వైకుంఠ ఏకాదశి నాడు ఎలా పూజ చేయాలంటే..!?
వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది.
అందుచేత వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగా స్నానమాచరించాలి. పూజా మందిరమును శుభ్రపరచి, గడపకు పసుపు, కుంకుమలు, తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానము చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు, కుంకుమ, చందనం వంటి సుగంధద్రవ్యాలతో అలంకరించుకోవాలి.
విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలశమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి, టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి. పూజకు తామరపువ్వులు, తులసి దళములు ఉపయోగించాలి.
ఇకపోతే... వైకుంఠ ఏకాదశి రోజున జాజిపువ్వులతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లైతే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.