Search This Blog

Chodavaramnet Followers

Saturday, 5 December 2015

DEATH STORY OF WARRIOR PRINCE - ABHIMANYU - MAHABHARATHA TELUGU STORIES COLLECTION


అభిమన్యుని మరణం
అపహార్ణం వరకు యుద్ధం సంకులంగా జరిగింది. శత్రుంజయుడు, సువర్చనుడు, చంద్రకేతుడు, సూర్యభానుడు, మేఘవేగుడు మొదలైన వారు ఒక్కుమ్మడిగా అభిమన్యునిపై పడ్డారు. అభిమన్యుడు తన అస్త్రశస్త్రములతో వారిని అందరిని దూరంగా తరిమి కొట్టాడు. శకుని అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు అతడిని తీవ్రమైన శరాఘాతముతో నొప్పించి తనరధమును సుయోధనుని వైపు పోనిచ్చాడు. ఇది చూసిన కర్ణుడు " ఆచార్యా ! కౌరవ సేనలో మహామహులను ఓడించినభిమన్యుడు సుయోధనుడి మీదికి పోతున్నాడు. ఈ సమయంలో మీరు ఊరక ఉండుట తగునా ! ఏదైనా ఉపాయం ఆలోచించి అభిమన్యుని చంపండి " అని సుయోధనుడికి సాయంగా వెళ్ళాడు.

అప్పుడు ద్రోణుడు " అభిమన్యుడు చిన్న వాడైనా తన తండ్రి అర్జునికి సమానంగా యుద్ధం చేస్తున్నాడు ఇక ఉపేక్షించరాదు. మనమంతా ఒక్కుమ్మడిగా అతడిని ఎదుర్కొన వలెను " అని పలికాడు. ఇంతలో అభిమన్యుని చేతిలో చావు దెబ్బలు తిని కర్ణుడు అక్కడికి వచ్చి ద్రోణుడితో " ఆచార్యా ! చూసారా అభిమన్యుడు నన్ను ఎలా దెబ్బ తీసాడో ! నేను మీ దగ్గరే ఉంటాను ఇంతకంటే నాకు సురక్షిత ప్రదేశం లేదు. అర్జునుడి పరాక్రమం గురించి విన్నాను కాని అతడి కొడుకు అంతకంటే పరాక్రమవంతుడు అని అర్ధం అయ్యింది " అన్నాడు.

* అభిమన్యుడిని కపటోపాయముతో చంపమని ద్రోణుడు చెప్పుట

అప్పుడు ద్రోణుడు కర్ణుని చూసి " కర్ణా ! నేను అర్జునుడికి కవచధారణ విద్య ఉపదేశించాను. దానిని అర్జునుడు తన కుమారుడికి ఉపదేశించాడు. ఆ కవచ ధారణ విద్య వలన అతడి శరీరంపై ఎవరూ శరములు నాట లేరు. ఎదో వంచన చేసి అతడిని మనం చంపాలి. అభిమన్యుని చేతిలో విల్లు ఉన్నంతవరకు మనం అతడిని చంపలేము. యోధులంతా అతడిపై దాడి చేసి ఒకరు అతడి విల్లును త్రుంచాలి, వేరొకరు అతడి సారధిని చంపాలి, మరొకరు అతడి రథం విరుగ కొట్టాలి కాని ఇవన్నీ ఏక కాలంలో జరగాలి. నీకు చేతనైతే అభిమన్యుని ఈ కపటోపాయంతో చంపు " అన్నాడు. అది విని కర్ణుడు ఆలోచించి అక్కడి యోధులను కూడగట్టుకుని ఒక్కుమ్మడిగా అభిమన్యునిపై లంఘించాడు. కొంత మంది అతడి విల్లు విరిచారు, ద్రోణుడు అతడి రధాశ్వములను చంపాడు, కృపాచార్యుడు అతడి రధసారధిని చంపాడు, అభిమన్యుడు నిరాధయుడు విరధుడు అయ్యాడు. అదే తగిన సమయమనుకుని బాహ్లికుడు, శకుని, శల్యుడు, అశ్వత్థామ, కృతవర్మ అతడి మీద బాణవర్షం కురిపించారు.

