దానిమ్మగింజ గింజకో విలువ
దానిమ్మ గింజల రసాన్ని రోజుకో గ్లాసు చొప్పున తాగితే గుండె చక్కగా పనిచేస్తుంది. నిజమే.. కాని దానిమ్మ పండు గింజలు వలుచుకుని తినాలంటే మాత్రం కొద్దిగా కష్టం. శ్రమలేకుండా దానిమ్మ గింజల్ని వలిచేందుకు ఓ పద్ధతి ఉంది..
- మిగతా పళ్లతో పోలిస్తే దానిమ్మపండులో యాంటాక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఈ యాంటాక్సిడెంట్లు శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌ను నాశనం చేస్తాయి. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో వీటి పాత్ర కీలకం. రెడ్ వైన్, గ్రీన్‌టీలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ యాంటాక్సిడెంట్లు దానిమ్మ పండులో ఉంటాయి.
- అలాగే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడాలంటే దానిమ్మ గింజల రసాన్ని మించింది లేదు. జుట్టు కుదుళ్లకు బలాన్నిచ్చి, మందంగా ఉంచి, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది దానిమ్మ రసం.
- హార్మోన్ల అసమతుల్యత యాక్నె సమస్యకి కారణం. దానిమ్మ గింజలు యాక్నెను నివారించడంలో ముఖ్య భూమిక వహిస్తాయి. ఈ మ్యాజిక్ ఫ్రూట్ జీర్ణవ్యవస్థను సరిచేస్తుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. యాక్నె వల్ల దెబ్బతిన్న చర్మాన్ని బాగుచేస్తుంది.
- ఈ పండులో అధిక మొత్తంలో ఐరన్ ఉం టుంది. ఐరన్ ఆక్సిజన్ రవాణాకి సాయపడుతుంది. ఆక్సిజన్ రవాణా సరిగా జరిగిందంటే చర్మం యవ్వనంతో మెరిసిపోవడం ఖాయం.
- దానిమ్మరసాన్ని ముఖానికి రాసుకుంటే అది మంచి టోనర్‌లా పనిచేస్తుంది. చర్మంపై ఏర్పడే మచ్చలు, బ్లెమిషెస్‌ను తగ్గిస్తుంది దానిమ్మ. చర్మంపై ఉండే మృతకణాలను తొలగించాలంటే దానిమ్మే బెస్ట్.
- ఒక గ్లాసు దానిమ్మ రసాన్ని ప్రతిరోజూ తాగితే రక్త సరఫరా బాగా జరుగుతుంది. దానివల్ల గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. రక్తం గడ్డలు కట్టకుండా చేసే గుణం దానిమ్మకు ఉంది.
వలిచేయండిలా...
దానిమ్మపండును అడ్డంగా కోయాలి. ఇలా చేసేటప్పుడు చాకుని దానిమ్మ పండులోకి మరీ లోతుకు పోనివ్వద్దు. గింజలకు చాకు తగిలితే రసం బయటకు వచ్చేస్తుంది. అందుకని గింజల వరకు వెళ్లకుండా పైపైన కోయాలి. దానిమ్మపండు చుట్టూరా చాకుతో కోశాక చేతులతో రెండు భాగాలు చేయాలి. ఒక సగాన్ని బోర్లించినట్టు పట్టుకుని తొక్కమీద గరిటెతో కొడుతుంటే పళ్లెంలోకి గింజలు వాన జల్లులా పడతాయి.