Search This Blog

Chodavaramnet Followers

Thursday, 6 November 2014

ARTICLE ABOUT IMPORTANCE OF KARTHIKA POURNAMI FESTIVAL - STORY AND PUJA PROCEDURE ON KARTHIKA POURNAMI


 కార్తీక పౌర్ణమి

విశేషాలు: జ్వాలాతోరణం -శివకేశవులకు ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి. మనకు ఆశ్వీయుజ అమావాస్య దీపావళి అయినట్టు, కార్తీక పూర్ణిమ దేవతలకు దీపావళి అని చెప్తారు. ఈ రోజు చేసే స్నాన, పాన, దాన, దీప దానములతో పాటు చూసినంత మాత్రంగానే అనంతమైన పుణ్యఫలాలు ప్రసాదించే ఉత్సవం "జ్వాలతోరణం".

కార్తీకపౌర్ణమి సాయంత్రం శివాలయాల్లో, ఆలయప్రాంగణంలో, ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలు నాటి, మరొక కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి, ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పుతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణ శివలింగంగా ఉంటుంది. దీనికి జ్వాలాతోరణం అని పేరు. దీని క్రింది నుంచి పల్లకిలో శివపార్వతులను దాటిస్తారు, భక్తులు కూడా ఈ జ్వాలాతోరణం క్రింది నుంచి దాటుతారు.

దీనికి సంబంధించి రెండు కధలు ఉన్నాయి. ఒకటి, త్రిపురాసురలనే 3 రాక్షసులను పరమశివుడు సంహరించింది ఈ రోజునే అని పురాణం చెప్తోంది. అందువల్ల దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు. దుష్టులైన రాక్షసులను సంహరించిన శివుడుం కైలాసానికి చేరగా, తన భర్తకు దృష్టి దోషం (దిష్టి) కలిగిందని భావించిన పార్వతీమాత, దృష్టిదోష పరిహారం కోసం జ్వాలాతోరణం జరిపించింది.

రెండవ కధ అమృత మధనానికి సంబంధించినది. కృతయుగంలో అమృతంకోసం దేవతలు,రాక్షసులు కలిసి క్షీరసముద్రాన్ని చిలికినప్పుడు పొగలు కక్కుతూ హాలాహలం (కాలాకూట విషం) పుట్టింది. హాలాహలం లోకాన్ని నాశనం చేస్తుందన్న భయంతో దేవతలందరూ పరుగుపరుగున పరమశివుడి వద్దకు వెళ్ళి రక్షించమన్నారు. జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీపరమేశ్వరులు. లోకహితం కోసం పరమశివుడు దానిని స్వీకరించాడు కానీ మ్రింగితే అయన కడుపులో ఉన్న లోకాలు కాలిపోతాయి, బయటకు విడిచిపెడితే, దేవతలకు ప్రమాదం అని భావించి ఆ విషాన్ని తన కంఠంలోనే పెట్టుకున్నాడు. అప్పుడు శివుడు గరళ కంఠుడు / నీల కంఠుడు అయ్యాడు. ఇది జరిగాక పరమశివునితో కలిసి పార్వతి దేవి కుటుంబసమేతంగా మూడుసార్లు జ్వాలాతోరణం దాటింది. ఈ జ్వాలాతోరణంలో కాలగా మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ, ధాన్యం నిలువ ఉంచే ప్రదేశంలోనూ పెట్టడం చేత పశువృద్ధి, ధాన్యవృద్ధి జరుగుతుంది.

ఈ జ్వాలాతోరణం దర్శించడం వల్ల సర్వపాపాలు హరింపబడతాయని,ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువు నివారింపబడుతుందని శాస్త్రం చెప్తోంది. జ్వాలాతోరణం క్రిందినుండి వెళ్ళడం వలన నరకద్వారా ప్రవేశం తొలుగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ దేహం నుంచి బయటకు రాగానే, ఆ ఆత్మను ఒక కుక్క భై అనే గట్టి అరుపులతో తరుముతుంది, తెలిసినా వాళ్ళు ఎవరు ఉండరు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఆ పరిస్థితిలో దిక్కుతోచని ఆత్మ చీకటిలోకి వెళ్ళిపోతుంది. అయినా ఆ కుక్క వెంటబడడం ఆగదు. అలా చాలా దూరం వెళ్ళాక, దూరంగా ఒక కాంతి కనపడుతుంది. అక్కడికి వెళ్తే తప్పించుకోవచ్చన భ్రమతో ఆత్మ ఆ దిశగా పరుగెట్టి, ఒక భయకరంగా మండుతున్న జ్వాలల తోరణాల నుంచి వెళ్ళి, నరకంలోకి ప్రవేశిస్తుంది. ఆత్మ వెంటపడి తరిమిన్న కుక్క భైరవుడు, శివగణాలలో ఒకడు. అప్పుడు ఆత్మ అనుభవించే బాధా వర్ణనాతీతం. అటువంటి పరిస్థితి రాకూడదని, తన బిడ్డలెవరు బాధపడకూడదని, మన మీద ప్రేమతో జగత్తుకు తండ్రి అయిన పరమశివుడు తనతో కలిసి కార్తీకపౌర్ణమి రోజున జ్వాలతోరణం దాటే వారికి ఈ నరకబాధ నుంచి విముక్తినిస్తాడు. అందుకే ప్రతి శివాలయంలో కార్తీకపౌర్ణమి నాడు విశేషంగా జ్వాలతోరణం జరుపుతారు.

ముఖ్యమైన #విధులు: ఈ రోజు చేసే ఉపవాసానికి విశేషఫలం ఉంటుంది. కార్తీక పూర్ణిమ నాడు ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక్క దీపమైనా వెలిగించి ఈ క్రింది శ్లోకం చదవాలి.

కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం న హి జన్మభాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః ||

ఈ దీపం చుసిన ప్రభావం చేత కీటకాలు (insects), పక్షులు, దోమలు, చెట్లు,మొక్కలు, ఉభయచరాలు (amphibians) అన్ని కూడా, అవి ఏ ఏ రూపాల్లో ఉన్నాయో, ఆ రూపాల్లోనే అవి మోక్షం పొందాలని, వాటికి మరుజన్మ ఉండకూడదని ప్రార్ధిస్తున్నా అని అర్ధం.ఎంతో పుణ్యం చేసుకుంటే మనకీ జన్మ వచ్చింది, ఈ జన్మలో మనం బుద్ధి ఉపయోగించి, వేదం చెప్పినట్టు బ్రతికి, జ్ఞానం పొంది, మోక్షం సాధించవచ్చు. కానీ, మిగితా జీవులకు ఆ అవకాశం లేదు. మనకు ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశి ఏదో ఒక రకంగా ఉపకారం చేస్తూనే ఉంటాయి. వాటికి ప్రత్యుపకారం చేయడం మన ధర్మం. వాటికి ప్రత్యుపకారం చేయడం కోసం, మనకు లాగే అవి భగవంతున్ని చేరుకోవడం కోసం దీపాన్ని వెలిగించి, ఈ స్తోత్రాన్ని చదవాలి.