శతాక్షి అవతారం కధ.
శతాక్షి అమ్మవారి అవతారమును గురించి వ్యాసులవారు జనమేజయ మహారాజునకు తెలియచేశారు. మరల ఎంతోమంది పెద్దలు ఆ కధలను క్లుప్తంగా మనకు తెలియచేశారు.
హిరణ్యాక్షుడి వంశంలో రురువు అనే దానవుడుండేవాడు. అతని కొడుకు దుర్గముడు. మహాపరాక్రముడు. కానీ దుష్టచిత్తుడు. దేవవిరోధి.
దేవతల్ని శాశ్వతంగా నిర్మూలించడం ఎలా అని ఆలోచించేవాడు ఎప్పుడూ.
చివరికి అతనికో ఆలోచన తట్టింది-దేవతలకు బలాన్ని యిచ్చేవి వేదాలు. వాటిని వాళ్ళ దగ్గర లేకుండా చేస్తే వాళ్ళ రోగం కుదురుతుంది గదా - అని.
ఆలోచన తట్టిందే తడవుగా హిమాలయానికి వెళ్ళి వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. విరించి సంతోషించి అతనికి ప్రత్యక్షమై వరమిస్తానన్నాడు.
"పద్మాసనా! బ్రాహ్మణుల వద్దా, దేవతల వద్దా ఉన్న వేదాలు, మంత్రాలు నా అధీనం కావాలి. దేవతలు నా చేతిలో ఓడిపోవాలి" అంజలి ఘటించాడు దుర్గముడు.
"అలాగే" అన్నాడు పితామహుడు.
బ్రహ్మదేవుడి వరప్రభావం చేత బ్రాహ్మణులు వేదాలు మరచిపోయారు. సంధ్యావందనం, హోమం, జపతపాలు, యజ్ఞాలు మొదలైన నిత్యనైమిత్తిక కర్మలన్నీ మానేశారు. యజ్ఞాల వల్ల లభించే ఆహారం లేక దేవతలు శక్తిహీనులయ్యారు.
వేదాలు తన వశం కావడంతో
దుర్గముడు మహాబలవంతుడయ్యాడు.
అనతికాలంలోనే దుర్వార పరాక్రమంతో అమరావతి మీద దండెత్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. చేసేదిలేక దేవతలు కొండ గుహల్లోనూ, ఆరడవుల్లోనూ కాలం గడుపుతున్నారు.
ఇది ఇలా ఉండగా యజ్ఞ యాగాది క్రతువులు లేనందువల్ల దేశంలో అనావృష్టి విలయతాండవం చేసింది. చెరువులు, నూతులు, నదులు ఎండిపోయాయి. పాడిపంటలు లేక అన్నోదకాలు లేక ప్రజలు మలమలా మాడిపోయారు. ప్రపంచములో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
వంద సంవత్సరాలు గతించాయి.
ఈ విపత్కర పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలి ?
ఎవరికీ ఏమీ అంతుపట్టలేదు.
చివరికి కొంతమంది విప్రులు హిమాలయానికి వెళ్ళి అనన్యమైన భక్తితో జగజ్జననిని ప్రార్ధించారు.
"అంబా! శాంభవీ ! మాకు నువ్వే శరణ్యం. సకల భువనాలకు నువ్వే ఆధారం. నువ్వు లేని జగత్తు జడ పదార్ధం. మాతా ! ప్రపంచానికి ఉపద్రవం వాటిల్లింది. ప్రజలకు తిండితిప్పలు లేవు. తాగటానికి నీళ్ళు లేవు. మా నిత్యకృత్యాలన్నీ నిలిచిపోయాయి. ఇంకా జీవనం సాగించడం మా వల్ల కాదు. పామరులమైన మా మీద కరుణామృతాన్ని కురిపించు. మా దోషాలన్నింటినీ పరిహరించి , ఈ ఘోర విపత్తు నుంచి మమ్మల్ని ఉధ్ధరించు తల్లీ!"
అమ్మ హృదయం కరుణతో కరిగిపోయింది.
శ్యామల వర్ణంతో , శత (అనంత ) నేత్రాలతో, కోటి సూర్యప్రభలతో, శాకపాకఫలయుక్తమైన హస్తాలతో దేవి ప్రసన్నురాలైంది.
అమ్మ కన్నులు శ్రావణమేఘాలై తొమ్మిది రాత్రులు నిర్విరామంగా వర్షించాయి.
