించగా మా శివునకు జటాజూటం ఉన్నదని రాజు కి తెలిపుతాడు. రాజు పూజారిని జటాజుటం చూపించమనగా పూజారి ఆ రోజు స్వామి కి ప్రత్యేక అలంకారంలో ఉన్నారు కాబట్టి మరుసటి రోజు వచ్చి చూస్తే స్వామివారి జటాజూటం కన్పిస్తుంది అని ఆ పూజారి చెప్పగా ఆ రాజు ఆ రోజుకి నిష్క్రమించి తరువాత రోజు రావడానికి అంగీకరిస్తాడు. కాని శివవింగం మీద జాటాజుటం కనిపించకపోతే ఆ పుజారి తల తీయించి వేస్తాను అని చెప్తాడు.

ఆ రోజు రాత్రంతా శివలింగానికి పూజలు చేసి మహాదేవుడిని తనను కాపాడమని వేడుకోంటాడు. తరువాత రోజు రాజు దర్శనానికి వచ్చి చూస్తే శివలింగాన్ని చూస్తే జటాజూటం కనిపిస్తుంది. ఆఆరాజుకి ఆ జటాజుటం నిజమో కాదో అని సంశయం కలిగి జటాజుటాన్ని లాగి చుస్తాడు, శివ లింగం నుంచి నెత్తురు వస్తుంది, వెంటనే రాజుకు కంటి చూపు పోతుంది. అప్పుడు ఆ రాజు శివామహాదేవా అని వేడుకొనగా ఆరాజుకు కంటి చూపు వస్తుంది. ఆ రరాజు తన సామ్రాజ్యంలో జుటుగపాడు (ఇప్పటి రావులపాలెం మండలం లొని ఒక గ్రామం) అనే గ్రామాన్ని మాన్యంగా రాజు ప్రకటిస్తాడు. ఇప్పటికి కూడా శివలింగము కు జాటాజూటం ఉంది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ పవిత్రక్షేత్రంలొ కొప్పులింగేశ్వరుడు గా పరమ శివుడు భక్తుల దర్శనం ఇచ్చి దర్శనం చేసుకొన్న వారిని మహాదేవుడు తరింపజేస్తున్నాడు. ఆంధ్రపదేశ్ పురావస్తుశాఖ ఈ గుడిలో ఉన్న రాజగోపురం, స్వామిమందిరం, కొన్ని స్తంభాలు పై ఉన్న శిల్పాలు ను పరిరక్షిస్తోంది.

* ఆలయము గురించిన విశేషాలు

ఈ ఆలయమును తూర్పున కౌసికి, దక్షిణమున సాంఖ్యాయని, పడమర వశిష్ఠ, ఉత్తరాన మాండవి మరియు పల్వల అను అంతర్వాహినిగా ఉన్న ఐదు నదులు చుట్టి ఉన్న ప్రదేశములో నిర్మించినట్లు చెబుతారు. ఈనాడు కూడా కౌసికి, వసిష్ఠలతో పాటు గర్భగుడిలో వర్షాకాలములో నీరు నిండుటచే పల్వలను కూడా చూడవచ్చును. ఇటీవల గర్భ్గగ్రుహమును గ్రానైటు రాయి పరచి బాగు చేశారు.

ఈ ఆలయము పలివెల మధ్యలో నాలుగెకరాల సువిశాల ప్రాంగణములో, ఒక దానిలో ఒకటి గా ఉన్న రెండు ఎత్తైన ప్రాకారాలతో, చుట్టూ వీధులతో రాజసంగా ఉంటుంది. ఈ ప్రాంగణములో ప్రధానాలయము, ఎన్నో మండపాలు, పరివార దేవతాలయాలు ఉన్నాయి. ఈ మండపాలలో చాళుక్యుల మరియు రెడ్డిరాజుల వాస్తు సాంప్రదాయాలను చూడవచ్చును. ఈ ప్రాంగణములోని మండపాలు అందలి శిల్పాలలో క్రీ.శ 10వ శతాబ్ధము నుండి క్రీ.శ 17వ శతాబ్ధము మధ్యకాల వాస్తు-శిల్ప పరిణామమును చూడవచ్చును.

ఈ ఆలయములో వివిధ శిల్పాలు కనువిందు చేస్తాయి. ఇవి వేంగి(తూర్పు)చాళుక్యుల మరియు రెడ్డిరాజుల కాలంనాటి శిల్పలక్షణాలు కలిగి ఉన్నాయి. గర్భగుడిలో ప్రతిష్టించబడిన లింగమునకు ముందువైపున అగ్రభాగములో చతురస్రాకారములో ఒక పొడుచుకువచ్చిన భాగము ఉంది. దీనినే కొప్పు అంటారు. ఇందువలననే ఈ స్వామి కొప్పులింగేశ్వరుడుగా ప్రసిద్ధిగాంచాడు. ఈయనకు ప్రక్కనే పార్వతీదేవి (ఉమాదేవి) ప్రతిష్టించబడి ఉంది. ఈమెకు ఉన్న ప్రభామండలమునకు రెండు వైపులా గణపతి మరియు కుమారస్వామి కూడా ఉన్నారు.

