Search This Blog

Chodavaramnet Followers

Sunday, 17 January 2016

MAHABHARATHA STORY ABOUT UPA PANDAVALU - SONS OF PANDAVAS


ఉపపాండవులు

పాండవులు, ద్రౌపదికి కలిగిన ఐదుగురు సంతానాన్ని ఉప పాండవులగా పిలుస్తారు. పాండవులకు ఒక్కొక్కరుగా ఒక్కొక్క పుత్రుడు జన్మించారు.

1. ప్రతివింధ్యుడు - (ధర్మరాజు పుత్రుడు)
2. శ్రుతసోముడు - (భీముని పుత్రుడు)
3. శ్రుతకర్ముడు - (అర్జునుని పుత్రుడు)
4. శతానీకుడు - (నకులుని పుత్రుడు)
5. శ్రుతసేనుడు - (సహదేవుని పుత్రుడు)

పూర్వజన్మలో ఈ ఉపపాండవులు ‘‘విశ్వులు’’ అనే దేవతలుగా వుండేవారు. వీరు ఈ విధంగా ఉపపాండవులుగా జన్మించడానికి ఒక పురాణకథనం కూడా వుంది. పూర్వం ఒకనాడు హరిశ్చంద్రుని భార్య అయిన చంద్రమతిని నగరం వదిలి వెళ్లాల్సిందిగా విశ్వామిత్రుడు శపిస్తాడు. అది చూసిన ఈ విశ్వవులు.. ‘‘ఋషులకు ఇంత కోపం పనికిరాదు’’ అని అనుకుంటారు. అది విన్న విశ్వామిత్రునికి కోపం మరింతగా పెరిగిపోతుంది. ఆ కోపంతో అతను విశ్వులకు నరులుగా జన్మించమని శపిస్తాడు. ఆ శాపంతోనే వీరు ఉపపాండవులుగా భూమిపై జన్మిస్తారు.

మహాభారతంలోని పాండవులు, కౌరులకు మధ్య జరిగిన కురుక్షేత్రం సంగ్రామంలో ఈ ఉపపాండవుల పాత్ర ఎంతో మెరుగైనది. వీరికి సంబంధించిన ప్రస్తావనలు ఎన్నో వున్నాయి. ఆరవరోజు యుద్ధం జరుగుతున్న సమయంలో కౌరవులు... భీముడు, దృష్టద్యుమ్ములపై ఒకేసారి మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ఆ సమయంలో పాండవుల పుత్రులయిన ఈ ఐదుగురు ఉపపాండవులు తమ పరాక్రమ బలంతో కౌరవులను పరుగులు తీయించారు. అందులో ముఖ్యంగా నకులునీ కుమారుడు అయిన శతానీకుని విన్యాసం ప్రతిఒక్కరిని మెప్పించింది. అలాగే పదహారవరోజు యుద్ధంలో ధర్మరాజు కుమారుడు అయిన ప్రతివింధ్యుడు తోమరంతో కౌరవ వీరుడైన చిత్రసేనని చంపేశాడు. వారు అతనిపై ప్రతిఘటించినప్పటికీ... అతనిని ఓడించలేకపోయారు.

మరోవైపు... ద్రోణాచార్యుని కుమారుడు అయిన అశ్వత్థామ ఈ ఉప పాండవులను సంహారం చేస్తానని కౌరవ రాజు అయిన దుర్యోధనునికి మాట ఇస్తాడు. ఆ మాట ప్రకారం అశ్వత్థామ ఈశ్వరదత్తమైన ఖడ్గంతో రాత్రి సమయంలో రహస్యంగా దాడిచేశాడు. ప్రతివింధ్యున్ని అడ్డంగా నరికేశాడు. శ్రుతసోముడి గొంతకోసి అతికిరాతకంగా చంపేశాడు. అర్జునుని కుమారుడు అయిన శ్రుతకర్ముని తలను నరికి, మొండాన్ని కాలుతో తన్నాడు. అలాగే నకులుడు, సహదేవుని కుమారులైన శతానీకుని, శ్రుతసేనుని దారుణంగా తలలు నరికి చంపేశాడు. ఈ విధంగా ఆ రాజు రాత్రి అశ్వత్థామ, కృతవర్మం, కృపాచార్యుడు ముగ్గురు కలిసి ధృష్టద్యుమ్నుడి శిబిరంలో పాండవ సేనను ఘోరంగా చంపేశారు.

ఈ విధంగా ఉపపాండవుల ప్రస్థానం కురుక్షేత్రంలో అర్థాంతరంగా సమసిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భీమార్జునులు వెంటనే అశ్వత్థామను పట్టుకుని, శిక్షించబోయారు. కానీ అతను గురువు పుత్రుడన్న ఒకే ఒక కారణంతో చంపకుండా.. అతని తలపైనున్న సహజసిద్ధమణిని తీసుకుని వదిలేశారు.