Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 18 November 2015

DETAILED ARTICLE ABOUT SRI NAGALAMADAKA SUBRAHMANYA SWAMY TEMPLE - PAOGADA / HINDUPUR - KARNATAKA - INDIA


నాగలమడక సుబ్రమణ్యస్వామి

ఈ ప్రదేశం ఆనాడు విజయనగర రాజుల ఆస్థానానికి చెందినదని అంటారు. సుబ్రమణ్యేశ్వర స్వామికి కర్ణాటకలోని కొక్కె సుబ్రమణ్యే శ్వరస్వామికి వివిధరకాల పేర్లు ఉన్నట్లు చెబుతారు. కర్ణాటకలోని సుబ్రమణ్యంస్వామికి ఆదిసుబ్రమణ్యం అని, దొడ్డబళ్లాపూర్‌లోని ఘాటి సుబ్రమణ్యం స్వామికి మధ్య సుబ్రమణ్యం అని, నాగల మడకలో వెలసిన స్వామిని అంత్యసుబ్రమణ్య స్వామిగా కొలుస్తారు. శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో నాగలమడకలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. రాముని మాటను జవదాటని లక్ష్మణుడు ఈ ప్రదేశంలో రామునికి ఎదురు చెప్పినాడట. రాముడు ఈప్రదేశం వదలి కామనదుర్గ (నీళ్లమ్మనహళ్ళి) కాకాద్రి కొండకు ప్రయాణ మైనట్లు చెబుతారు. ఈ కొండనే కామిలకొండ అని పిలుస్తారు.

ఈ కొండపై రాముని గుడి వెలసింది. నాగలమడకలో అన్నంభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడని ఇతను సుబ్రమణ్యేశ్వర స్వామి భక్తుడిగా వుంటూ దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కొక్కె సుబ్రమణ్యేశ్వరస్వామి దర్శనానికి ప్రతిసంవత్సరం కాలినడకన హాజరై య్యేవాడని అంటారు. ఒకసారి వృద్ధాప్యంలో అన్నంభట్టు కొక్కెలో రథంలాగే సమయానికి చేరుకోలేకపోయాడని అయితే భక్తులు ఎంతమందిలాగినా కూడా రథం ముందుకు కదలక అలాగే నిలిచి పోయిందని అన్నంభట్టు అక్కడకు చేరుకొని రథం పగ్గాలపై చేయి వేసినవెంటనే రథం కదిలిందని పూర్వీకులు చెబుతారు.

* నాగాభరణంః

వృద్ధాప్యంలో ఇక్కడకు రాలేవని అందువల్ల నాగలమడకలోనే ఉంటూ సేవ చేయమని చెప్పి నాగాభరణంను అన్నంభట్టుకు కొక్కె సుబ్రమణ్యం స్వామి ఇచ్చినట్లు పెద్దలు పేర్కొంటున్నారు. ఆ నాగాభరణంను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడంవల్లనే నాగలమడక అని పేరు వచ్చిందంటారు. అది కూడా స్వామి కలలో కన్పించి పెన్నానది పరివాహకం వద్దనే ప్రతిష్ఠించమని చెప్పడంతో నాగుల కోసం వెతుకుతున్న సందర్భంలో ఒక రైతు పొలంలో నాగలితో దున్నుతుండగా ఆ సమయంలో నాగులను పోలిన రాళ్ళు లభ్యం కావడంతో ఆ రాళ్ళనే ప్రతిష్ఠించినట్లు చెబుతారు. తెలుగులో నాగలు అంటే నాగలమడక అని కన్నడంలో నేగిలు అని అర్థం.

ప్రారంభంలో కేవలం నాలుగు స్తంభాలు నిలబెట్టి రాతిబండపరచి మంటపాన్ని నిర్మించారని రొద్దంకు చెందిన బాలసుబ్బయ్య అనే వ్యక్తి ఈ మంటపంలో వ్యాపారంకు సంబంధించిన సరుకులు పెట్టుకుని నిద్రిస్తుండగా స్వామి కలలో కనిపించి ఆలయం నిర్మించాలని చెప్పడం తో ఆయన ఆలయ నిర్మాణానికి కృషి చేసి సఫలీకృతుడైనట్లు తెలిసిం ది. కావున ఆ వంశానికి చెందిన వ్యక్తులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడజరిగే రథోత్సవంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నాగలమడకలోని సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉండే శిల్పం సుందరంగా మూడుచుట్లు చుట్టుకుని ఏడు శిరస్సు లు కల్గిన మూడు అడుగుల నాగప్పస్వామి శిల్పం చూసిన భక్తులకు తక్షణం భక్తిభావన కలుగుతుంది.