సాధారణంగా శైవాలయాలలోని గర్భగుడిలో ప్రధానంగా లింగము ఉండి, అమ్మవారు ఒక ప్రక్కగా ఉంటుంది, లేక ప్రత్యేకంగా ప్రతిష్టించబడి ఉంటుంది. ఇంక వినాయకుడు, కుమారస్వాములు వేరేగా పరివారదేవతాలయాలలో ఉంటారు. కానీ ఇక్కడ స్వామివారు మరియు అమ్మవారు ప్రక్క ప్రక్కనే ఒకే పీఠంపై ఉన్నట్లుగా ఉన్నారు. అందువలననే ఈ స్వామిని ఉమాకొప్పులింగేశ్వరుడు అంటారు. ఈవిధముగా ఆది దంపతులు సకుటుంబ సమేతంగా గర్భగుడిలోనే ఒకే పీఠంపై వేంచేసి దర్శనమివ్వడం ఇక్కడి విశేషం. ప్రాంగణములో వినాయకుడు, కుమారస్వామి, భైరవుడు, చండికేశ్వరస్వామి మరియు పాపవిమోచన స్వాములు ప్రత్యేకముగా ప్రతిష్టించబడి భక్తుల పూజలందుకుంటున్నారు.

వివిధ మండపాలపై ఉన్న శిల్పాలు అతి మనోహరంగానూ ఆలోచింపజేసీవిగానూ ఉన్నాయి. ఈ మొత్తము శిల్పసంపదను నాలుగు ప్రధాన వర్గాలుగా వర్గీకరించవచ్చును. అవి శైవము, వైష్ణవము, సాంఘీకము మరియు ఇతరములు. శైవములో శివ-పార్వతుల వివిధ రూపాలు-వృషభారూఢమూర్తి, లింగోధ్భవమూర్తి, నటరాజు, అర్ధనారీశ్వరుడు మొదలైన అనేకరూపాలేకాక పురాణగాథలైన కిరాతార్జునీయం, మృగవ్యధ మొదలగు గాథలు కూడా ఉన్నాయి. వైష్ణవ శిల్పాలలో కృష్ణుడు, లక్ష్మీదేవి ఇంకా రామాయణ గాధలు ఉన్నాయి.

సాంఘీకాలు మరియు ఇతరాలలో ఆనాటి జీవనవిధానాన్ని ప్రతిబింబించే ఎన్నో శిల్పాలు, నర్తకీమణులు, లతలు, జంతువులు మొదలైన శిల్పాలు ఉన్నాయి. మొత్తంగా ఈ ఆలయశిల్పం అత్యంత విలువైంది. ఈ శిల్పాలు వాతావరణ ప్రభావానికి, దాడులకు గురి అవడం వలన చాలా నష్టం వాటిల్లింది. ఇక్కడ ఒక విష్ణాలయము ఉండేదనడానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ ఆలయము ఇప్పుడు లేదు. అది కాలక్రమేణా శిధిలమైనా అయి ఉండాలి లేదా ఆలయవాస్తు-శిల్పానికి జరిగిన నష్టంలో ఇదీ ఒకటైనా అయి ఉండాలి. అదే కనుక అయితే ఈ ఆలయానికి అధిక శాతంలోనే నష్టం జరిగిందని చెప్పవచ్చును.

ఆలయానికి ఈ మధ్యకాలములో జరిగిన జీర్ణోద్ధరణ కార్యక్రమాల వలన పడిపోవడానికి సిధంగా ఉన్న కట్టడాలను గట్టిపరచడం, కొన్ని కొత్తకట్టడాలు చోటు చేసుకోవడంతో ఆలయము కొత్త శోభలను సంతరించుకుంది. ఇప్పుడు ఈ ఆలయము ఆధునికత అనే మేలిముసుగులో దాగిన అపురూపమైన పురాతనాలయము.

* పండుగలు, విశేషాలు

01. గణపతి నవరాత్రులు
02. దేవీ నవరాత్రులు
03. కార్తీక మాసం
04. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, సుబ్రహ్మణ్య షష్ఠి
05. ధనుర్మాసం
06. కొప్పు లింగేశ్వర స్వామి కళ్యాణం