కార్తీక స్నానసంకల్పం మరియు పితృ తర్పన
ప్రార్ధనం : 'నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమొస్తుతే || (అనుకుంటూ ఆచమనం చేసి)
సంకల్పం : దేశ కాలౌ సంకీర్త్య - గంగావాలుకాభి సప్తర్షి మండల పర్యంతం కృతవారాశే: పౌదరీ కాశ్వమేధాది సమస్త క్రతు ఫలావాప్తర్ధం, ఇహ జన్మని జన్మాన్తరేచ బాల్య కౌమార యౌవన వార్ధ కేషు జాగ్రత్ స్వప్న సుషుప్త్య వస్థాషు జ్ఞానతో జ్ఞానతశ్చ, కామతో కామతః స్వత: ప్రేరణయా సంభావితానాం సర్వేషాం పాపానా మపానో దనార్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫలపురుషార్ధ సిద్ధ్యర్ధం, క్షేమ స్థయిర్య విజయా యురారోగ్యై శ్వర్యాదీనాం ఉత్తరోత్త రాభి వ్రుద్ధ్యర్ధం శ్రీ సివకేశావానుగ్రహ సిద్ధర్ధం వర్షే వర్షే ప్రయుక్త కార్తీకమాసే .......... వాసర (ఏ వారమో ఆవారం పేరు చెప్పుకొని) యుక్తాయాం ............ టితో (ఏ టితో ఆ తిథి చెప్పుకోవాలి) శ్రీ .......... (గోత్ర నామం చెప్పుకొని) గోత్రాభి జాతం ....... (పేరు చెప్పుకొని) నామతే యోహం - పవిత్ర కార్తీక ప్రాతః స్నానం కరిష్యే || (అని, స్నానం చేయాలి). అనంతరం
మంత్రం : " తులారాశింగతే సూర్యే, గంగా త్ర్యైలోక్య పావనీ,
సర్వత్ర ద్రవ రూపేన సాసం పూర్ణా భవేత్తదా || "
అనే మంత్రముతో - ప్రవాహానికి ఎదురుగానూ, తీరానికి పరాన్ గ్ముఖం గానూ స్నానం ఆచరించి, కుడిచేతి బొటనవ్రేలితో నీటిని ఆలోడనం చేసి, 3 దోసిళ్ళ నీళ్ళు తీరానికి జల్లి, తీరం చేరి, కట్టుబట్టల కోణాలను నీరు కారేలా పిండాలి. దీనినే యక్షతర్పణ మంటారు. అనంతరం (పొ) డి వస్త్రాలను, నామాలను ధరించి, ఎవరెవరి కులాచారాల రీత్యా వారు వారు సంధ్యావందనం గాయత్ర్యాదులను నెరవేర్చుకొని నదీతీరంలో గాని, ఆలయానికి వెళ్లిగాని - శివుణ్నో, విష్ణువునో అర్చించి ఆవునేతితో దీపారాధానం చేసి, అనంతరం స్త్రీలు తులసి మొక్కనూ, దీపాన్నీ- పురుషులు కాయలున్న ఉసిరి కొమ్మనూ, దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణయుతంగా దానం చేయాలి.
దానముచేయువారు చెప్పవలసిన మంత్రము
ఓం ఇదం ఏతత్ అముకం (ఒమిటి చిట్టా రోధనాత్ - ఇద మేతత్ దారయిత్వా ఏత దితి ద్రుష్ట యామాస అముకమితి వస్తు నిర్దేశన - మితి (స్మార్తం) అద్య రీత్యా ( రీతినా) (అద్యయితి దేశకాలమాన వ్రుత్యాది సంకల్పం రీత్యేతి ఉద్దేశ్యయత్ ) విసర్జయేత్ (అని - ప్రాచ్యం)దదామి (అని వీనం) ఎవరికీ తోచిన శబ్దం వారు చెప్పుకోనవచ్చును.
దానము తీసుకోనువారు చెప్పవలసిన మంత్రం
(దానం చేసేటప్పుడు, ఆ దానాని పరిగ్రహించే వ్యక్తి ఈ దిగువ విషయాలను స్మరిస్తూ దానం తీసుకోవాలి).
ఓం ............ ఏతత్ ................ ఇదం
( ఓమితి చిత్త నిరోధనస్యాత్ - ఏటదితి కర్మణ్యే - ఇద్మిటి కృత్య మిర్ధాత్) అముకం - (స్వకీయ ప్రవర చెప్పుకోనవలెను).
అద్యరీత్యా - దేశకాలమాన పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకొని - దాత్రు సర్వపాప అనౌచిత్య ప్రవర్త నాదిక సమస్త దుష్ఫల వినాశనార్ధం అహంభో (పునః ప్రవర చెప్పుకొని) - ఇదం అముకం దానం గృహ్ణామి ........... (ఇద మితి ద్రుష్ట్య్వన, అముక్మిటి వస్తు నిర్దేశాది త్యా దయః) అని చెప్పుకోనుచూ ' పరిగ్రుహ్ణామి లేదా ' స్వీ గ్రుహ్ణామి అని అనుచూ స్వీకరించాలి.
