Search This Blog

Chodavaramnet Followers

Wednesday, 20 August 2014

ARTICLE ABOUT SRI GOLINGESWARA SWAMY TEMPLE AT BIKKAVOLE VILLAGE - NEAR SAMALKOT - ANDHRA PRADESH - INDIA - MUST VISIT



శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం బిక్కవోలు

ఈ గ్రామంలో తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన అనేక మందిరాలున్నాయి. క్రీ.శ.849 - 892 మాద్యకాలంలో తూర్పు చాళుక్య రాజు 3వ గుణగ విజయాదిత్యుని పేరు మీద ఈ వూరికి ఆ పేరు వచ్చింది. వారి కాలంలో కట్టబడిన అనేక ఆలయాలలో శ్రీరాజరాజేశ్వరి ఆలయం మరియు శ్రీ చంద్రశేఖరస్వామి ఆలయం ముఖ్యమైనవి. ఇవి చక్కని శిల్పకళతో ఆలరారుతున్నవి.

సామర్లకోటకు 17కిలో మీటర్ల దూరంలో ఈ బిక్కవోలు గ్రామం ఉంది
భక్తుల కొంగుబంగారంగా ,ఆరాధ్య దైవంగా విశేష పూజలందుకుంటున్న బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ది గాంచిన బిక్కవోలు ఆలయ చరిత్రపై కధనం. క్రీ.శ.8వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు పాలించిన రోజులలో గోదావరి తీరంలో అనేక దేవాలయాలు నిర్మించారు. చాళుక్యులలో గొప్పవాడైన విజయాదిత్యుని తండ్రి నరేంద్ర మృగరాజు 108 యుద్దాలు చేసి శత్రు, సైన్యాలను హతమార్చాడు.

యుద్దాలలో అనేక మందిని చంపడంతో పాపభీతితో 108 శివాలయాలను మృగరాజు నిర్మించాడు. బిక్కవోలు పరిసర ప్రాంతాలలో నిర్మించిన 108 శివాలయాల్లో కొన్ని తురుష్కుల దాడిలో ధ్వంసం కాగా మరికొన్ని శిధిలం అయ్యి నేలమట్టం అయ్యాయి. బిక్కవోలులో పురాతన దేవాలయాలు చాళుక్యుల చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి. మూడు పురాతన దేవాలయాలు గ్రామ పరిసరాలలో వుండగా గ్రామ నడిబొడ్డులో కుమార సుబ్రహ్మణ్యశ్వర స్వామి, గోలింగేశ్వర స్వామి, చంద్రశేఖర స్వామి ఆలయాలు వున్నాయి.
గోలింగేశ్వర స్వామి ఆలయంలో గోలింగేశ్వరస్వామితో పాటు పార్వతీదేవి, సహజ సిద్దమైన పుట్టతో సుబ్రహ్మణ్యశ్వరుడు, వినాయకుడు, వీరభద్ర సహిత భద్రకాళి అమ్మవార్లతో మొత్తం శైవకుటుంబం అంతా ఒకేచోట కొలువై వున్నారు. ఆలయానికి సమీపంలో క్షేత్రపాలకుడైన విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల ఆలయం కూడా ఉంది. తూర్పు చాళుక్యుల అనంతరం బిక్కవోలు పెద్దాపురం మహారాజుల అధీనంలోకి వచ్చింది. పెద్దాపురం మహారాజు శ్రీ సూర్యనారాయణ తిమ్మ గజపతి పాలనలో బిక్కవోలు ప్రాంతంలో గోవులు సహజ సిద్దమైన పుట్టలపై పాలు విడిచేవట.అందుకే ఇక్కడ శివలింగాన్ని గోలింగేశ్వరస్వామిగా భక్తులు పిలుస్తారు.

ఆలయంలో ఇప్పటికీ సహజ సిద్దమైన పుట్ట దర్శనమిస్తుంది. సంతానం లేని తిమ్మ గజపతి సంతానం కోసం సుబ్రహ్మణ్యశ్వరస్వామి ఆలయం నిర్మించి సంతానం పొందారట. అందుకే షష్ఠి రోజున సంతానార్దులైన స్త్రీలు పుట్టపై వుంచిన నాగులచీరను ధరించి ఆలయం వెనుక శయనిస్తారు. ఇలా శయనించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని వారి నమ్మకం. 1100సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాలైన వాటిపై శిల్పసంపద ఎంతో సుందరంగా ఉంటుంది. బిక్కవోలు ఆలయాల సందర్శనకు ఏడాది పొడువునా భక్తులు వస్తుంటారు. బిక్కవోలు హైస్కూలు వద్ద ఉన్న పురాతన వినాయకుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. ఈ విగ్రహం 10 అడుగుల పొడవు, 6అడుగుల వెడల్పుతో ఎంతో సుందరంగా భక్తులను కనువిందు చేస్తుంది.

* నేటికీ చెక్కు చెదరని చాళుక్యుల శిల్పకళా వైభవం

1100 ఏళ్ళ నాటి బిక్కవోలు ఆలయాలపై ఉన్న శిల్ప సంపద నేటికీ చెక్కు చెదరకుండా చాళుక్యుల శిల్పకళావైభవానికి సాక్ష్యాలుగా నిలిచాయి. గ్రామ పరిసరాలలో ఉన్న వీరభద్రుని గుడి, కంచర గుడి, నక్కల గుడులపై అప్పటి శిల్పులు ఎంతో నేర్పుతో శిల్పాలు చెక్కి నిర్మించారు. ఈ ఆలయాల నిర్మాణాలకు సిమ్మెంటు, ఇసుక వాడకుండా రాళ్ళను ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మించడం విశేషం. తురుష్కుల దాడిలో చాలా ఆలయాలు ధ్వంసం నేలమట్టమయ్యాయి. అయితే గ్రామంలో అప్పడప్పుడు వీటి అవశేషాలు బయల్పడుతుంటాయి.

ఇటీవల ఒక శివలింగం, వర్దమాన వీరుని చిత్రంతో వున్న ఒక శిల బయల్పడ్డాయి.శ్రీ లక్ష్మీగణపతి దేవాలయానికి సమీపంలోనే గోలింగేశ్వర స్వామి ఆలయం వుంది. ఇందులో శ్రీ సుబ్రహ్మన్యేశ్వర ఆలయంలో పుట్ట వున్నది. ఆ పుట్ట మన్నును భక్తులు మహిమగలదని స్వీకరిస్తారు.ఈ దేవాలయ ప్రాంతంలో పెద్ద సొరంగ మార్గం వుండేదనీ ఆ మార్గాన్ని అప్పటి బ్రిటిష్ పాలకులు "బిగ్ హోల్" అని పిలిచేవారనీ, ఆ ఆంగ్ల పదాన్ని స్థానిక ప్రజలు బిక్కవోల్ అని పలికేవారనీ , అప్పటి నుండి ఆ ప్రాంతం బిక్కవోలుగా పిలవబడుతున్నదనీ కొందరు చెబుతారు.