నదీనదాలు నిండిపోయాయి. వాపీ కూపాదులు జలసమృధ్ధాలైనాయి. తరువులు పుష్ప ఫలభరితాలైనాయి. ఓషధులు తేజోవంతములైనాయి. ప్రకృతి నిండు గర్భిణిలాగా శోభించింది.
ప్రజల మనసులలో మల్లెలు గుబాళించాయి. ఉల్లాసం వెల్లివిరిసింది.
దేవతలు ఆనందించారు. కొండగుహల్లోంచి, కారడవుల్లోంచి వచ్చి, విప్రులతోను మునులతోను కలిసి దేవిని నుతించారు.
"తల్లీ! నీ దయ వల్ల ప్రపంచం యావత్తూ సుభిక్షం అయింది. అనంతాలైన కన్నులతో మమ్మల్ని చల్లగా చూశావు కాబట్టి శతాక్షి అనే పేరు నీకు సార్ధకం అవుతుంది. ఈశ్వరీ! మేమందరం ఆకలితో బాధపడుతున్నాం. ఇంకా నిన్ను ప్రార్ధించే ఓపిక మాకు లేదు. ఒక్కటిమాత్రం కోరుకుంటున్నాం. వేదాల్ని మళ్ళీ మా ఆధీనం చెయ్యి తల్లీ !"
దేవి తాను తెచ్చిన శాకపాకాల్ని ఇచ్చి వాళ్ళ ఆకలి మంటల్ని చల్లార్చింది. అందుకనే ఆమె ' శాకంభరి ' అయింది.
చారుల ద్వారా ఈ విషయాన్ని విన్నాడు దుర్గముడు.
ఆగ్రహావేశంతో హుటాహుటిగా బయలుదేరి హిమాలయంలో దేవీసమక్షములో వున్న దేవమునిగణాల మీద బాణాలు గుప్పించాడు.
పరమేశ్వరి అతని బాణాలు వాళ్ళమీద పడకుండా తేజోమయమైన చక్రాన్ని గొడుగులాగా అడ్డంపెట్టి, తాను మాత్రం ముందుకొచ్చి దుర్గముణ్ణీ, అతని సైన్యాన్నీ శరపరంపరలతో ముంచెత్తింది.
దేవీ దైత్యుల మధ్య చెలరేగిన అప్పటి సంకులసమరంలో దేవి తన శరీరం నుంచి కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగళ, మాతంగి, త్రిపురసుందరి, కామాక్షి, తులజ, జంభిని, మోహిని, ఛిన్నమస్త, గుహ్యకాళి, దశసహస్రబాహుక అనే తీవ్రశక్తుల్ని సాయుధ హస్తాలతో పుట్టించింది. ఆ శక్తులు ఒక్కపెట్టున విజృంభించి గంభీరంగా గర్జిస్తూ, కరాళ నృత్యాలు చేస్తూ, అడ్డం వచ్చిన అసురసైన్యాన్ని అణచివేస్తూ , కదనరంగాన పదిరోజులపాటు విశృంఖలంగా విహారం చేశారు.
రాక్షస సైన్యమంతా నశించింది. చివరికి దుర్గముడొక్కడే మిగిలిపోయాడు.
పదకొండో రోజున బాహాబల గర్వం పొంగులు వారగా దుర్గముడు దేవీశక్తుల్ని శక్తిహీనం చేసి. జగదంబకు ఎదురు నిలిచి వీరోచితంగా పోరాటం సాగించాడు.
అంబ అలిగి సారధిని, రధాన్నీ రూపుమాపి అగ్ని సమానములైన అమ్ములతో అతని వక్షాన్ని చీల్చింది.
వటవృక్షం లాగా వాడు భూమిమీద వాలిపోయాడు. వాడిశరీరం నుంచి ఒక తేజం వెలువడి దేవిలో లీనమైపోయింది.
ఆమె వేదాల్ని విప్రుల వశం చేసింది. అమరులు ఆనందించారు.
శతాక్షిని వినయావనత వదనాలతో వినుతించారు.
ఆ తల్లి కదా తమ బాధలు చూసి , తమకోసం ఇంత సహాయం చేసిందని అందరూ అమ్మను ఎంతగానో కీర్తించారు.
దుర్గముణ్ణి సంహరించినందువల్ల అంబకు ' దుర్గ ' అనే పేరొచ్చింది. ..