Search This Blog

Chodavaramnet Followers

Thursday, 24 September 2015

TELUGU OLD CHANDAMAMA STORY - GUESTS EQUAL TO GOD


.ఆతిధి దేవో భవ

కౌసల దేశాన్ని ఏలే విక్రమ సేనుడు తన ప్రధాన మంత్రితో కలిసి ఒకరోజు రహస్య రాజ్య పర్యటనకు బయలుదేరాడు. తన రాజ్యంలో ప్రజల స్థితి గతుల గురించి అధ్యయనం చేద్దామని అనంతరం ఎవరైతే అతిధుల పట్ల అత్యున్నత రీతిలో గౌరవం కనబరుస్తారో వారికి బహుమానం ఇద్దామని మహారాజు మంత్రితో చెప్పాడు.

ఆ రోజు సాయంత్రం ఇద్దరూ వెళ్ళి ఒక ఇంటి తలుపు తట్టారు. తలుపు తెరచిన ఇంటి యజమానితో ‘అయ్యా, మేము పొరుగు రాజ్యం నుండి వర్తకం చెయ్యడానికి వచ్చాం. ఈ రాత్రికి మీ ఇంట్లో కాస్త తల దాచుకోనిస్తే ఉదయాన్నే లేచి వెళిపోతాం. మాకు ఈ వూరిలో ఎవ్వరూ తెలియదు. దయ చెసి మాకు సహాయం చెయ్యండి” అని అభ్యర్ధించారు.

ఆ మాటలు విన్నంతనే ఆ ఇంటి యజమాని కోపంతో మండిపడ్డాడు. “ భలేవాళ్ళె మీరు. ముక్కు ముఖం తెలియని వారికి ఇంట్లో ఎలా తల దాచికోనిస్తాం ? మీరు దొంగలు కారన్న నమ్మకం ఏమిటి ?అయినా అడ్డమైన వాళ్ళ్కు ఆశ్రయం ఇవ్వడానికి నా ఇల్లేమైనా ధర్మ సత్రం అనుకున్నారా ? ఇంకొక్క క్షణం లో ఈ ఇక్కడి నుండి వెళ్ళకపోతే రాజ భటులను పిలవాల్సి వస్తుంది” అని పెద్దగా అరుస్తూ తలుపు వాళ్ళ ముఖం మీదే వేసేసాడు.

అప్పుడు వారిద్దరూ మరొక ఇంటి తలుపు తట్టి ఇంతకు ముందు లాగే ఎంతో వినయంతో అభ్యర్ధించారు.

ఆ ఇంటి యజమాని “ అయ్యా ! నా ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే.ముందు మీరు ఎంత మంది వున్నారో లెఖ్ఖ సరిగ్గా చెబితే అప్పుడు ఆలోచిస్తాను” అని అన్నాడు. ఆందుకు మహారాజు” అయ్యా ! మేము ఇద్దరమే వున్నాము. మా వద్ద చెల్లించుకోవడానికి అట్టె ధనం లేదు. ఈ రేత్రికి మీ ఇంట్లో తల దాచుకోనివ్వండి. ముందుగా మేము దైవ దర్శనం చేసుకొని వస్తాం” అని చెప్పి ముందుకు కదిలారు.

తర్వాత వారు ఇంకొక ఇంటి తలుపు తట్టారు. ఇంటి యజమానిని అదే విధంగా అడగగా అతను ఎంతో వినయంతో తలుపులు తెరిచి “దయ చేసి లోపలికి రండి ,ఈ ఇంటిని మీదిగా భావించి విశ్రాంతి తీసుకొండి. ఆతిధి అభ్యాగతులను గౌరవించడం మా రాజ్యం యొక్క సంప్రదాయం” అంటూ వారిని ఎంతో సాదరంగా ఆహ్వానించాడు. ఆ ఇంటి యజమాని ఆర్ధిక పరిస్థితి అధ్వాహ్నంగా వుంది అయినా వున్నంతలోనే వారిదరికీ స్వాగత సత్కారాలను చేసాడు. ఈ ఇంటి కుటుంబ సభ్యులు కూడా అతిధుల పట్ల ఎంతో ప్రేమానురాగాలను కనబరిచారు.

మర్నాడు రాజ్యానికి తిరిగి వెళ్ళిన మహారాజు ముగ్గురు ఇంటి యజమానులను పిలిచి వారితో ఇలా అన్నాడు.

