Search This Blog

Chodavaramnet Followers

Friday, 27 March 2015

SRI RAMA THARAKA MANTRAM AND ITS SPIRITUAL IMPORTANCE ARTICLE IN TELUGU


శ్రీ రామ" తారక మంత్రముతో శుభ ఫలితాలెన్నో..!

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్
ఆజానుబాహుమరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి - అంటూ శ్రీరాముడిని స్తుతించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి. జన్మతహ:కిరాతకుడై పుట్టిన ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి "శ్రీమద్రామాయణం" రాసేంత స్థాయికి చేరుకోగలిగాడు.

అడవుల్లో తిరుగుతూ వేటాడుతూ కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు "రామ రామ రామ" అనే తారక మంత్రమే తోడ్పడింది. కిరాతకుడైన బోయవాడిని నారదుడు చూసి నీవు చేస్తున్న ఈ కిరాతకమైన పాప కార్యంలో నీ భార్యబిడ్డలు ఏమైనా పాలుపంచుకుంటారో తెలుసుకుని రా అని పంపుతాడు.

వెంటనే ఆ కిరాతకుడు భార్యబిడ్డల వద్దకు వెళ్లి ఆ ప్రశ్న అడుగుతాడు. దానికివారు గృహస్తుడుగా మమ్ములను పెంచి పోషించే బాధ్యత నీది కానీ నీవు చేసే పుణ్యకార్యంలో భాగం పంచుకుంటామేతప్ప పాపకార్యంలో కాదు. అని నిష్కర్షగా పలుకుతారు. వారి పలుకులకు వైరాగ్యము చెందిన బోయవాడు మహర్షి నాకు చక్కని మోక్షమార్గానికి ఉపాయము చెప్పమని ప్రాధేయపడతాడు.

కిరాతకుని విన్నపము మేరకు నారదుడు "రామ రామ రామ" అనే తారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడు. చివరకు నోరు తిరగక శరీరంపై పుట్టలు పోస్తున్నా "మర" అంటూనే ఆ తారకమంత్రాన్ని వీడలేదు. బ్రహ్మ అనుగ్రహముతో వల్మీకము నుండి పునర్జీవింపడి వాల్మీకి మహర్షిగా జ్ఞాన సంపదను ఈ తారకమంత్రముచే పొంది శ్రీమద్రారాయమణ అనుకమనీయకావ్యం రచించి కారణజన్ముడై ఊర్థ్వలోకమందు ఆ చంద్రతారార్కం తరగని నిధిని పొందిన మహాభాగ్యశాలి అయినాడు.

అట్టి శ్రీమద్రారామాయణం మనకు ఎంతో ఆదర్శవంతమైంది. అందలి శ్రీ సీతారామచంద్రమూర్తి మూర్తీభవించిన ధర్మదేవతా స్వరూపం. ఆ కావ్యమే మనకు మనభావితరాలకు మార్గదర్శి కానుంది.

కాబట్టి శ్రీరామ నవమి రోజున రామ నామ తారక మంత్రమును పఠించడంతో పాటు సీతారాముల కళ్యాణోత్సవం వీక్షించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. అలాంటి మహిమాన్వితులపై శ్రీరామచంద్రులను శ్రీరామనవమి నాడు స్తుతించి వారి అనుగ్రహము పొందుదుము గాక..!.