Search This Blog

Chodavaramnet Followers

Monday, 6 July 2015

BRIEF BIODATA OF LEGENDARY TELUGU ACTRESS - SMT S.VARA LAKSHMI 1927-2009 IN TELUGU


ఎస్.వరలక్ష్మి (1927 - 2009) తెలుగు సినిమా నటీమణి మరియు గాయని.

* జీవిత సంగ్రహం


ఈమె 1927 సంవత్సరం జగ్గంపేటలో జన్మించారు. అలనాటి తెలుగు కథానాయిక, సత్యహరిశ్చంద్రలో చంద్రమతిగా, లవకుశలో భూదేవిగా ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు అలరించాయి. తన పాత్రకు తానే పాటలు పాడుకునే ఆమె కంఠస్వరం పాతతరపు ప్రేక్షకులకు సుపరిచితమే. వయ్యారి భామలు వగలమారి భర్తలు, ముద్దుల కృష్ణయ్య తదితర పలు తెలుగు చిత్రాలతో పాటు వీరపాండ్య కట్టబొమ్మన్, పణమా పాశమా, గుణ వంటి ప్రఖ్యాత తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎల్. శ్రీనివాసన్‌ను పెళ్లాడారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

యస్.వరలక్ష్మి గూడవల్లి రామబ్రహ్మం ప్రోత్సాహంతో బాలనటిగా సినిమారంగంలోకి అడుగుపెట్టింది. మొదటి చిత్రం 'బాలయోగిని' (1937) తర్వాత 'రైతుబిడ్డ' (1939)లో పి.సూరిబాబు కూతురుగా నటించింది. 'ఇల్లాలు'లో ఆమె పాడిన 'కోయిలొకసారొచ్చి కూసిపోయింది' పాటతో పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకుంది. ఎస్.రాజేశ్వరరావుతో కలిసి 'శాంత బాలనాగమ్మ' (1942)లో నటించింది. ఆ సినిమాలో రాజేశ్వరరావుతో కలిసి పాడిన పాటలు ఈనాడు లభించటం లేదు. తర్వాత 'మాయాలోకం' (1945)లో నటించినా ఆంధ్రలోకానికి బాగా తెలిసింది 'పల్నాటి యుద్ధం' చిత్రంతోనే. ఈ చిత్రంలోని పాటల్ని మద్రాసు ఆలిండియా రేడియో వారు రికార్డింగ్ అయిన మరుసటి రోజే ప్రసారం చేశారు. ఆ ఘనత అంతకుముందూ, ఆ తర్వాత కూడా మరెవరికీ దక్కలేదు.

అక్కినేని నాగేశ్వరరావు పెళ్లికి కచేరి చేసింది. శివాజీ గణేశన్‌తో కలిసి నటించిన 'వీరపాండ్య కట్టబ్రహ్మన్' చిత్రం కైరోలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడినపుడు వరలక్ష్మి గాత్రానికి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. పి.సూరిబాబు, రాజేశ్వరీ ట్రూప్‌లతో కలిసి ఆంధ్రదేశమంతా తిరిగి నాటకాలు వేసింది వరలక్ష్మి. కన్నాంబ ప్రోత్సాహంతో నిర్మాతగా మారి 'వరలక్ష్మీ పిక్చర్స్' ప్రారంభించి తొలిసారిగా 'సతీ సావిత్రి' (1957) నిర్మించింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణను సినిమారంగానికి పరిచయం చేసిన చిత్రమిది. ఎనిమిది మంది సంగీత దర్శకులు పనిచేయడం ఈ సినిమా విశేషం.

ఎస్.వరలక్ష్మి ఎవరినీ ఎక్కువగా కలిసేది కాదు. ఎక్కడికీ వెళ్లేది కాదు. పబ్లిక్ ఫంక్షన్స్‌ను తప్పించుకునేది. చాలా విషయాల్లో కన్నాంబను ఆదర్శంగా తీసుకునేది. శాంతకుమారి కూతురు పద్మకు వరలక్ష్మి కూతురు నళినికి స్నేహం. ఎందుకనో వరలక్ష్మి నిజ జీవితం అంత సంతృప్తిగా సాగలేదనిపిస్త్తుంది. ఇంట్లో అన్ని సౌకర్యాలున్నా మానసికంగా ఒంటరితనాన్నే అనుభవించింది. ఆమె ఒక్కగానొక్క కుమారుడు మానసికంగా ఎదగలేదు. ఇది ఆమెను నిరంతరం బాధించేది. ఆమె భర్త పి.ఎల్.శ్రీనివాసన్ (కణ్ణదాసన్ తమ్ముడు) మరణించిన తర్వాత, చాలా ఆస్తి పొగొట్టుకుంది.

