శ్రీ ఏకామ్రేశ్వర్ ఆలయం.
పృథ్వీలింగం
కాంచీపురం
మనకు ఐదు పంచబూతలింగాలు ఉన్నాయి.అవి
*.1. తేజో లింగం: అన్నామలైశ్వరుడు -అన్నామలై
*.2. జల లింగం: జంబుకేశ్వరుడు-తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం
*.3. ఆకాశ లింగం: చిదంబరేశ్వరుడు(నటరాజ)-చిదంబరం:
*.4. పృథ్వీ లింగం: ఏకాంబరేశ్వరుడు -కంచి:
*.5. వాయు లింగం: శ్రీకాళహస్తీశ్వరుడు-శ్రీకాళహస్తి.
కాంచీపురంలో ఏకామ్రేశ్వర్ ఆలయం.
శివకంచిలో నెలకొన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతుంది. ఈ క్షేత్రం యొక్క పురాణగాధని ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో తిలకించవచ్చు. ఆలయం ద్రావిడశైలిలో నిర్మితమై చూపరులను విశేషంగా ఆకట్టుకొంటుంది. ఆలయం చాలా విశాలంగా శిల్పకళా సౌందర్యానికి పెట్టింది పేరుగా మంత్రముగ్ధులను చేస్తుంది. కోనేరు చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ వెయ్యిస్థంభాల మండపం ప్రధాన ఆకర్షణ. కాంచీపురాన్ని పల్లవులు రాజధానిగా చేసుకొని పరిపాలించారు.
ఈ ఆలయంలో పరమేశ్వరుని కైంకర్యానికి సదా సిధ్దగా ఉండే నందీశ్వరుడు చాలా పెద్దగా నయన మనోహరంగా దర్శమిస్తాడు. ఇక్కడ కొలువైన ఏకామ్రేశ్వరుడు పంచభూత స్థలాలలో ఒకటైన పృథ్వి లింగంగా పూజలందుకొంటున్న ఏకాంబరేశ్వరుడుకు మల్లె తైలంతో విశేషంగా అభిషేకం జరుగుతుంది.
ఏకామ్రేశ్వర్ కోవెలలో 3500 సంవత్సరాల అతిపురాతనమైన మామిడి వృక్షం నాలుగు కొమ్మలతో ఉండేది. ఒక్కొక్క కొమ్మ మామిడి పండ్లు ఒక్కో రుచితో ఉండేవి. ఈ మామిడి వృక్షం యొక్క నాలుగు కొమ్మలు నాలుగు వేదాలకు ప్రతీతి.
ఈ దేవాలయ గోపురం ఎత్తు 59 మీటర్లు ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద గోపురాలలో ఒకటి.
ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. తిరునిలథింగల్ తుండం అనే మహావిష్ణువుసన్నిధి ఉన్నది. ఇక్కడ ఉన్నవిష్ణువును వామనమూర్తిగా పూజిస్తారు.
ఇక్కడ పరమేశ్వరుని శివలింగం సైకత లింగం. ఈ శివలింగాన్ని పార్వతిదేవి సైకతంతో చేసారని ప్రతీతి. ఈ మామిడి వృక్షం కిందే పార్వతి దేవి , తపోకామాక్షి గా పరమేశ్వరుని కోసం తపస్సు చేసి, పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకొని వివాహం చేసుకొంది. అయితే ఇంతటి ప్రాసశ్థ్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం . ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు.
ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో,దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం క్రింద పార్వతిపరమేశ్వరులు, పార్వతిదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపోకామాక్షిని కూడా దర్శించవచ్చు.
ఈ ఆలయంలో మనం 16 పట్టలు ఉన్న శివ లింగాన్ని దర్శించవచ్చు. 16 పట్టలు 16 కళలకు ప్రతీతి అంటారు.
ఇదే ఆలయంలో నటరాజస్వామి చిద్విలాస రూపాన్ని దర్శించవచ్చు. ఇక్కడ శ్రీమన్నారాయణుడు అర్చా ముర్తిగా కొలువుదీరి ఉన్నాడు.
