చుండ్రు పోవాలంటే...!
ఉంగరాల్లాంటి జుత్తు ఎంత ఒత్తుగా ఉన్నా.. తలలో చుండ్రు చేరితే కురులు వెలవెలబోతాయి. నలుగురిలో నగుబాటు చేసే చుండ్రు సమస్యను చిన్న చిన్న చిట్కాలతో దూరం చేసుకోవచ్చు.
వారంలో కనీసం రెండుసార్లయినా కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి.
ఉసిరి, కుంకుడుకాయ, శీకాకాయ పొడులను సమపాళ్లలో కలిపి రెండు లీటర్ల నీటిలో ఉడకబెట్టాలి. మిశ్రమం దగ్గరికి వచ్చాక షాంపూలా వాడితే మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి కుదుళ్లకు బాగా పట్టేలా మర్దనా చేసుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య కొంత తీరుతుంది.
గసగసాలను మెత్తటి పేస్ట్‌లా చేసుకుని తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే ఫలితం కనిపిస్తుంది.
ఒక కప్పు వేడి నీటిలో నిమ్మకాయ రసం కలిపి తలకు పట్టించి.. కాసేపాగి తలస్నానం చేస్తే మంచి గుణం ఉంటుంది.
మందారాకులను వేడి నూనెలో కలిపి తలకు రాసుకోవాలి. తరచూ ఇలా చేస్తే చుండ్రు సమస్య తీరుతంది. కుదుళు బలంగా అవుతాయి.
కొబ్బరి నీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి తాగితే చుండ్రు నుంచి ఉపశమనం పొందవచ్చు.
పారిజాతం గింజలను మెత్తగా నూరి దాన్ని నూనెలో కలిపి తలకు పట్టించి గంట తర్వాత తలంటు పోసుకోవాలి.
పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి.. కాసిన్ని నీళ్లు కలిపి మాడుకు పట్టించాలి. గంటన్నర తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
గుడ్డు తెల్లసొనను జుట్టుకు పట్టించి.. గంట తర్వాత స్నానం చేయాలి.