చాలామంది లక్ష్మీకటాక్షం కలగడానికి చాలా పూజలు చేస్తుంటారు. లక్ష్మీకటాక్షం కలగాలంటే ముందు బద్ధకం వదలాలి. బద్దకం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని దూరం చేస్తుంది. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు ఉదయమే, సూర్యోదయానికి ముందే కుటుంబసభ్యులందరూ నిద్రలేచి, స్నానాలు మిగించి దైవారాధన, దీపారాధన చేస్తారో, నిత్యమూ ప్రాతఃకాలంలో ఏ ఇంటి వాకిలి శుభ్రపరచి, అలికి ఉంటుందో, ఏ ఇంట్లో వ్యక్తులు ఉదయిస్తున్న శ్రీ సూర్యనారాయణ స్వామికి నమస్కరిస్తారో, ఆ ఇంటికి మాత్రమే వస్తుంది సిరులతల్లి లక్ష్మీదేవి.
ఎవరు ఇంట్లో నిత్యం విడువకుండా ఉదయం, సాయంత్రం సంధ్యాకాలంలో దీపారాధన చేస్తారో, ఆ ఇంట్లో మాత్రమే లక్ష్మీకటాక్షం ప్రసరిస్తుంది. దీపారాధనకు అంటే విద్యుత్‌దీపాలు వేయడం కాదు, ఆవునెయ్యి/నువ్వుల నూనెతో వెలిగించిన దీపమే లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది. అలా కాకా ఏ ఇల్లూ దీపం పెట్టకుండా ఉంటుందో, ఆ ఇల్లు శ్మశానంతో సమానమని, అటువంటి ఇళ్ళకు తాను వెళ్ళలని శ్రీ మహాలక్ష్మి స్వయంగా చెప్పింది.
అనవసరంగా మాట్లాడేవారు, ఇతరులకు సంబంధించిన విషయాల మీద విమర్శిస్తూ కాలక్షేపం చేసేవారు, మద్యపానం, ధూమపానాం, మత్తుపదార్ధాలు స్వీకరించేవారి వద్ద లక్ష్మీ క్షణం కూడా నిలువదు. దొంగలు, మోసగాళ్ళు, అబద్దాలాడేవారంటే లక్ష్మీదేవికి గిట్టదు. ఎవరికీ ఏదీ దానం చేయనివారికి లక్ష్మీదేవీ ఏదీ ఇవ్వదు.
కేవలం లక్ష్మీదేవిని మాత్రమే ఆరాధిస్తే సరిపోదు. శ్రీ మహావిష్ణువును కూడా ఆరాధించాలి. అమ్మవారి విష్ణుమూర్తిని అస్సలు విడిచిఉండలేదట. అందుకే అమ్మకు నిత్యాన్నపాయిని అని పేరు. లక్ష్మీదేవికి సంబంధించిన ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, తప్పకుండా విష్ణు మూర్తిని ఆరాధించాలిసిందే. అప్పుడే ఫలితం లభిస్తుంది.
ఓం నమో లక్ష్మీనారాయణాయ