షావుకారు జానకి, తనూ తెలుగువాళ్లకంటే తమిళులకే ఎక్కువ ఋణపడి ఉన్నామని పదేపదే చెప్పేది. పి.శాంతకుమారి చనిపోయిన రోజు బాధతో ఉపవాసం చేసింది వరలక్ష్మి. 'అందరూ వెళ్లిపోతున్నారు - ఇక చెన్నైలో ఏముంది?' అని నిర్వేదంగా మాట్లాడేది. తెలుగు సినిమా భవనపు పునాదిరాళ్లలో ఎస్.వరలక్ష్మి ఒకరు. ఏ కచేరీలోనూ, ఏ టీవీ ఛానల్ కార్యక్రమాల్లోనూ ఔత్సాహిక గాయనీగాయకులెవరూ వరలక్ష్మి పాటల్ని ఎన్నుకుని పాడరు. ఎందుకంటే అవి పాడటం కష్టం.

* కొన్ని ఆణిముత్యాలు

బాలరాజు, మాయాలోకం, పల్నాటి యుద్ధం, సతీ సావిత్రి అక్కినేనితో, నాగపంచమి చిత్తూరు వి.నాగయ్యతో, శ్రీ వేంకటేశ్వర మహత్యం, ఎన్‌.టి.ఆర్‌తో కృష్ణప్రేమ, మహామంత్రి తిమ్మరుసు కృష్ణార్జున యుద్ధం, శ్రీకృష్ణ పాండవీయం, ప్రేమ్‌నగర్‌, బాలభారతం, దేవుడు చేసిన మనుషులు, యశోదకృష్ణ, దానవీర శూరకర్ణ, బాలభారతం చెప్పుకోదగ్గ చిత్రాలు. సహజమైన నటన ప్రదర్శించడంలో యస్‌. వరలక్ష్మి ముందుండేది.

* అవార్డులూ, రివార్డులూ

తమిళనాడు స్వచ్ఛంద సేవా సంస్థలు లెక్కలేనన్ని అవార్డులతో సత్కరించింది. అందులో ప్రత్యేకించి చెప్పుకోదగ్గ అవార్డు 'కలై మామణి' ప్రభుత్వ అవార్డు జయలలిత చేతుల మీదుగా అందుకుంది. ఈ అవార్డుతో బాటు జయలలిత పది లక్షల క్యాష్‌ ప్రైజ్‌ కూడా ఇవ్వడం విశేషం. దీంతోపాటు శివాజీ గణేశన్‌ మెమోరియల్‌ అవార్డు, కన్నదాసన్‌ అవార్డు చెప్పుకోదగ్గవి.

నేపథ్య గాయని ఎస్.వరలక్ష్మి (84) మంగళవారం రాత్రి చెన్నై మహాలింగపురంలోని స్వగృహంలో సెప్టెంబర్ 22, 2009 రాత్రి 11 గం.లకు తుదిశ్వాస విడిచారు. మంచం మీద నుంచి పడినందువల్ల తీవ్రమైన వెన్నుపోటుతో ఆరు నెలలు బాధపడ్డారు.

* నటిగా ఆమె నటించిన చిత్రాలలో కొన్ని

ముద్దులక్రిష్ణయ్య (1986)
అభిమానవతి (1975)
నథయిల్ ముత్తు (1973)
బాలభారతం (1972)
బొమ్మా బొరుసా (1971)
ప్రేమనగర్ (1971)
ఆదర్శ కుటుంబం (1969)
అపూర్వ పిరవైగళ్ (1967)
భామా విజయం (1967)
శ్రీకృష్ణావతారం (1967)
శ్రీకృష్ణ పాండవీయం (1966)
సత్య హరిశ్చంద్ర (1965)
భబృవాహన (1964)
లవకుశ (1964)
శ్రీకృష్ణార్జున యుద్ధం (1963)
మహామంత్రి తిమ్మరుసు (1962)
అభిమానం (1960)
శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (1960)
వీరపాండియ కట్టబొమ్మన్ (1959)
మాంగల్యబలం (1958)
చక్రవర్తి తిరుమగళ్ (1957)
సతీ సావిత్రి (1957)
కనకతార (1956)
ఎత్తిరపరదత్తు (1954)
సతీ సక్కుబాయి (1954)
సౌదామిని (1950)
స్వప్నసుందరి (1950)
వాలి సుగ్రీవ (1950)
జీవితం (1949)
బాలరాజు (1948)
పల్నాటి యుద్ధం (1947)
మాయాలోకం (1945)
రైతు బిడ్డ (1939)
సేవాసదన్ (1938)
బాలయోగిని (1936) (బాలనటిగా)