అభిమన్యుడు ఖడ్గము డాలు తీసుకుని రధము మీద నుండి కిందకు దూకి గాలిలో గిరగిరా తిరుగుతూ కౌరవ యోధులను ఖండించాడు. అభిమన్యుడు ఎప్పుడు తన తల ఖండిస్తాడో అని యోధులంతా అక్కడి నుండి పారి పోయారు. ద్రోణుడు ఒక బల్లెము తీసుకుని అభిమన్యుడి ఖడ్గం విరిచాడు. కర్ణుడు అభిమన్యుని డాలు విరిచాడు. అప్పుడు అభిమన్యుడు రధములోని చక్రాయుధం తీసి దానిని గిరగిరా త్రిప్పుతూ శత్రు సేనలను చంపుతూ సింహనాదం చేసాడు. రక్తసిక్తమైన అతడి ముఖమును చూసిన శత్రు సేనలు భయభ్రాంతం అయ్యాయి. అభిమన్యుడు తన చక్రాయుధంతో శత్రువులు వేస్తున్న బాణములు ఖండిస్తూ శత్రుసంహారం చేస్తున్నాడు. ద్రోణుని వైపు దూసుకు పోతున్నాడు. అడ్డు వచ్చిన కౌరవ సైన్యాన్ని చీల్చి చెండ్డాడుతున్నాడు.

ఆ సమయమున శకుని, కృతవర్మ, కృపాచార్యుడు, శల్యుడుమొదలైన యోధులు ఒకటిగా కూడి అభిమన్యుని చక్రయుధం ఖండించారు. అప్పుడు అభిమన్యుడు తన గధను తీసుకుని అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అభిమన్యుని దెబ్బకు భయపడి అశ్వత్థామ రథం నుండి దూకి రథం వెనక్కు పోయి దాక్కున్నాడు. అప్పుడు అభిమన్యుడు అశ్వత్థామ సారధిని, రధాశ్వలను చంపాడు. అభిమన్యుడు శకుని మీద లంఘించి అతడికి సాయంగా ఉన్న ఇరవై ఏడు మంది యోధులను గధాయుధంతో చంపాడు. గజములపై పది మంది యోధులు అభిమన్యుని ఎదుర్కొన్నారు అభిమన్యుడు వారిని గజములతో సహా యమపురికి పంపాడు. కేకయరాజులను ఏడుగురిని ఒక్క సారిగా యమపురికి పంపాడు. ఇంతలో దుశ్శాసనుడి కుమారుడు అభిమన్యుని ఎదుర్కొని అభిమన్యునిపై

అనేక శరములు గుప్పించాడు. అభిమన్యుడు అతడు వేసిన బాణములను గధాదండంతో అడ్డుకుని అతడి అశ్వములను, సారధిని చంపి అతడి రధమును విరుగకొట్టాడు. దుశ్శాసనుడి కుమారుడు గధాయుధంతో అభిమన్యుని ఎదుర్కొన్నాడు. వారిరువురి మధ్య పోరు ఘోరంగా సాగింది. ఇరువురి శరీరం నుండి రక్తం ధారగా కార సాగింది. యోధులంతా యుద్ధం మాని వారి పోరు చూస్తున్నారు. అభిమనుడు దుశ్శాసన కుమారుడు గధలతో మోదుకుని కిందపడ్డారు. గాయపడిన వారి శరీరముల నుండి ప్రాణములు వేరయి స్వర్గలోకం చేరాయి. అప్పటికీ కసి తీరని కౌరవ యోధులు చుట్టుముట్టి కత్తులతో పొడిచి పొడిచి చంపారు. సూర్యుడు అస్తమించాడు.

పాండవుల కీర్తిని ఇనుమడింప చేస్తూ అభిమన్యుడు కౌరవయోధులతో అత్యంత పరాక్రమంతో పోరాడి వీరస్వర్గం అలంకరించాడు. ధృతరాష్ట్ర మహారాజా ! ఆ విధంగా యోధాను యోధుడైన అభిమన్యుడు రణరంగమున మరణించగానే కౌరవసేనల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ఆ సమయాన అక్కడ చేరిన భూతగణాలు " అభిమన్యుని అమానుషంగా అధర్మ యుద్ధంలో అన్యాయంగా పలువురు కలిసి వధించారు " అని ఆక్రోశించాయి. అభిమన్యుడు మరణించగానే పాండవ సేనలు పారిపోయాయి.

ఇదంతా దూరం నుండి చూస్తున్న ధర్మరాజు " మన అభిమన్య కుమారుడు దుర్భేద్యమైన వ్యూహంలో ప్రవేశించి హయములను, గజములను చంపి రధములను విరిచి, పదాతి దళమును తనుమాడి. అనేక సైనిక ప్రముఖులను చంపి ద్రోణుడు మొదలైన మహాయోధులను భయభ్రాంతులను చేసి వీరస్వర్గం అలంకరించాడు. అటువంటి మహాయూధుని మరణముకు చింతించ పని లేదు " అన్నాడు. అప్పటికే చీకట్లు కమ్మాయి. ఆ రోజుకు యుద్ధము మాని వారి వారి శిబిరాలకు వెళ్ళారు. కౌరవ సేనలో ఆనందోత్సాహాలు నిండగా పాండవ యోధుల్లో విషాద ఛాతలు కమ్ముకున్నాయి.