Search This Blog

Chodavaramnet Followers

Monday 12 January 2015

ARTICLE ABOUT STORY OF GODDESS SARASWATHI AND HER PRAYER IN TELUGU


 సరస్వతీ నమస్తుభ్యం

విద్య, బుద్ధి, జ్ఞానం, కళలు, మేధస్సు, వాక్కులకు సరస్వతీదేవిని అధిదేవతగా ఋగ్వేదం పేర్కొంది. సరస్వతీదేవి వాహనమైన హంస క్షీరనీర న్యాయం మాదిరిగా మంచి చెడుల విచక్షణ కలిగి ఉండాలని తెలియజేస్తుంది. ఎక్కడ ఉన్నా మంచిని గ్రహించాలని చెబుతుంది. సరస్వతి చేతిలోని వీణ మధురమైన రీతిలో మాట్లాడటం, కళలను అభ్యసించడం, ఆదరించడం మంచిదని ప్రబోధిస్తుంది. లోక విధాత అయిన సరస్వతీదేవి తన పతి అయిన బ్రహ్మ నాలుకపైన నివసిస్తుందని పురాణోక్తి. అంటే బ్రహ్మదేవుని వాక్కు సరస్వతే. ఆ విధాత చేసే సృష్టికి ఉపయోగపడే జ్ఞానం ఆ తల్లే. ఆమె జన్మించిన మాఘ శుద్ధపంచమికే వసంతపంచమి లేదా శ్రీపంచమి అని పేరు. ఈ పర్వదినాన సరస్వతీదేవిని కలం, వీణ, పుస్తకాది రూపాలలో ఆవాహన చేసి అర్చనలు, ఆరాధనలు చేయడం వల్ల ఆమె అనుగ్రహం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ శుభవేళ విద్యాగోష్ఠులు, సభలు, పండితులకు, కళాకారులకు సన్మానాలు, శాస్త్రచర్చలు, విద్వత్సభలు జరుపుతారు.

సరస్వతీదేవిని ఆమెకు ప్రీతికరమైన తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రంతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్లనువ్వుల ఉండలు, చెరకు రసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ వంటి వాటిని నివేదిస్తే ఆమె అమిత ప్రసన్నురాలవుతుందని శాస్త్రోక్తి. సకల శాస్త్రాలకు, సమస్త విద్యలకు తల్లి సరస్వతీదేవే కాబట్టి ఆమె జన్మదినాన ఆమెను తలచుకుంటూ అక్షరాభ్యాసం చేస్తే ఆమె అనుగ్రహంతో చదువు బాగా వస్తుందని నమ్మకం. విజ్ఞానఖనులై, గనులై మానవులు సర్వతోముఖ అభివృద్ధి పొందుతారు.

వసంత పంచమి శుభ సందర్భాన ఆ వాగ్దేవి ఆశీస్సులతో అందరికీ సర్వ శుభాలు చేకూరాలని, ప్రతిభ వికసించాలని, విజ్ఞానం వెలుగొందాలని... ఆకాంక్షిస్తున్నాము.