మొదటి వానితో “ ఇంటికి ఆశ్రయం కోసం వచ్చిన వారిని కన్ను మిన్ను కానక నువ్వు తీవ్రంగా అవమాన పరిచావు. నీ వంటి వాడు ఈ రాజ్యంలో వుండదానికి అనర్హుడు “ అని వానికి దేశ బహిష్కార శిక్ష ను విధించాడు.

రెండవ వ్యక్తితో” నువ్వు ముందు వాని వలే కాక కనీసం ఎందరు వున్నారన్న దానిని బట్టి ఆశ్రయం ఇచ్చేదీ లేనిదీ నిర్ణయించుకున్నావు. నీ ఆర్ధిక పరిస్థితి నీ చేత ఆ విధంగా ఆలోచింప చేసింది. అందుకని నీ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచడం అవశ్యం. వున్న దానిలో కొంతదానిని ఇతరులకు పంచాలన్న నీ ఆలోచనను ఎన్నడూ విడవకు" అంటూ వానికి కొంత ధనం ఇచ్చి పంపేసాడు.

మూడవ వ్యక్తిని మహారాజు దుశ్సాలువతొ సన్మానించి లెఖ్ఖ లేనంత ధనాన్ని, బంగారాన్ని ఇచ్చి” ఆగర్భ దారిద్రంలో మునిగి వున్నా తనకు చేతనైనంతలో పరులకు సహాయం చెయ్యాలన్న గొప్ప సంస్కారం నీకు వుంది. ఆతిధులను సాక్షాత్తు భగవంతునిగా చూసే ఈ రాజ్యపు సంస్కృతి సాంప్రదాయాలను ఆచరణలో చూపించావు ” అంటూ అతనికి తన రాజ్యపు కొలువులో ఒక చక్కని ఉద్యోగం ఇచ్చాడు.

ఆతిధులను ఎలా గౌరవించాలో తెలియజేసే భావ గర్భితమైన కధ ఇది. ఇందులో నుండి ప్రతీ ఒక్కరం చాలా విషయాలను నేర్చుకోవలిసి వుంటుంది.

మాతృదేవో భవ..పితృదేవోభవ,…ఆచార్య దేవోభవ, ..అథిది దేవో భవ అన్నది వేదోక్తి.అవసరార్ధం మనింటికి వచ్చే అతిధులను సాదరంగా ఆహ్వానించి చేతనైనంతగా గౌరవ మర్యాదలను చూపించాలని మన శాస్త్రం తెలియజేస్తోంది. ఆతిధిని గౌరవించిన చోట దేవతలు నివాసం చేస్తారని అంటారు.అతిధుల విషయం లో కుల, మత, ప్రాంతీయ బేధాల పట్టింపులు చూపకూడదు. ఆతిధులు సంతృప్తి చెందితే యజమానికి సర్వ సౌఖ్యాలు లభిస్తాయన్నది నిర్వి వాదాంశం. కానీ ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నదేమిటి ? ప్రపంచీకరణ నేపధ్యంలో మన జీవితాలలో వేగం పెరిగింది. లెఖ్కకు మించి వస్తున్న ఉపకరణాల వలన మానవుల అహం పెచ్చు పెరిగింది. సంబంధ బాంధవ్యాలు పూర్తిగా నశించిపోయాయి. ఇచ్చి పుచ్చు కోవడం లోనూ, కలిసి మెలిసి జీవించడం లోనే అసలైన ఆనందం దాగి వుందీన్న సంగతిని పూర్తిగా మర్చిపోయాం.సహాయార్ధం ఎవరైనా ఇంటికి వస్తే ముఖం చిట్లిస్తాము. వచ్చిన వారిని గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడే సంస్కృతి వచ్చింది. టైమునప్పుడు టి విలు, కంప్యూటర్లు, వీడియో గేంస్ లతో కాలక్షేపం చేస్తున్నాం తప్ప ఒకరి ఇంటికి వెళ్ళడం, ఇంకొకరిని మన ఇంటికి ఆహ్వానించడం లాంటి సహ జీవన సంస్కృతికి పూర్తిగా దూరమైపోయాము. కొన్ని ప్రధాన నగరాలలో అయితే అప్పాయింట్ మెంట్ తిసుకోకుండా వస్తే ఎందుకు వచ్చారని ముఖంమీదే తలుపులేసేసే పరిస్థితి వుంది.
మనుషిని మనిషిగా చూడాలి. ఫరులకు వీలైనంతగా సహాయం చెయ్యాలి.ఇంటికి వచ్చిన వారిని ఆదరించడం, తోచిన విధంగా సత్కార్యం చెయ్యడం మన విధి. దీనిని విస్మరించిన నాడు మన మనుగడకు అర్ధం లేదు.