మళ్ళీ వచ్చిన మృతసంజీవని
మృత సంజీవని మొక్కగా భావించబడుతున్న 'రోహి డియాలో'
నిర్జీవంగా పడిఉన్న లక్ష్మణుని ప్రాణాలను కాపాడటానికి ఆంజనేయుడు హుటాహుటిన హిమాలయాలకు వెళ్ళి 'సంజీవని' మొక్కను తెచ్చి ప్రాణదానం చేసిన విషయం మనందరికి తెలుసు.
ఇటీవల హిమాలయ పర్వతాలలో అతి ఎత్తైన ప్రదేశంలో నాడు లక్ష్మణుని బ్రతికించిన 'సంజీవని' లాంటి మొక్క ఒకటి దొరికింది. పర్వతాలలో నివసించే ప్రజలు దీనిని 'సోలో' అని పిలుస్తుండగా, శాస్త్రవేత్తలు 'రోహ్ డియాలో' అని పేరు పెట్టారు. ఈ మొక్క ఆకును స్థానికులు కూరగా చేసుకొని తింటారు. ఈ మొక్కకు అనేక ఉత్తమ లక్షణాలున్నాయని భారత పర్వత పరిశోధనా సంస్థ (DIHAR) సంచాలకులు శ్రీ శ్రీవాత్సవ పేర్కొన్నారు. అవి చూడండి :
1) సంజీవని రోగనిరోధక శక్తి పెంచుతుంది.
2) అత్యల్ప ఉష్ణోగ్రత కల, నీరు గడ్డకట్టే అంత చలిప్రదేశాలలోను, ఆక్సిజన్ (ప్రాణవాయువు) లభించని ప్రదేశాలలో సహితం ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
3) అణుబాంబు పేల్చినపుడు వెలువడే అతి ప్రమాదకరమైన రేడియోధార్మిక కిరణాల నుండి మనిషిని కాపాడుతుంది.
4) విపరీతంగా మార్పులకు గురయ్యే వాతావరణం కారణంగా ఎదురయ్యే అన్ని సమస్యలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది.
5) జీవరసాయన ఆయుధాల (Bio-Chemical Warfare) నుండి వెలువడే గామా కిరణాల నుండి రక్షిస్తుంది.
ఈ విషయాలన్నీ కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రక్షణశాఖ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) పరిశోధనలు జరిపి 'ఈ మొక్క మైనస్ 50 డిగ్రీల శీతల వాతావరణంలో పనిచేసే మన సైనికులకు ఎంతో రక్షణనిస్తుందని ప్రకటించారు. రామాయణంలో చెప్పిన సంజీవని ఇదే అయిఉండవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.