అక్షతలు
అక్షతలు లేదా అక్షింతలు నీటితో తడిపిన బియ్యము. క్షతములు కానివి అక్షతలు అని అర్ధము. భగ్నముగాని బియ్యమును అక్షతలు అంటారు. నిండు గింజలైన అక్షతల వలె మీ జీవితము కూడ భగ్నము కాకుండా ఉండాలని నిండు నూరేళ్ళు జీవించాలని చెప్పడానికి సంకేతంగా అక్షతలను ఉపయోగిస్తాము. పెద్దలు పిన్నలను ఆశీర్వదించేటప్పుడు గాని, పూజాదికములందు గాని, వివాహోపనయనములందు గాని వాడుట హిందూ ఆచారము.
బియ్యము చంద్రునికి చెందిన ధాన్యము. మనః కారకుడైన చంద్రుడి ప్రభావం బియ్యంపై ఉంటుంది. మానవుని దేహం ఓ విద్యుత్ వలయం. ఆశీర్వదించేవారు చేతిలోకి బియ్యం తీసుకోగానే వారిలోని విద్యుత్ బియ్యానికి అందుతుంది.
ఆశీర్వాదించే వారికి చర్మవ్యాధులు ఉంటే ఆ ప్రభావం కూడా ఆశీర్వాదం తీసుకునే వారిపై పడుతుంది. అందుకే క్రిమిసంహరకమైన పసునుని కలిపి, కేవలం విద్యుత్ మాత్రమే స్వీకరించేలా చేసి పసుపు కలిపిన బియ్యాన్ని అనగా అక్షింతలనిచ్చి ఆశీర్వదించమంటారు
పసుపు లేదా కుంకుమ గానీ, కలపని అక్షింతలను పూజాకార్యక్రమాల్లో గానీ, శుభకార్యల్లోగానీ వాడరు.
అక్షింతలు మూడు రకాలు:
హరిద్రాక్షతలు: పసుపు కలిపిన బియ్యం: వీటిని పూజకు, ఆశీర్వదించేటప్పుడు ఉపయోగిస్తారు
రక్షాక్షతలు: పసుపు సున్నము కలిపిన బియ్యం
శ్వేతాక్షతలు: ఏమీ కలపని తెల్లని బియ్యం : అశుభకార్యాలకు ఉపయోగించునవి