పాదాల పగుళ్లకు..!
ఈ కాలంలో పాదాలు పగిలి ఇబ్బందిపెడుతుంటాయి. దీన్ని నివారించడానికి వెడల్పాటి గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకుని రెండు చెంచాల ఉప్పూ, చెంచా చొప్పున నిమ్మరసం, గ్లిజరిన్, గులాబీ నీళ్లూ కలపాలి. ఇప్పుడు పాదాలను అందులో పావుగంట ఉంచి.. ప్యుమిస్ రాయితో రుద్దాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
* తేనెలో తేమనందించే, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. ఇవి పాదాల పగుళ్లను పోగొట్టి మృదువుగా మారుస్తాయి. పావు బకెట్ నీళ్లలో నాలుగు చెంచాల తేనె కలిపి పాదాలను పావుగంట పాటు నానబెట్టాలి. తర్వాత పాదాలను స్క్రబ్ చేసి కడిగితే, పగళ్లు తగ్గుతాయి.
* మూడు చెంచాల బియ్యప్పిండీ, రెండు చెంచాల తేనె, చెంచా ఆపిల్ సిడర్ వెనిగర్ కలపాలి. గోరువెచ్చని నీళ్లలో పది నిమిషాల పాటు పాదాలను ఉంచి ఈ మిశ్రమంతో స్క్రబ్ చేస్తే ఫలితం ఉంటుంది.
* చెంచా ఆలివ్ నూనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి రాత్రి పడుకునే ముందు పాదాలకు పట్టించినా ఫలితం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనెని పాదాలకు పట్టించి ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే కాళ్ల పగుళ్లు మాయమవుతాయి.