ఈ పృథ్వీ లింగ క్షేత్రమొక ఆధ్యాత్మిక పుణ్యధామం. ఏక అంటే ఒక, ఆమ్ర మామిడి అని అర్థాలు.
స్థల పురాణం.
ఒకసారి కైలాసంలో శివుడూ పార్వతీ ఏకాంతంగా ఉన్నప్పుడు, పార్వతీదేవి పరిహాసానికి శివుడి రెండు కళ్ళూ మూసిందట. సూర్య చంద్రులుగా చెప్పబడే ఆ పరమేశ్వరుడి రెండు కళ్ళూ మూసుకుపోవడంతో, సృష్టి మొత్తం చీకటిమయమై, సర్వ ప్రాణులూ భయాందోళనలకు గురి కావడంతో, శివుడు మూడవ కన్ను తెరిచి, లోకాన్ని శాంతింపజేశాడట. అటుపై, ఆ హిమగిరి నిలయుని ప్రియ ప్రణయిని, ప్రాయశ్చిత్తానికై తపస్సు చేయబూని, భూలోకంలోని బదరికాశ్రమమునకు చిన్న పిల్లగా వస్తుందట. అక్కడి ముని కాత్యాయనుడామెను చూసి, తన సంరక్షణలో పెంచుతాడు కనుక, ఆమె కాత్యాయని అయింది. ఆయన ఆదేశం మేరకు, కంచి చేరుకుని, ఇక్కడి మామిడి చెట్టు క్రింద కూర్చుని సైకత శివలింగం చేసుకుని, తపస్సు చేయడం మొదలు పెడుతుందట. మహాశివుడా తపస్సును పరీక్షింపదలచి, గంగను విడిచి వరదలు సృష్టించి తపోభంగం చేసే ప్రయత్నం చేస్తాడట. అప్పుడు సైకత లింగమెక్కడ కరిగిపోతుందోనన్న బెంగతో, శైలబాల గాఢాలింగనంతో శివలింగాన్ని కాపాడే ప్రయత్నం చేయడంతో- ఆ పరిష్వంగానికి పరవశుడై, ప్రత్యక్షమై,ఆమెను కరుణించాడన్నదే స్థల పురాణం!
అయ్య వారికి దూరం గా అమ్మ వారున్న కంచి కామాక్షి క్షేత్రం పరమ పవిత్ర మైనది.ఏకాంబరేశ్వరుడు దర్శనీయుడు .సాధారణం గా స్వామి వారి విగ్రహానికి ఎడమ వైపు అమ్మ వారి విగ్రహం ఉంటుంది .అయితె కంచిలో మాత్రం,ఎకామ్రారేశ్వర ఆలయానికి సుమారు రెండు ఫర్లాంగుల దూరం లో కామాక్షి దేవి ఆలయం ఉండటం విశేషం .కామాక్షి ఆలయం లో ,అమ్మ వారి ఎదుట బీజాక్షరాల తో ఉన్న యంత్రం ప్రతిష్టించ బడి ఉంది. పూజాదికాలను యంత్రానికే చేయటం ఇక్కడి ప్రత్యేకత .ఇక్కడే శ్రీ కంచి కామ కోటి పీఠం ఉంది.విష్ణు కంచి లో వరద స్వామి ఆలయం ఉంది.ఇక్కడి వెండి బల్లి ని తాకితె పాపాలు పోతాయని భక్తుల నమ్మకం . కామ కోటి అంటే కామంతర్వాత వచ్చే మోక్ష దశ్శ .అంటే మోక్షం పొంద టానికి దారి చూపేది కామ కోటి పీఠం అని అర్ధం .కంచిలో దర్శనీయస్థలాలు అనేకం ఉన్నాయి.
శివరాత్రి నాడు జాగరణ చేసి లింగోద్భవ దర్శనం చేసుకుంటే మోక్షంసిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.