ఏమి చెసుకోనూ..
నన్ను వదిలి కడలి అడుగుకు చేరి,
తెచ్చిన మణి మాణిక్యాలను
అదే తీరం వెంట గులకరాళ్ళయితే
నీవు నన్ను వీడి వెళ్ళవుగా అందుకు!
నింగిలో నెలవంకని తెచ్చి నా జడలో
చూడామణిగా పెట్టాలనుకున్నావు
రోజుకో రూపం మార్చే ఆ నెలవంక నాకొద్దు
నేల మీద నడవటమే తెలిసిన నాకు
బీడు నేలలో సయితం పుట్టి ఒకరికోసం
ఆశించని ఆ గడ్డిపూవు
నాకెంతో అపురూపం!
కీర్తించే అక్షరాలకు కమనీయ కాల్పనిక
ప్రపంచానికి నేనర్హురాలిని కాదు
"పొగడ్తల అగడ్తల " కోసమని
అపార్ధాల ఊబిలో చిక్కివున్న నీకు
అర్ధాన్ని అర్ధవంతరంగా చెప్పలేక
నలుగుతున్నా నాలో నేను!
నా మనసేమి కోరుకుంటుందో తెలుసా నీకు!
ఏమార్చేది ఎవరు..
నేనా!నువ్వా!
నాతో ఊసులకు ఉబలాట పడుతున్నానంటావు,
వదిలి ఉండలేనంటావు..
కానీ..
సంద్రాల అడుగుకు ఓసారీ,
ఆకాసాన నెలరాజును తెస్తానని మరోసారి
నన్ను వదిలి పొతుంటావు!
నిత్య జీవన బంధాలలో మునిగిన నాకు
నీతో ఏకాంతంలో కలయికే అద్భుతం..
ఆకాశం లో విహరిస్తూ అలోచనల తో
కాలం గడిపే నీకు,
నా మనసేం తెలుస్తుంది!
ఇహంలో అహాన్నే చూసే నీకు
నా తపనేం తెలుస్తుంది!
ఇలలోని స్వర్గాన్ని వదిలి
గగనతలాలలోనూ
ధనపు మూటల్లోనూ ఇంకా
ఎక్కడెక్కడో వెదికే నీకేమి తెలుస్తుంది
బీడు భూమిలో ఏమున్నదో!
గడ్డి పూవులో ఏముందో!
నా మనసులో ఏముందో!!..@తులసి..