Search This Blog

Chodavaramnet Followers

Friday, 14 November 2014

RAAGI POWDER IS GOOD FOR STOPPING DIABETES - TIPS FOR REDUCING DIABETES


రాగి పిండి

ఇప్పుడు రాగిపిండి మార్కెట్‌లో రెడీమేడ్‌గా లభిస్తోంది. రాగిపిండిలో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) ఎక్కువగానూ, ఆ తర్వాత ప్రోటీన్లు, ఆ తదుపరి స్థానాన్ని పీచు పదార్థాలు ఆక్రమిస్తాయి. రాగిపిండిలో కొవ్వు శాతం చాలా తక్కువ. దీన్ని రాగిరొట్టెగా, రాగిముద్దగా, రాగి అంబలి రూపంలో ఇలా రకరకాలుగా తయారు చేసుకుని తింటూ ఉంటాం. కొందరు రాగి దోసెలూ, ఇడ్లీలు, లడ్డూల రూపంలోనూ దీన్ని తీసుకుంటుంటారు.

రాగిపిండిలో ఏమేముంటాయి...

వంద గ్రాముల రాగి పిండిలో 336 క్యాలరీలు ఉంటాయి. ఇందులో 80 శాతం కార్బోహైడ్రేట్లే. 12 శాతం తేమ ఉంటుంది. రాగిపిండిలో క్యాల్షియం పాళ్లు చాలా ఎక్కువ. వంద గ్రాముల రాగిపిండిలో 350 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అందుకే ఎముకల ఆరోగ్యానికీ, పటిష్టతకూ రాగిపిండి మంచి మేలు చేస్తుంది. కొంత ఐరన్ కూడా ఉంటుంది. రాగిపిండిలో అత్యావశ్యకమైన అమైనో ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటినే ఇంగ్లిష్‌లో ఎసెన్షియల్ అమైనో ఆసిడ్స్ (ఈఏఏ) అంటారు.

వ్యాలైన్, మిథియోనైన్, ఐసోల్యూసిన్, థ్రియోనైన్, ట్రిప్టోఫ్యాన్ వంటి అత్యావశ్యక అమైనో ఆసిడ్స్ అన్నవి మన శరీర సమర్థ ఆరోగ్య నిర్వహణ కోసం అత్యంత అవసరం. ఇక కొవ్వులు దాదాపు లేనట్టే. పైగా అవసరమైన మోతాదులో పీచు పదార్థాలుంటాయి. దీంతోపాటు గ్లూటెన్ ఫ్రీ కావడం వల్ల రాగిపిండి తేలిగ్గా జీర్ణమవుతుంది. తేలిగ్గా ఒంటికి పడుతుంది. అందుకే నవజాత శిశువులకు రాగిజావను మొదటి ఆహారంగా ఇస్తుంటారు. దీన్ని బట్టి ఇదెంత ఆరోగ్యకరమో, దీని ప్రాధాన్యత ఏమిటో తేలిగ్గా తెలుసుకోవచ్చు.

ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలెన్నో...!

రాగిపిండిలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ వల్ల వెంటనే ఆకలి తీరినట్లు ఉంటుంది. ఇక తెల్ల అన్నంతో పోలిస్తే రాగిపిండిలో ఉండే పీచుపదార్థాలు చాలా ఎక్కువ. కొవ్వులు దాదాపు లేనట్టే. దాంతో బరువు పెరగకపోవడం, స్థూలకాయం రాకపోవడం వంటి ప్రయోజనాలు చేకూరతాయి. ఇందులోని పీచు వల్ల తిన్న వెంటనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది.

అందుకే బరువు తగ్గాలనుకునేవారు రాగిపిండితో చేసిన వంటలు తినడం ఎంతో మేలు. ఇందులో ఉండే పీచుపదార్థాల వల్ల రాగిపిండితో చేసిన వంటకాలు మెల్లగా జీర్ణమవుతాయి. ఇందులో క్యాల్షియమ్‌తో పాటు విటమిన్ ‘డి’ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎముకల బలానికి ఇది విశేషంగా దోహదపడుతుంది. ఎదిగే పిల్లలకు రాగిపిండితో చేసిన వంటకాలు ఇవ్వడం వల్ల వాళ్లు బాగా, త్వరగా ఎత్తు పెరుగుతారు. ఇక యువకులు, పెద్దవాళ్ల ఎముకల ఆరోగ్య నిర్వహణకూ రాగులు సమర్థంగా పనిచేస్తాయి. రాగిపిండి తినేవాళ్లలో ఎముకలు బలంగా ఉండటం వల్ల ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ చాలా తక్కువ.

డయాబెటిస్ నియంత్రణకు...!

రాగులలో పాలీఫినాల్‌తో పాటు పీచు పదార్థాలు (డయటరీ ఫైబర్) ఉండటం వల్ల డయాబెటిస్‌తో పాటు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక వ్యాధులను నివారిస్తాయి. ఇందులోని పీచు వల్ల రాగులతో చేసిన వంటలు తిన్న తర్వాత రక్తంలో చక్కెర పాళ్లు పెరగడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇక ఇందులో ఉండే లెసిథిన్, మిథియోనైన్ వంటి అమైనో ఆసిడ్‌లు కొలెస్ట్రాల్ పాళ్లను గణనీయంగా తగ్గిస్తాయి. అంతేకాదు... కాలేయంలో పేరుకుపోయిన అదనపు కొవ్వులనూ అవి తొలగిస్తాయి. అందుకే కాలేయంలో కొవ్వు పేరుకుంటున్నవారు రాగులతో చేసిన ఆహారాన్ని తినడం ఎంతైనా మేలు.

రక్తహీనతను తగ్గించే రాగులు

రాగులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటితో చేసిన ఆహారాలను తీసుకుంటూ ఐరన్ శరీరంలోకి ఇంకడానికి దోహదపడే విటమిన్ ‘సి’ ఉండే పండ్లు ఎక్కువగా తింటే రక్తహీనత వేగంగా తగ్గుతుంది.

ఒత్తిడి నియంత్రణలో... !

ఏ ఇతర తృణధాన్యాలకూ లేని ఒక విశేష గుణం రాగులకు ఉంది. రాగులు ఒత్తిడిని సమర్థంగా తగ్గిస్తాయి. అందుకే యాంగ్జైటీ, డిప్రెషన్, మైగ్రేన్, నిద్రలేమి (ఇన్‌సామ్నియా) వంటి వ్యాధులతో బాధపడేవారికి రాగులు మంచి ఆహారం.