Search This Blog

Chodavaramnet Followers

Tuesday 8 December 2015

BRIEF FACTS ABOUT DANGER DISEASE JAUNDICE AND STEPS AND PRECAUTIONS TO BE TAKEN FOR STOPPING JAUNDICE IN TELUGU


పసరికలు - పచ్చకామెర్లు.
.
మన శరీరానికి ప్రాణవాయువు అనదగ్గ ఆక్సిజన్‌ను రక్తంలోని ఎర్ర రక్త కణాలు సరఫరా చేస్తాయి. ఇందులో హీమోగ్లోబిన్ అనే ప్రొటీన్ పదార్థం కీలక పాత్ర పోషిస్తుంది. దీని జీవితకాలం 120 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత హీమోగ్లోబిన్‌లోని హీమ్ పదార్థం ప్లీహంలో(స్పీన్) శిథిలమైపోయి బైలిరూబిన్, బైలివర్డిన్ అనే పసుపు రంగు వ్యర్థ పదార్థాలుగా మారిపోతుంది. సాధారణంగా కాలేయం ఈ వ్యర్థ పదార్థాలను సేకరించి పైత్యరసంతో పాటు కాలేయ వాహిక(బైల్‌డక్ట్)ద్వారా పేగుల్లోకి పంపుతుంది. అక్కడ నుంచి మలంతో పాటు ఈ పసుపు రంగు వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. మలం పసుపు రంగులో ఉండటానికి ఇదే కారణంగా భావించవచ్చు.శరీరంలో ఈ పసుపు రంగు పదార్థాలు పేరుకుపోవడాన్ని కామెర్లుగా అభివర్ణించవచ్చు.నిజానికి కామెర్లు వ్యాధి అనేకంటే వ్యాధి లక్షణం అనొచ్చు.
.
కామెర్లకు ముఖ్య కారణాలు 3.
1.హీమోలైటిక్ ఎనీమియా వంటి కారణాలతో ఎర్ర రక్త కణాలు ఎక్కువగా శిథిలమైనప్పుడు. రక్తంలోని ఎర్రకణాలు అత్యధికంగా విచ్ఛిత్తిగావడం. దీన్ని 'హీమోలిటిక్‌ జాండిస్‌' అంటారు.
2.కాలేయం పాడైనప్పుడు (ఇన్ఫెక్షన్‌) అంటే కాలేయం వ్యర్థ పదార్థాలను సేకరించలేకపోయినప్పుడు. ఎర్రకణాల విచ్ఛిత్తి మూలకంగా చోటుచేసుకున్న బిలురూబిన్‌ లివర్‌ కణాలలోకి చేరలేకపోవటం. దీన్ని 'హెపాటిక్‌ జాండిస్‌' అని వ్యవహరిస్తారు.
3. లివర్‌లో ఉత్పత్తి అయిన పైత్యరసం (బైల్‌) ప్రవాహ మార్గంలో అవరోధం ఏర్పడి, అది పేగులలోకి చేరలేకపోవటం . దీన్ని 'అబ్‌స్ట్రక్టివ్‌ జాండిస్‌' అంటారు.
.
లివర్‌ ఇన్ఫెక్షన్‌కు గురైనట్లయితే 'హెపటైటిస్‌' అని వ్యవహరిస్తారు. హెపటైటిస్‌ కేసుల్లో 'హెపాటిక్‌ జాండిస్‌' చోటుచేసుకుంటుంది. హెపటైటిస్‌కు ప్రధాన కారణాలు - ఒకటి ఇన్ఫెక్షన్‌, రెండవది ఆల్కహాల్‌, మూడు పౌష్టికాహార లోపము (Nutritional jaundice)
.
ఇన్ఫెక్షన్‌ పరంగా 5 రకాల వైరస్‌లను -గుర్తించారు. ఇవి హెపటైటిస్‌- ఎ, బి, సి, డి, ఇ.
హెపటైటిస్‌ ఎ, ఇ లు కలుషిత నీరు, ఆహారపదార్ధాల ద్వారా సంక్రమిస్తాయి. హెపటైటిస్‌ బి, సి, డి లు రక్తమార్పిడి ద్వారా, ఒకరికి వాడిన ఇంజక్షన్‌ సూదులు ఇతరులకు వాడటం ద్వారా, సెక్స్‌ ద్వారానూ సంక్రమించే అవకాశముంది..
.
ముఖ్యమైన లక్షణాలు..
కామెర్లు సోకినప్పుడు ప్రధాన లక్షణంగా కళ్లు పచ్చబడటాన్ని గమనించవచ్చు.
దీంతో పాటు మూత్రం పసుపు రంగులోకి మారడం, బూడిదరంగు,తెలుపురంగు మలం, జ్వరం, ఒళ్లు నొప్పులు, ఆకలి తగ్గడం, దురదలు, వాంతులు వంటి లక్షణాలు కనిపించవచ్చు.
కాలేయ సమస్యను గుర్తించకపోతే కామెర్లు తీవ్రతరం అవుతాయి. అప్పుడు పాదాల వాపు, నిద్ర పట్టకపోవడం, రక్తపు వాంతులు, చేతులు వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
.
నూనె పదార్ధాలు గిట్టవు. జ్వరం, వాంతులు, వికారం, పొట్టలో బాధలు చోటుచేసుకోవచ్చు. ఇవన్నీ బాహ్యంగా కనిపించే లక్షణాలే. లివర్‌ వ్యాధి బాగా ముదిరినా కూడా కొందరిలో ఇటువంటి లక్షణాలు కనిపించకపోయే అవకాశమూ ఉంటుంది,
.
వైరస్ హెపటైటిస్ మామూలు లివర్ కామెర్లకు వైరస్ కారణం కాబట్టి వైద్యం లేదు. అందు చేత పసర్లు వగైరా చలామణీలో ఉన్నాయి. 15-30 రోజులు సేదతీరితే అదే తగ్గిపోతుంది. నీరసం 2 నెలలు ఉంటుంది. మాంసము, పప్పులు తగ్గించి తినాలి.అంటే..కాలేయానికి రెస్ట్ ఇవ్వాలి.
.
so..మనం సాధారణంగా బాధపడే పచ్చకామెర్లు మన శరీరంలో'కాలేయం' అనే అవయవం సూక్ష్మజీవుల బారినపడడం వల్ల వస్తుంది. ఈ సూక్ష్మజీవులు సాధారణంగా కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్ల మనశరీరంలో ప్రవేశిస్తాయి.
సాధారణ కామెర్లు ఎటువంటి మందులు వేసుకోకపోయినా,ఓ నెల పాటు కాలేయానికి రెస్టు ఇవ్వడం వల్లే తగ్గిపోతాయి.ఇక్కడే నాటు పసరుమందుల వైద్యం పనిచేస్తుందని భావిస్తాం.
.
కామెర్లకు వైద్యంగా.. కంట్లో పసర్లు వేయడం,మెడపైన కాల్చడం మూఢనమ్మకాలే.
.
- డా.శేషగిరిరావు-MBBS. శ్రీకాకుళం