శ్రీ శివస్తోత్రం
శ్లో || వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగ ధరం వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయించ వరదం వందే శివం శంకరం ||
శ్రీ విష్ణు సోత్రం
శ్లో || శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘ వర్ణం శుభాంగం
లక్ష్మీ కాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం
వందేవిష్ణుం భవభయ హారం సర్వలోకైక నాథం ||
కార్తీకంలో పితృ తర్పణం
వ్రతస్తులు మరో రెండు ఘడియల్లో తెల్లవారుతుందనగా నిద్ర లేచి, శుచియై నువ్వులు, దర్బలు, అక్షతలు, సుమాలు, గంధము తీసుకుని నది వద్దకు వెళ్ళాలి. చెరువులో గానీ, దైవ నిర్మిత జలాశయాల్లో గానీ, నదిలోగానీ, సాగరసంగమాల్లో గానీ స్నానం చేస్తే ఒకదాని కంటే ఒకటి పదిరెట్ల పుణ్యం వస్తుంది. ఏ పుణ్యతీర్ధంలో స్నానం చేసినా అంతకు పదిరెట్ల ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువును స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలు ఇవ్వాలి.
అర్ఘ్య మంత్రం
నమః కమలనాభాయ నమస్తే జలశాయినే |
నమస్తేస్తు హృషీకేశ గృహాణార్ఘ్యం నమోస్తుతే ||
అలా అర్ఘ్యాలు ఇచ్చి, దైవ ధ్యాన నమస్కారాదులు చేసి ''ఓ దామోదరా! ఈ జలంలో స్నానం చేయబోతున్నాను. నీ అనుగ్రహం వల్ల నా పాపాలన్నీ నశించిపోవును గాక! హే రాధారమణా! విష్ణూ! కార్తీక వ్రత స్నాతుని అవుతున్న నా అర్ఘ్యాన్ని స్వీకరించు'' అని ప్రార్ధించాలి.
స్నానవిధి
వ్రతస్తులు ఇలా గంగ, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి, మొలలోతు నీటిలో దిగి, యధావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతో యతులు తులసిమొక్క పాదులో ఉన్న మట్టితోనూ స్నానం చేయాలి. విదియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య తిథుల్లో నువ్వులు, ఉసిరికాయలతో స్నానం చేయకూడదు.
ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి, ఆ తర్వాతే మంత్ర స్నానం చేయాలి. ''భక్తిగమ్యుడై ఎవరు దేవకార్యార్ధం త్రిమూర్తి స్వరూపుడయ్యాడో సర్వ పాపహరుడైన ఆ విష్ణువు నన్ను ఈ స్నానంతో పవిత్రుని చేయుగాక! విష్ణు ఆజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలు నన్ను పవిత్రుని చేయుగాక!
యజ్ఞ మంత్ర బీజ సంయుతాలైన వేదాలు, వశిష్ట కశ్యపాది మునివర్యులు నన్ను పవిత్రుని చేయుగాక. గంగాది సర్వ నదులు, తీర్ధాలు, జలధారలు, సప్త సాగరాలు నన్ను పవిత్రుని చేయుగాక. ముల్లోకాల్లోని అరుంధత్యాది పతివ్రతామ తల్లులు యక్ష, సిద్ధ, గరుడాదులు, ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగాక'' - అనుకుంటూ స్నానం చేసి, దేవ, ఋషి, పితృ తర్పణాలను విధిగా చేయాలి.
కార్తీకమాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడుస్తారో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు. ఈ తర్పణ తర్వాత నీటి నుండి తీరానికి చేరి ప్రాతః కాల అనుష్ఠానం పూర్తిచేసి, విష్ణు పూజ చేయాలి. తర్వాత
అర్ఘ్య మంత్రం
ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధి నామ |
గృహాణార్ఘ్యం మయా దత్తం రాధయా సహితో హరే ||
అనే మంత్రంతో గంధ పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని, క్షేత్ర తీర్ధ దైవాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేద పారీణులైన బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ తాంబూలాదులిచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు
తీర్ధాని దక్షిణే పాదే వేదాస్త న్ముఖ మాశ్రితాః |
సర్వాంగేష్వాశ్రితాః దేవాః పూజితోసిమదర్చయా ||
''కుడి పాదంలో సర్వ తీర్ధాలు, ముఖంలో చతుర్వేదాలు, అవయవాల్లో సర్వ దేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వల్ల పరిత్రుణ్ణి అవుతున్నాను'' అనుకోవాలి. అటుమీదట వ్రతస్తులు హరి ప్రియమైన తులసికి ప్రదక్షిణ చేసి, ''దేవతల నుండి వచ్చి, మునుల పూజలు అందుకుని, విష్ణు ప్రేయసివైన ఓ తులసీ! నీకు చేస్తున్న నమస్కారం నా పాపాలను నాశనం చేయుగాక'' – అనుకుని నమస్కరించుకోవాలి.
పిమ్మట స్థిర బుద్ధితో హరికథ, పురాణ శ్రవణాదుల్లో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో, వాళ్ళు తప్పనిసరిగా దైవలోకం వెళ్తారు. సమస్త రోగహరణం, పాపమారకం, సద్బుద్ధిదాయకం, పుత్రపౌత్ర ధనప్రదం, ముక్తికారకం, విష్ణుప్రీతికరం అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో వేరొకటి లేదు.