* పుల్లివిస్తర్ల విశిష్టత

ప్రతి ఏడాదికి ఒకసారి నిర్వహించే బ్రహ్మ రథోత్సవంలో లక్షలాది మంది తమ మొక్కుబడులు తీర్చడానికి ఈ ప్రాంతానికి వస్తువుం టారు. అందులో విశిష్టమైనది పుల్లివిస్తర్లు ( బ్రాహ్మణులు భోజనం చేసి వదిలిన ఆకులు) తలపై పెట్టుకుని పినాకిని నదిలో స్నానం చేయడం. స్వామి రథోత్సవం తర్వాత బ్రహ్మణులు భోజనం పిదప విడిచిన పుల్లివిస్తర్లు ఏరుకుని వాటిని తలపై పెట్టుకుని నీరున్న చోట తలంటుస్నానాలు చేస్తే చేసిన పాపాలు పోయి మంచి జరుగుతుందని భక్తులు భావించడం విశేషం. అప్పటి వరకు వున్న ఉపవాస దీక్షను విరమించడం భక్తులు అనవాయితీ.

ఈ జాతరలో రైతులకు ఈ ఎద్దుల పరుష ప్రత్యేక ఆకర్షణ. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో అతి పెద్ద ఎద్దుల పరుష ఇక్కడ జరుగుతుంది. ఇక్కడకు తుమకూరు జిల్లా, ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఎద్దులు చేరుకుని దాదాపు 10రోజులపాటు ఎద్దుల అమ్మకాలు, కొనుగోలు జరుగు తాయి. 18ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయానికి రాకపోకలకు రావాణా సౌకర్యం అనుకూలంగా ఉంది. నాగలమడక ఉత్సవానికి అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి, మడకశిర, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పెనుకొండ ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కలదు.

* పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు

కర్నాటక రాష్ట్రం పావగడకు 16కి.మీ దూరంలో ఉత్తర పెన్నా(పినాకిని) నదీతీరం ఒడ్డున నాగలమడక తీరంలో శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి కొలువై అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. అంత్యసుబ్రమణ్యం పేరుతో వెలసిన ఈ స్వామి ఆలయానికి విశిష్ట ఖ్యాతి నెలకొనివుంది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లోని భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతోంది.
అంకురార్పణ, ధ్వజారోహణ, కళ్యాణోత్సవం, బ్రాహ్మణసంతర్పణ, శ్రీ సుబ్రమణ్యస్వామి వారి బ్రహ్మోత్సవం, రథోత్సవం, (సుబ్రమణ్యషష్టి), అభిషేకం, బ్రాహ్మణుల అన్న సంతర్పణ, రాత్రి 7గంటలకు గజవాహనోత్సవం, పంచామృత అభిషేకం, బ్రాహ్మణుల అన్న సంతర్పణ వంటి కార్యక్రమాలు గరుగుతాయి.

* నాగలమడకకు ఎలా వెళ్ళాలి ?

ఈ దివ్య క్షేత్రాన్ని చేరుకోవడానికి కర్నాటక రాష్ట్రంలోని పావగడ వరకు వచ్చి అక్కడనుంచి సులువుగా చేరుకోవచ్చు. పావగడ నుంచి నాగలమడక క్షేత్రం సుమారు పదిహేను కిలోమీటర్లు దూరంలో వుంటుంది. అయితే పావగడ క్షేత్రాన్ని హిందుపురం వరకు వచ్చి అక్కడనుంచి కర్నాటక రాష్ట్ర రవాణా బస్సులలో పావగడకు చేరుకోవచ్చు. అక్కడనుంచి ఏదైనా వాహనంలో నాగలమడకకు చేరుకోవచ్చు.