Search This Blog

Chodavaramnet Followers

Sunday, 31 August 2014

VINAYAKA CHAVITHI FESTIVAL ARTICLE ABOUT LORD VIGNESWARA AND HIS TELUGU NAMES


వినాయక చవితి సందర్భంగా అచ్చతెలుగులో ఆయన్ని ఏమని పిలిచేవారో చూద్దామా??

సీ. ఇద్దరుతల్లుల ముద్దుబిడ్డఁడు, పని చెఱుపులదొర చేటచెవులవేల్పు
వంకరతొండంబు వాఁడేనుఁగుమొగంబు, దేవర పాఁపజందెములమేటి
మ్రొక్కువారలపనుల్ చక్కఁజేసెడుసామి, గఱికపూజల మెచ్చు గబ్బివేల్పు
ముక్కంటిపండుల మెక్కెడితిండీండు, ముక్కంటిగారాబు ముద్దుపట్టి

పెద్దకడుపు వేల్పు పిళ్ళారి కుడుముల
తిండికాఁడు కొక్కుతేజిరౌతు
గుజ్జువేలు పొంటికొమ్ముదేవర వెన
కయ్య యన వినాయ కాఖ్యలీశ

తాత్పర్యము: ఇద్దరుతల్లులముద్దులబిడ్డఁడు= గంగాపార్వతులకిద్దఱకుఁ ముద్దుల కొడుకు, పనిచెఱుపులదొర= కార్యవిఘాతము చేయుదేవుడు, చేటచెవులవేల్పు= చేటలవలె వెడల్పయిన చెవులుగల దేవుడు, వంకరతొండంబువాడు= వంకరగానుండు తొండము గలవాడు, ఏనుఁగు మొగంబు దేవర= గజవక్త్రముగల దేవత, పాఁపజందెములమేటి= పాములే యజ్ఞోపవీతముగాఁ దాల్చుప్రభువు, మ్రొక్కువారలపనుల్ చక్కఁజేసెడుసమి= తన్ని గొల్చువారి కార్యములను అనుకూలపరిచే దేవుడు, గరికపూజల మెచ్చు గబ్బివేల్పు= గఱికపూజకు మెచ్చుకొనెడి గొప్ప దేవుడు, ముక్కంటిపండుల మెక్కెడుతిండీండు= టెంకాయలను తినెడువాడు, ముక్కంటిగారాబుముద్దుపట్టి=త్రినేత్రుడగునీశ్వరునికి మిక్కిలి యిష్టుడగు కుమరుడు, పెద్దకడుపు వేలుపు= లంబోదరుడగు దేవుడు, పిళ్ళారి, కుడుములతిండికాడు= కుడుకులు తినువాడు, కొక్కుతేజిరౌతు= మూషికవాహనము ఎక్కు దేవుడు, గుజ్జువేలుపు= పొట్టిదేవుడు, ఒంటికొమ్ముదేవర=ఒక దంతముగల దేవుడు, వెనకయ్య ఇవన్ని వినాయకుని పేర్లు.

(పైడిపాటి లక్ష్మణకవి ప్రణీత "ఆంధ్రనామ సంగ్రహము" నుండి)

సీ. ముక్కంటితొలిపట్టి మొట్టికాయల మెప్పు, గొప్పబొజ్జగలాఁడు గుజ్జువేల్పు
గబ్బుచెక్కిళ్ళ మెకముమోముగలసామి, కలుఁగులాయపుందేజి బలుసిపాయి
గుంజిళ్ళుపెట్టించుకొనుమేటి పిళ్ళారి, కుడుముదాలుపు పెద్దకడుపువేలు
పొంటిపల్లుదొర ముక్కంటిపండులమెక్కు, దేవర చిలువజందెములమేటి

జమిలితల్లులబిడ్డ పెద్దమెయిప్రోడ
చేఁటవీనులదణి పని చెఱుపువాఁడు
మొదటివేలుపు వెనకయ్య పుంజుదారి
పెద్ద యనఁ దగు గణపతికి పేళ్ళు సాంబ

(కస్తూరి రంగకవి ప్రణీత "సాంబనిఘంటువు" నుండి)